సాక్షి, అమరావతి: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం విస్తృత నైపుణ్యాలు పెంపొందించేలా డిగ్రీ కోర్సులను రీడిజైన్ చేసినట్లు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ కె.రామమోహనరావు తెలిపారు. ఆయన ఆదివారం విజయవాడలోని లయోలా కాలేజీలో మీడియాతో మాట్లాడుతూ 2023–24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మేజర్ సబ్జెక్ట్ డిగ్రీ, నాలుగేళ్ల హానర్స్ డిగ్రీలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వీటిపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
సోమవారం నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లుప్రారంభమవుతున్న నేపథ్యంలో లయోలా కాలేజీలో సదస్సు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నూతన విద్యా విధానం అమలులో ఏపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. విద్యార్థులను ఒక సబ్జెక్ట్‌లో నిపుణులుగా తీర్చిదిద్దడంతోపాటు మల్టీడిసిప్లినరీ విద్యను అందించేలా డిగ్రీ కోర్సులు రూపొందించామన్నారు. మేజర్ (ప్రధాన) సబ్జెక్ట్‌తో డిగ్రీలో చేరిన విద్యార్థి రెండో సెమిస్టర్ నుంచి మైనర్ (రెండో ప్రాధాన్యం) సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేజర్, మైనర్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదానిపై డిగ్రీ అనంతరం పీజీ స్పెషలైజేషన్ చేయవచ్చని తెలిపారు.
డిగ్రీ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత అనంతరం చదువు ఆపేస్తే ‘సర్టిఫికేషన్ కోర్సు’, రెండో ఏడాది తర్వాత ఆగిపోతే ‘డిప్లొమా’, మూడేళ్లు పూర్తి చేస్తే ‘డిగ్రీ’, నాలుగో ఏడాది చదివి ఉత్తీర్ణత సాధిస్తే ‘డిగ్రీ విత్ హానర్స్’ను ప్రదానం చేస్తామని వివరించారు. విద్యార్థులు మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే నాలుగో సంవత్సరం ‘రిసెర్చ్ హానర్స్’ కోర్సు చేయవచ్చని చెప్పారు.
ఈ కోర్సు పూర్తిచేస్తే నేరుగా పీహెచ్‌డీ చేసేందుకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా మూడేళ్ల డిగ్రీ పాసైన విద్యార్థులు నాలుగో ఏడాది హానర్స్ డిగ్రీని చేయవచ్చని, ఇది పూర్తిచేసిన వారు నేరుగా పీజీ రెండో ఏడాదిలో చేరవచ్చని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 150 మేజర్ సబ్జెక్టులు, ఇందులో 90 వరకు మైనర్ సబ్జెక్టులతో డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టామన్నారు.
డేటాసైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ క్రైమ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, బిజినెస్ ఎనలిటిక్స్, అగ్రికల్చర్, ఫుడ్‌ప్రాసెసింగ్, టూరిజం వంటి అనేక మైనర్ సబ్జెక్టుల్లో డిగ్రీ విద్యను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అభ్యసించవచ్చన్నారు. ఆర్ట్స్ విద్యార్థులు కూడా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించేలా డిగ్రీ కోర్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయా కో ర్సుల వివరాలు, సిలబస్‌ను ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment