సాక్షి, అమరావతి: డిగ్రీ కోర్సుల్లో ఇప్పుడున్న మూడేళ్ల కాల వ్యవధిలోనే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసే అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. కోర్సు సమయంలోనే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. డిగ్రీ కోర్సులు అభ్యసించే విద్యార్థులలో నైపుణ్యాలు పెంచేందుకు, చదువులు పూర్తికాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకొనేలా వారిని తీర్చిదిద్దడానికి ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ అంశాలపై ఉన్నత విద్యామండలి సిలబస్ రివిజన్ కమిటీ ద్వారా కసరత్తు చేపట్టింది. మంగళవారం ఈ కమిటీ మరోసారి సమావేశమైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహనరావు, సిలబస్ రివిజన్ కమిటీ ఛైర్మన్ ప్రొఫసర్ రాజారామిరెడ్డి, అకడమిక్ ఆఫీసర్ డాక్టర్ బీఎస్ సెలీనా, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సిలబస్, ఇంటర్న్‌షిప్.. ఏయే వ్యవధుల్లో వీటిని నిర్వహించాలన్న దానిపై చర్చించారు.
- చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) విధానంలో సిలబస్‌లో చేయాల్సిన మార్పులపైనా ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది.
- మూడేళ్ల డిగ్రీ కోర్సులోనే పది నెలల పాటు ఇంటర్న్‌షిప్ ఉండేలా ప్రతిపాదనలను సిద్ధం చేశారు.
- మొదటి రెండేళ్లలో 10 నెలల పాటు ఆయా కోర్సుల సిలబస్ బోధన, అనంతరం 2 నెలల వేసవి సెలవుల్లో (రెండేళ్లకు కలిపి 4 నెలలు) ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తారు.
- మూడో ఏడాదిలో 6 నెలలపాటు కోర్సుల సిలబస్ బోధన, మిగతా 6 నెలలు ఇంటర్న్‌షిప్‌ను నిర్వహించాలన్న ప్రతిపాదనలపై చర్చించారు.
- యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల డీన్‌లతో బుధవారం, అన్ని యూనివర్సిటీల ఉపకులపతులతో గురువారం సమావేశాలు నిర్వహించి ఉన్నత విద్యామండలి తుది నిర్ణయం తీసుకోనుంది.
- కొత్తగా రూపొందించిన 25 మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులను రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, అటానమస్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నారు.
- ఈ కోర్సులను అమలు చేసేందుకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మంగళవారం జీఓ నం.34 విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment