డిజైన్ పూర్తికాకముందే భూసేకరణా?
- మల్లన్నసాగర్‌పై ప్రభుత్వం పునరాలోచించాలి: కోదండరాం
- అన్యాయమైన పద్ధతిలో భూమి సేకరిస్తున్నారు
- మల్లన్నసాగర్ రిజర్వాయర్ అవసరం లేదు: హనుమంతరావు
- కాంట్రాక్టర్ల జేబు నింపడానికే..: ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్ : మల్లన్న సాగర్ డిజైన్ పూర్తి కాకముందే ప్రాజెక్టు కింద భూసేకరణ మొదలు పెట్టారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం విమర్శించారు. పూర్తిగా అన్యాయమైన పద్ధతిలో భూమిని సేకరిస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమ పద్ధతిలో సాగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారమిక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో ‘మల్లన్న సాగర్ రిజర్వాయర్ అవసరమా?’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు రీడిజైన్ పై ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. భూసేకరణలో రైతులు సంతకం చేసిన వెంటనే చెక్కుల రూపంలో పరిహారం ఇస్తామని చెప్పి... ఒక గ్రామానికి వెంటనే చెక్కులు ఇచ్చి మరో గ్రామ ప్రజలకు చెక్కులివ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ బేరసారాలాడిన దాఖలాలు ఉన్నాయన్నారు. భూసేకరణ ఒత్తిళ్లను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పాల్గొన్న రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ రిజర్వాయర్ అవసరం లేద ని స్పష్టంచేశారు. రీడిజైనింగ్ చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో 120 రోజులపాటు 160 టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పుడు.. 120 రోజల పంటకాలానికి అదే నీటిని మళ్లించుకోవచ్చన్నారు. అందువల్ల సాగునీటి అవసరాలకు రిజర్వాయర్ల ద్వారా ప్రత్యేకంగా నీటిని నిల్వ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. 1974లో హరియాణాలో జవహర్‌లాల్ నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్‌ను పరిశీలించాల్సిందిగా సూచించానని చెప్పారు. ఆనాడే సాంకేతిక పరిజ్ఞానంతో రిజర్వాయర్ అవసరం లేకుండా లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారన్నారు. పులిచింతల, పోలవరం ప్రాజెక్టులపై తాను ఇచ్చిన సూచనలు ప్రభుత్వం పాటిం చకపోవటం వల్లే తెలంగాణ నష్టపోయిందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ వేదిక కన్వీనర్ కె.బాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సామాజికవేత్త సజయ, ప్రొఫెసర్ పురుషోత్తం, విమలక్క, టి.సాగర్, డీబీఎస్ శంకర్, ఉషా, పిట్టల రవీందర్ పాల్గొన్నారు.
కాంట్రాక్టర్ల కోసమే..
కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, రాజకీయ ప్రయోజనాల కోసమే మల్లన్నసాగర్ నిర్మిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ప్రాజెక్టును నిర్మించటం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఉద్యమం నుంచి వచ్చిన పార్టీకి విశ్వసనీయత లేకుండా పోయింద న్నారు. ప్రాజెక్టుపై జనం ఉద్యమిస్తారని హెచ్చరించారు. వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ అబద్ధపు ప్రాజెక్టు అని ఎద్దేవా చేశా రు. రాష్ట్రంలో యువత మద్యం మత్తులో ఉంటే, నేతలు అధికారం మత్తులో ఉన్నారని ప్రొఫెసర్ రమా మేల్కొటే అన్నారు. దళారులను పెట్టి, బలవంతంగా భూమి సేకరించడం సిగ్గుచేటని ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత అన్నారు. రాష్ట్రంలో దొరల పాలన సాగుతోందన్నారు.