
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఎంత గిరాకీ ఉంటుందో తెలుసుకదా. ప్రత్యేకమైన యాపిల్ సాఫ్ట్‌వేర్ కోసమే చాలామంది వినియోగదారులు కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూంటారు. దాంతోపాటు డిజైనింగ్, ఆర్ అండ్ డీ(పరిశోధన, అభివృద్ధి) విభాగం నిత్యం అందిస్తున్న అప్‌డేట్లకు ఫిదా అవుతుంటారు. ఉత్పత్తుల విషయంలో ఇన్నోవేషన్, డిజైనింగ్‌లో ప్రసిద్ధి చెందిన యాపిల్ ఇంక్ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాఫ్ట్‌వేర్ మార్పులకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సాఫ్ట్‌వేర్ రీడిజైనింగ్ ప్రారంభకానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పులు దాని ఫ్లాగ్‌షిప్ పరికరాలైన ఐఫోన్, ఐప్యాడ్, మాక్‌బుక్‌ల్లో వినియోగదారుల అనుభవాన్ని ఏకీకృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మార్పులు ఇవేనా..
రాబోయే యాపిల్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఏకీకృత డిజైన్‌ను తీసుకువస్తుందని నమ్ముతున్నారు. మాక్ఓఎస్, ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ మధ్య ఫంక్షనల్ అంతరాలను ఈ మార్పులు భర్తీ చేయనున్నాయని కంపెనీ పేర్కొంది. గత ఏడాది లాంచ్ చేసిన యాపిల్ విజన్ ప్రో మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ సాఫ్ట్‌వేర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. రీడిజైన్‌లో భాగంగా కొన్ని ఐకాన్లు, మెనూలు, అప్లికేషన్లు, సిస్టమ్ బటన్లలో కూడా మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది భవిష్యత్తులో మరింత క్రమబద్ధమైన, సహజమైన యూజర్ ఇంటర్ఫేస్‌ను అందిస్తుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: హోలీ గేట్‌వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!
వ్యూహాత్మక లక్ష్యాలు
సంస్థ ఆదాయ వృద్ధి మందకొడిగా ఉన్న నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తిని పునరుద్ధరించేందుకు యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యాపిల్‌కు ఈ రీడిజైనింగ్ కీలకంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ ప్రాథమిక ఆదాయ వనరుగా ఉన్న ఐఫోన్ అమ్మకాలు గత హాలిడే సీజన్‌లో భారీగా తగ్గిపోయాయి. అద్భుతమైన ఇంటర్ఫేస్‌ను ప్రవేశపెట్టడం ద్వారా తిరిగి యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా కంపెనీ చర్యలు చేపట్టింది. టెక్నాలజీ ఆవిష్కరణలో తన స్థానాన్ని అగ్రగామిగా సుస్థిరం చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఐఓఎస్ 19, ఐప్యాడ్ ఓఎస్ 19, మాక్ ఓఎస్ 16ల్లో భాగమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను జూన్‌లో జరిగే యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఆవిష్కరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment