మల్లన్న సాగర్‌ను రీడిజైన్ చేయాలి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల సమగ్ర నివేదిక(డీపీఆర్)ను ప్రజాక్షేత్రంలో చర్చకు పెట్టాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు కె.రఘు, పిట్టల రవీందర్, ఎన్.ప్రహ్లాద్, వెంకటరెడ్డి, భైరి రమేశ్‌తో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు నివారణకు మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ముంపు నివారణకోసం ప్రత్యామ్నాయ మార్గాలతో రీడిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై నిపుణుల కమిటీని నియమించి, అధ్యయనం జరిపించాలని కోదండరాం కోరారు. అప్పటిదాకా ప్రాజెక్టు సర్వే పనులు, భూసేకరణ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరు జడ్జీలపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని కోరారు. హైకోర్టు విభజన మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమన్నారు.