
డిగ్రీ సిలబస్‌లో సమూల మార్పులు
- చర్యలు చేపట్టిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. రాష్ట్ర పరిస్థితులు, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా బీఏ, బీకాం తదితర కోర్సుల్లో సిలబస్‌ను మార్పు చేయాలని నిర్ణయించింది. సోషల్ సెన్సైస్, భాషా పరమైన సబ్జెక్టుల్లోనూ మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా శనివారం బీకాం కామర్స్ సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై ఉన్నత స్థాయి కమిటీతోపాటు సూపర్‌వైజరీ, వర్కింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది.
మరో పది రోజుల్లో సోషల్ సెన్సైస్, భాషా సబ్జెక్టుల్లో సిలబస్ మార్పు కోసం కమిటీలను ఏర్పాటు చేయనుంది. కామర్స్ సిలబస్‌లో మార్పులపై చర్చించేందుకు తెలంగాణలోని విశ్వవిద్యాలయాల డీన్స్, విభాగాధిపతులు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లతో శనివారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యా మండలి వైస్‌ఛైర్మన్లు మల్లేశ్, వెంకటాచలం భేటీ అయ్యారు. ఫిబ్రవరి నాటికి అన్ని సబ్జెక్టుల్లో మార్పులను పూర్తి చేసి, వచ్చేవిద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేవాలని నిర్ణయించారు.
కామర్స్‌లో మార్పులపై సంబంధిత సబ్జెక్టు డీన్స్‌తో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీతోపాటు అన్ని విశ్వ విద్యాలయాల బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, విభాగాధిపతులతో కూడిన సూపర్‌వైజరీ కమిటీ, డిగ్రీ కాలేజీ అధ్యాపకులతో కూడిన వర్కింగ్ కమిటీలు సిలబస్‌లో మార్పులను ఖరారు చేస్తాయి. ముఖ్యంగా రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా కామర్స్ సిలబస్‌లో మార్పులు తీసుకువస్తారు.
పారిశ్రామికరంగంలో పరిస్థితులు, భవిష్యత్తులో అవసరాలపైనా పాఠ్యాంశాలు ఉంటాయి. వివిధ రంగాల వారీ స్థితిగతులపై విద్యార్థుల్లో పూర్తిస్థాయి అవగాహన కలిగేలా ఈ మార్పులు తెస్తారు. దేశ వాణిజ్య విధానంతోపాటు విదేశీ వాణిజ్య విధానాలపైనా పాఠ్యాంశాలు ఉంటాయి. మూడేళ్ల కోర్సులో 16 సబ్జెక్టుల్లో సిలబస్‌ను మార్పు చేయనున్నారు.
స్వల్పకాలిక కోర్సులకు హాజరు తప్పనిసరి
డిగ్రీ పూర్తి కాగానే విద్యార్థులకు ఉపాధి లభించేలా బీకాం చదువుతున్నపుడే సర్టిఫికెట్ కోర్సులను, స్వల్పకాలిక కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. వీటితోపాటు విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు నైపుణ్యాల అభివృద్ధిపై స్వల్పకాలిక కోర్సు ఉంటుంది. వీటికి ఇంటర్నల్‌గా మార్కులు ఉంటాయి. అయితే వాటిని విద్యార్థి డిగ్రీ సర్టిఫికెట్‌లో పొందుపరచరు. అయితే ఈ కోర్సులో కనీస హాజరు శాతం తప్పనిసరి నిబంధనను విధిస్తారు. తద్వారా కచ్చితంగా ఆ తరగతులకు హాజరయ్యేలా చేస్తారు.
తెలంగాణ యాస, భాషలకు స్థానం..
భాషా సబ్జెక్టులైన ఇంగ్లిషు, తెలుగు సబ్జెక్టుల్లోనూ సిలబస్ మార్చనున్నారు. వాటితోపాటు సోషల్ సెన్సైస్‌లో హిస్టరీ, కల్చర్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులు తెస్తారు. భాష, సంస్కృతి సబ్జెక్టుల్లో ప్రొఫెసర్ జయశంకర్, కొమురం భీం వంటి వారి చరిత్ర, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, కళాకారుల పాత్ర, బతుకమ్మ, కోలాటం, దసరా తదితర పండుగలకు చోటు కల్పిస్తారు. తెలంగాణ యాస-భాష, సాహిత్యం, సంస్కృతి, మహానుభావుల పద్య, గద్య రచనలు, కవిత్వాలపైనా పాఠ్యాంశాలు ఉంటాయి. వీటిల్లో మార్పులపై పది రోజుల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.