హైదరాబాద్: జులై 21, 22 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. గురువారం తెలంగాణ జేఏసీ హైదరాబాద్లో సమావేశమైంది. ఈ సమావేశ అనంతరం కోదండరాం విలేకర్లతో మాట్లాడుతూ... నిపుణులు, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ప్రభుత్వం ప్రాజెక్టుల డిజైన్లను నిర్ణయిస్తోందని ఆరోపించారు.
తుమ్మిడిహెట్టి ఎత్తు తగ్గించి ముంపు ఎలా తగ్గించారో... అలాగే మల్లన్నసాగర్ ఎత్తు తగ్గించి ముంపు తీవ్రతను తగ్గించాలని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేఏసీ సమావేశంలో రాష్ట్రంలో పెరిగిపోతున నిరుద్యోగ సమస్యను కూడా చర్చించామని తెలిపారు.
ఆగస్టు మొదటి వారంలో నిరుద్యోగ సమస్యపై హైదరాబాద్లో సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో పాటు గత రెండేళ్లలో విద్యుత్ వినియోగం, సమస్యలపై జేఏసీ ఒక పుస్తకాన్ని తీసుకురానుందని తెలిపారు. ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకం, జెన్‌కో చేపట్టే ప్రాజెక్టుల భూసేకరణ అంశాలపైనా కూడా ఈ సమావేశంలో చర్చించామని కోదండరాం అన్నారు.