ఎన్ని సార్లయినా జైలుకు..
- ప్రజల కేంద్రంగా అభివృద్ధి సాగాలన్నదే మా లక్ష్యం: కోదండరాం
- ప్రభుత్వ నిర్ణయాలపై చర్చ జరగాలి
- జేఏసీ ఆధ్వర్యంలో ‘విద్యుత్’పై పుస్తకావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ‘‘ఎన్నిసార్లు పోలీసుస్టేషన్లకు, జైళ్లకు వెళ్లాల్సి వచ్చినా వెనకాడం. మాకు ఏ రాజకీయ ఆకాంక్షాలు లేవు. ప్రజలు కేంద్రంగా అభివృద్ధే సాగాలన్నదే మా లక్ష్యం’’ అని మల్లన్నసాగర్ ఆందోళనలను ఉద్దేశించి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు డిజైన్ పూర్తి కాకుండానే దౌర్జన్యంగా ఏకంగా పదిహేను, ఇరవై రెవెన్యూ బృందాలు వెళ్లి, సంతకాలు పెట్టాల్సిందిగా ప్రజలను బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక నాయకులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తే ఆదివారం లాఠీచార్జి ఘటన జరిగేది కాదన్నారు. ‘ప్రాజెక్టులు కట్టాలనే మేమూ కోరుకుంటున్నాం.
అయితే నిపుణులు సూచిస్తున్న ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం పరిశీలించాలని కోరుతున్నాం’ అని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ రెండేళ్లలో విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు, వాటి లాభానష్టాలను విశ్లేషిస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త, టీజేఏసీ అధికార ప్రతినిధి కె.రఘు రచించిన ‘తెలంగాణ విద్యుత్ రంగంలో ఏం జరుగుతున్నది?’ పుస్తకాన్ని కోదండరాం, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి సోమవారమిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఎవరిపై ద్వేషంతోనో, వ్యతిరేకతతోనో ఈ పుస్తకం రాయలేదన్నారు. ‘‘ఇది ఆరంభం మాత్రమే.
త్వరలో నీటిపారుదల, తాగునీటి ప్రాజెక్టులపై నివేదికలు విడుదల చేస్తాం. ప్రభుత్వ నిర్ణయాలపై నిష్పక్షపాతంగా చర్చ జరగాలి. మనం మధ్యయుగపు కాలంలో లేం. అప్పట్లో పాలకులు ఇష్టం వచ్చినట్లు చేసుకునేవాళ్లు. రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో పాలన జరగాలని కోరుకుంటున్నాం. అందుకోసం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తాం. పుస్తకాలు తీసుకొస్తాం’’ అని స్పష్టంచేశారు. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ డీలర్లకు మేలు చేసేందుకు గత సీమాంధ్ర పాలకులు అమలు చేసిన అభివృద్ధి నమూనా తెలంగాణకు పనికి రాదన్నారు. తెలంగాణ తొలి సీఎంకు ఉండాల్సిన అర్హతలన్నీ కేసీఆర్‌కు ఉన్నాయని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి పేర్కొన్నారు. లక్ష కోట్లతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో చర్చ జరగడం లేదని పుస్తక రచయిత కె.రఘు పేర్కొన్నారు.