అధ్యయనం తర్వాతే రీడిజైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు రీడిజైన్ చేయడానికంటే ముందు సమగ్రంగా అధ్యయనం చేయాలని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి హితవు పలికారు. గోదావరి నదిపై ఎక్కువగా బ్యారేజీలను నిర్మించాలన్నారు. దీనివల్ల ముంపు, ఖర్చు కూడా తక్కువ అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాలతో ముంపు సమస్య కూడా ఉండదని చెప్పారు. రిటైర్డు చీఫ్ ఇంజనీరు హనుమంతరావు, నీటి పారుదలరంగ నిపుణుల సూచనలను ప్రభుత్వం అమలుచేయాలని సూచించారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలసి సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పాలమూరు ఎత్తిపోతలకు నికర జలాలు లేవంటున్నా నిర్మించాలని తలపెడుతున్నారని, వీటికి వేల కోట్లు ఖర్చుచేసినా ఫలితాలు రావన్నారు. ఇప్పటికే 80 శాతం పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలని జానారెడ్డి కోరారు. రైతుల పొలాల్లో కందకాలు తవ్వడం ద్వారా నీటిని నిల్వ చేయడం, భూగర్భజలాలను పెంచుకోవడం వంటివి చేయాలని సూచించారు. దీనిపై పైలట్ ప్రాజెక్టు కింద రైతులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. రాజకీయాలను కలుషితం చేసేలా తాను ఏనాడూ మాట్లాడలేదన్నారు. మంత్రి హరీశ్‌రావు సవాల్‌పై స్పందించబోనని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేవిధంగా రాజకీయాల్లో వ్యవహరించాలన్నారు.
రూ. 5 భోజనం బాగుంది
జీహెచ్‌ఎంసీ ప్రవేశపెట్టిన రూ. 5కే భోజనపథకం బాగుందని జానారెడ్డి ప్రశంసించారు. ఇటీవల ఈ పథకంపై విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భోజనం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆయన ఆసక్తి చూపారు. సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన జానారెడ్డి 4 ప్లేట్ల భోజనాన్ని తెప్పించారు. ఆయనతోపాటు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ భోజనాన్ని రుచి చూశారు. కాగా.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. బెదిరింపులు, ప్రలోభాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు.