కాళేశ్వరం/ మంథని: కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ లోపంతోనే ప్రమాదం ఏర్పడిందని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్‌పల్లి వద్ద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రివర్స్ పంపింగ్ అనేది ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదన్నారు.
గతేడాది బాహుబలి మోటార్లు మునిగాయని, గ్రావిటీకాల్వ కూలిందని, ఇప్పుడు బ్యారేజీ పిల్లర్లు కుంగుతున్నాయని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ విజయభేరి యాత్రకువస్తే కాళేశ్వరానికి వెళ్లి అభివృద్ధి చూడాలన్నారని.. ఇప్పుడు మునిగిన మోటార్లు, కుంగిన బ్యారేజీని చూడాలా అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కాగా, అంతకుముందు ఆయన మంథనిలో విలేకరులతో మాట్లాడుతూ, నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టి ప్రజల సొమ్మను నీటిపాలు చేశారని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి: ఈటల
కాళేశ్వరం: ఇంజనీరింగ్ వైఫల్యంతోనే బ్యారేజీలు దెబ్బతింటున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి వద్ద మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి అనంతరం మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంతో వర్షాకాలంలో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రస్తుతం 15వ పిల్లర్ల నుంచి 22వ పిల్లర్ల వరకు కుంగినట్లు తెలుస్తోందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment