సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జలయజ్ఞంలో భాగంగా నాడు చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్లు చేసిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 20, 21, 22 ప్యాకేజీల కింద చేపట్టిన మంచిప్ప జలాశయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో 0.84 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొండెం చెరువు పనులను రూ.900 కోట్లతో 75 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు.
తక్కువ ముంపుతోనే 1.84 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు డిజైన్ చేశారని గుర్తు చేశారు. ఇంకా రూ.300 కోట్లు ఖర్చు చేస్తే జలాశయం పనులు పూర్తయి పొలాలకు నీరందుతుందని చెప్పారు. అయితే కేవలం కమీషన్లు దండుకునేందుకే సీఎం కేసీఆర్ 3.5 టీఎంసీలకు సామర్థ్యం పెంచి 10 గ్రామాలను, 10 వేల ఎకరాలను ముంచుతున్నారని నిందించారు. రూ.3,500 కోట్లు వెచ్చించి దోపిడీ చేసేందుకే డిజైన్లు మార్చారని విమర్శించారు.
భూములు కోల్పోతున్న రైతులు ప్రశ్ని స్తే, 17 మందిపై హత్యా యత్నం కేసులు నమోదు చేయించారన్నారు. రైతులపై కేసులు బనాయించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గ్రామాల్లోకి రావద్దని బోర్డులు పెట్టాలని, అయినా వస్తే కళ్లల్లో కారం కొట్టి, కర్రు కాల్చి వాతలు పెట్టాలన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభు త్వం రాగానే పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం చేస్తామన్నారు. డిచ్‌పల్లి కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కవిత నిజామాబాద్ కోడలిగా ఉండి జిల్లా పరువు తీసిందని అన్నారు.
పేపర్ లీకేజీలో కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర
సిట్టింగ్‌జడ్జితో విచారణ చేయించాలి: రేవంత్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కేసీఆర్ ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో రేవంత్‌రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. టౌన్‌ప్లానింగ్ అధికారి పోస్టుల పరీక్ష పేపర్ల లీకేజీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, కొందరు ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఆరోపించారు.
పేపర్ లీక్ అని, సైట్ హ్యాక్ అయిందని, హనీట్రాప్ అని మూడు రకాలుగా చెప్పడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి మాత్రమే తెలియాల్సిన పాస్‌వర్డ్ ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ప్రశ్నపత్రం స్ట్రాంగ్ రూమ్‌లోకి చైర్మన్, కార్యదర్శికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ ప్రవీణ్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎలా ప్రవేశించాడని, అతనికి పాస్‌వర్డ్ ఎలా తెలిసిందని రేవంత్ నిలదీశారు. కేసీఆర్ హయాంలో జరిగిన ప్రతి పోటీ పరీక్షపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment