Redesign
-
రీడిజైన్ తప్పిదంతోనే ప్రమాదం
కాళేశ్వరం/ మంథని: కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ లోపంతోనే ప్రమాదం ఏర్పడిందని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి వద్ద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రివర్స్ పంపింగ్ అనేది ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదన్నారు. గతేడాది బాహుబలి మోటార్లు మునిగాయని, గ్రావిటీకాల్వ కూలిందని, ఇప్పుడు బ్యారేజీ పిల్లర్లు కుంగుతున్నాయని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ విజయభేరి యాత్రకువస్తే కాళేశ్వరానికి వెళ్లి అభివృద్ధి చూడాలన్నారని.. ఇప్పుడు మునిగిన మోటార్లు, కుంగిన బ్యారేజీని చూడాలా అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కాగా, అంతకుముందు ఆయన మంథనిలో విలేకరులతో మాట్లాడుతూ, నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టి ప్రజల సొమ్మను నీటిపాలు చేశారని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. శ్వేతపత్రం విడుదల చేయాలి: ఈటల కాళేశ్వరం: ఇంజనీరింగ్ వైఫల్యంతోనే బ్యారేజీలు దెబ్బతింటున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన మహదేవపూర్ మండలం అంబట్పల్లి వద్ద మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి అనంతరం మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంతో వర్షాకాలంలో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రస్తుతం 15వ పిల్లర్ల నుంచి 22వ పిల్లర్ల వరకు కుంగినట్లు తెలుస్తోందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. -
విస్తృత నైపుణ్యాలు పెంపొందించేలా డిగ్రీలో మార్పులు
సాక్షి, అమరావతి: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం విస్తృత నైపుణ్యాలు పెంపొందించేలా డిగ్రీ కోర్సులను రీడిజైన్ చేసినట్లు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ కె.రామమోహనరావు తెలిపారు. ఆయన ఆదివారం విజయవాడలోని లయోలా కాలేజీలో మీడియాతో మాట్లాడుతూ 2023–24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మేజర్ సబ్జెక్ట్ డిగ్రీ, నాలుగేళ్ల హానర్స్ డిగ్రీలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వీటిపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమవారం నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లుప్రారంభమవుతున్న నేపథ్యంలో లయోలా కాలేజీలో సదస్సు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నూతన విద్యా విధానం అమలులో ఏపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. విద్యార్థులను ఒక సబ్జెక్ట్‌లో నిపుణులుగా తీర్చిదిద్దడంతోపాటు మల్టీడిసిప్లినరీ విద్యను అందించేలా డిగ్రీ కోర్సులు రూపొందించామన్నారు. మేజర్ (ప్రధాన) సబ్జెక్ట్‌తో డిగ్రీలో చేరిన విద్యార్థి రెండో సెమిస్టర్ నుంచి మైనర్ (రెండో ప్రాధాన్యం) సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేజర్, మైనర్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదానిపై డిగ్రీ అనంతరం పీజీ స్పెషలైజేషన్ చేయవచ్చని తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత అనంతరం చదువు ఆపేస్తే ‘సర్టిఫికేషన్ కోర్సు’, రెండో ఏడాది తర్వాత ఆగిపోతే ‘డిప్లొమా’, మూడేళ్లు పూర్తి చేస్తే ‘డిగ్రీ’, నాలుగో ఏడాది చదివి ఉత్తీర్ణత సాధిస్తే ‘డిగ్రీ విత్ హానర్స్’ను ప్రదానం చేస్తామని వివరించారు. విద్యార్థులు మూడేళ్ల డిగ్రీలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే నాలుగో సంవత్సరం ‘రిసెర్చ్ హానర్స్’ కోర్సు చేయవచ్చని చెప్పారు. ఈ కోర్సు పూర్తిచేస్తే నేరుగా పీహెచ్డీ చేసేందుకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా మూడేళ్ల డిగ్రీ పాసైన విద్యార్థులు నాలుగో ఏడాది హానర్స్ డిగ్రీని చేయవచ్చని, ఇది పూర్తిచేసిన వారు నేరుగా పీజీ రెండో ఏడాదిలో చేరవచ్చని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 150 మేజర్ సబ్జెక్టులు, ఇందులో 90 వరకు మైనర్ సబ్జెక్టులతో డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. డేటాసైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ క్రైమ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, బిజినెస్ ఎనలిటిక్స్, అగ్రికల్చర్, ఫుడ్‌ప్రాసెసింగ్, టూరిజం వంటి అనేక మైనర్ సబ్జెక్టుల్లో డిగ్రీ విద్యను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అభ్యసించవచ్చన్నారు. ఆర్ట్స్ విద్యార్థులు కూడా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించేలా డిగ్రీ కోర్సులను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయా కో ర్సుల వివరాలు, సిలబస్‌ను ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. -
రూ.300 కోట్ల ప్రాజెక్టుకు..రూ.3,500 కోట్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జలయజ్ఞంలో భాగంగా నాడు చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్లు చేసిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 20, 21, 22 ప్యాకేజీల కింద చేపట్టిన మంచిప్ప జలాశయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో 0.84 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొండెం చెరువు పనులను రూ.900 కోట్లతో 75 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. తక్కువ ముంపుతోనే 1.84 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు డిజైన్ చేశారని గుర్తు చేశారు. ఇంకా రూ.300 కోట్లు ఖర్చు చేస్తే జలాశయం పనులు పూర్తయి పొలాలకు నీరందుతుందని చెప్పారు. అయితే కేవలం కమీషన్లు దండుకునేందుకే సీఎం కేసీఆర్ 3.5 టీఎంసీలకు సామర్థ్యం పెంచి 10 గ్రామాలను, 10 వేల ఎకరాలను ముంచుతున్నారని నిందించారు. రూ.3,500 కోట్లు వెచ్చించి దోపిడీ చేసేందుకే డిజైన్లు మార్చారని విమర్శించారు. భూములు కోల్పోతున్న రైతులు ప్రశ్ని స్తే, 17 మందిపై హత్యా యత్నం కేసులు నమోదు చేయించారన్నారు. రైతులపై కేసులు బనాయించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గ్రామాల్లోకి రావద్దని బోర్డులు పెట్టాలని, అయినా వస్తే కళ్లల్లో కారం కొట్టి, కర్రు కాల్చి వాతలు పెట్టాలన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభు త్వం రాగానే పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం చేస్తామన్నారు. డిచ్పల్లి కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కవిత నిజామాబాద్ కోడలిగా ఉండి జిల్లా పరువు తీసిందని అన్నారు. పేపర్ లీకేజీలో కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర సిట్టింగ్‌జడ్జితో విచారణ చేయించాలి: రేవంత్ రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కేసీఆర్ ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో రేవంత్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. టౌన్‌ప్లానింగ్ అధికారి పోస్టుల పరీక్ష పేపర్ల లీకేజీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, కొందరు ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఆరోపించారు. పేపర్ లీక్ అని, సైట్ హ్యాక్ అయిందని, హనీట్రాప్ అని మూడు రకాలుగా చెప్పడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి మాత్రమే తెలియాల్సిన పాస్వర్డ్ ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ప్రశ్నపత్రం స్ట్రాంగ్ రూమ్‌లోకి చైర్మన్, కార్యదర్శికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ ప్రవీణ్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎలా ప్రవేశించాడని, అతనికి పాస్వర్డ్ ఎలా తెలిసిందని రేవంత్ నిలదీశారు. కేసీఆర్ హయాంలో జరిగిన ప్రతి పోటీ పరీక్షపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. -
రైల్వే స్టేషన్లకు ఉచితంగా రీడిజైనింగ్
న్యూఢిల్లీ: ముంబై సహా దేశంలోని 19 రైల్వే స్టేషన్లకు ఉచితంగా డిజైన్లు ఇచ్చేందుకు ప్రముఖ వాస్తుశిల్పి, పద్మభూషణ్ గ్రహీత హఫీజ్ కాంట్రాక్టర్ సహా పలువురు ముందు కు వచ్చారని ఇండియర్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్ఎస్డీసీ) ఎండీ, సీఈవో సంజీవ్ కుమార్ లోహియా వెల్లడించారు. దాదాపు 600 రైల్వే స్టేషన్లను మళ్లీ డిజైన్ చేసి, అభివృద్ధి చేయటానికి రైల్వేశాఖ సంకల్పించింది. రైల్వే పిలుపు మేరకు హఫీజ్ కాంట్రాక్టర్ సహా నలుగురు స్పందించారు. ఈయన రీడిౖ జెనింగ్ ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తం చేసిన వాటిలో ముంబై లోని దాదర్, పరేల్, వడా లా, బంద్రా, ఖర్ స్టేషన్లు ఉన్నాయని లోహి యా తెలిపారు. కాంట్రాక్టర్ ఇచ్చిన డిజైన్లపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. సరైన డిజైన్ల ఎంపిక కోసం 11 మందితో కూడిన ప్యానె ల్ను నియమించినట్లు వివరించారు. -
మల్లన్న సాగర్‌ను రీడిజైన్ చేయాలి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల సమగ్ర నివేదిక(డీపీఆర్)ను ప్రజాక్షేత్రంలో చర్చకు పెట్టాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు కె.రఘు, పిట్టల రవీందర్, ఎన్.ప్రహ్లాద్, వెంకటరెడ్డి, భైరి రమేశ్‌తో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు నివారణకు మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముంపు నివారణకోసం ప్రత్యామ్నాయ మార్గాలతో రీడిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై నిపుణుల కమిటీని నియమించి, అధ్యయనం జరిపించాలని కోదండరాం కోరారు. అప్పటిదాకా ప్రాజెక్టు సర్వే పనులు, భూసేకరణ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరు జడ్జీలపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని కోరారు. హైకోర్టు విభజన మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమన్నారు. -
అధ్యయనం తర్వాతే రీడిజైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు రీడిజైన్ చేయడానికంటే ముందు సమగ్రంగా అధ్యయనం చేయాలని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి హితవు పలికారు. గోదావరి నదిపై ఎక్కువగా బ్యారేజీలను నిర్మించాలన్నారు. దీనివల్ల ముంపు, ఖర్చు కూడా తక్కువ అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాలతో ముంపు సమస్య కూడా ఉండదని చెప్పారు. రిటైర్డు చీఫ్ ఇంజనీరు హనుమంతరావు, నీటి పారుదలరంగ నిపుణుల సూచనలను ప్రభుత్వం అమలుచేయాలని సూచించారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలసి సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతలకు నికర జలాలు లేవంటున్నా నిర్మించాలని తలపెడుతున్నారని, వీటికి వేల కోట్లు ఖర్చుచేసినా ఫలితాలు రావన్నారు. ఇప్పటికే 80 శాతం పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలని జానారెడ్డి కోరారు. రైతుల పొలాల్లో కందకాలు తవ్వడం ద్వారా నీటిని నిల్వ చేయడం, భూగర్భజలాలను పెంచుకోవడం వంటివి చేయాలని సూచించారు. దీనిపై పైలట్ ప్రాజెక్టు కింద రైతులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. రాజకీయాలను కలుషితం చేసేలా తాను ఏనాడూ మాట్లాడలేదన్నారు. మంత్రి హరీశ్‌రావు సవాల్‌పై స్పందించబోనని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేవిధంగా రాజకీయాల్లో వ్యవహరించాలన్నారు. రూ. 5 భోజనం బాగుంది జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన రూ. 5కే భోజనపథకం బాగుందని జానారెడ్డి ప్రశంసించారు. ఇటీవల ఈ పథకంపై విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భోజనం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆయన ఆసక్తి చూపారు. సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన జానారెడ్డి 4 ప్లేట్ల భోజనాన్ని తెప్పించారు. ఆయనతోపాటు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ భోజనాన్ని రుచి చూశారు. కాగా.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. బెదిరింపులు, ప్రలోభాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు.