డిగ్రీ కోర్సులకు సిటీ స్టూడెంట్ జై!
బీకాం(కంప్యూటర్‌స), బీఎస్సీ(ఫిజిక్స్)కు అధిక దరఖాస్తులు..
ఇంటర్మీడియెట్ పూర్తికాగానే అందరి చూపు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సులపైనే..! వాటిలో ప్రవేశం దక్కకపోతేనే డిగ్రీ కోర్సుల్లో చేరేవారు. ఆ పరిస్థితిలో ఇప్పుడు మార్పు వచ్చింది. విద్యార్థి లోకం డిగ్రీ కోర్సులకూ జై కొడుతోంది. జాబ్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యమిస్తోంది. బీకాం(కంప్యూటర్‌స) వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. సిటీలోని ప్రముఖ డిగ్రీ కాలేజీల్లో సీట్ల కోసం గతంలో ఎన్నడూ లేనంత పోటీ నెలకొంది.
బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ... అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో తొలి ప్రాధాన్యం బీకాం కంప్యూటర్స్‌కే అంటున్నారు నగర విద్యార్థులు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు సుమారు 260 వరకు ఉన్నాయి. గతానికి భిన్నంగా ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ కోర్సులకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. పేరున్న డిగ్రీ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ సీట్లు హాట్‌కేకుల్లా మారాయి.
ఇక్కడ బీకాం కంప్యూటర్స్‌లోని 600 సీట్లకు సుమారు 2800 మంది దరఖాస్తు చేసుకున్నారు. బీఎస్సీ(ఫిజికల్ సైన్స్)కు ఏకంగా 6000 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. నిజాం కాలేజీ, విల్లామేరీ, సెయింట్ ఫ్రాన్సిస్, లయోలా అకాడమీ, బద్రుకా, ఏవీ కాలేజీ, సెయింట్ ఆన్స్, కోఠి ఉమెన్స్ కాలేజీ, వనితా మహావిద్యాలయ తదితర కళాశాలల్లో డిగ్రీ కోర్సుల దరఖాస్తులను గతేడాది కంటే ఈసారి మూడురెట్లు అధికంగా విక్రయించారు. బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడ బీకాం కంప్యూటర్స్ సీట్లన్నీ భర్తీ అయినట్లు అడ్మినిస్ట్రేషన్ అధికారి తెలిపారు.
ఫస్ట్‌ఛాయిస్.. బీకాం కంప్యూటర్స్
నిన్న మొన్నటి వరకూ ఒకటే క్రేజ్.. ఇంజనీరింగ్.. మెడిసిన్.. అందరిదీ అదే మాట, అదే దారి. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. సిటీ విద్యార్థులు ఇప్పుడు డిగ్రీ వైపు మొగ్గుచూపుతున్నారు. క్రేజ్ కంటే జాబ్ ముఖ్యమని భావిస్తున్నారు.తమ ఫస్ట్‌ఛాయిస్‌గా బీకాం కంప్యూటర్స్‌కు ఎక్కువమంది దరఖాస్తు చేసుకుంటే.. సైన్సు కోర్సుల్లో బీఎస్సీ(ఫిజికల్ సైన్స్) వైపు అధిక శాతం మంది మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా చూస్తే ఫస్ట్‌ఛాయిస్ బీకాం కంప్యూటర్స్.. రెండోది బీఎస్సీ(ఫిజికల్ సైన్స్).. మూడోస్థానంలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్.. నాలుగో స్థానంలో బీకాం రెగ్యులర్ కోర్సులున్నాయి.
జాబ్ మార్కెట్‌లో రోజురోజుకీ వస్తున్న మార్పులు.. గ్లోబలైజేషన్ ప్రభావంతో సరికొత్త ఉద్యోగాలు పుట్టుకురావడం.. కమ్యూనికేషన్ స్కిల్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత వంటి కారణాలు డిగ్రీ కోర్సులకు పూర్వవైభవం తెచ్చాయని చెబుతున్నారు నిజాం కళాశాల వైస్‌ప్రిన్సిపల్ జి.వీరభద్రం. ట్రెండ్ మారుతుందని భావించామని, అయితే ఇంత త్వరగా మార్పు వస్తుందని ఊహించలేదంటున్నారు. ‘సైన్స్ అనేది టెక్నాలజీని నడిపించాలి, కానీ ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో టెక్నాలజీయే సైన్స్‌ను నడిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. డిగ్రీ కోర్సుల వైపు యువత మొగ్గుచూపడం సైన్స్ మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెరుగుతున్న డిమాండ్
రీసెర్స్ అండ్ డెవలప్‌మెంట్ అనేది అధ్యయనం ద్వారానే సాధ్యమవుతుందని వనితా మహావిద్యాలయ ప్రిన్సిపల్ వాణి తెలిపారు. డిగ్రీ కోర్సులకు ఆదరణ పెరగడానికి కారణం జాబ్ ఓరియెంటేషన్ కోర్సులు రావడమేనని చెప్పారు. తమ కాలేజీలో బీఎస్సీకి 1:3 నిష్పత్తి , బీకాం కంప్యూటర్స్‌కు 1:6 మేర విద్యార్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. బీకాంలో 30 సీట్లకు సుమారు 900 దరఖాస్తులు రావడం డిగ్రీ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనమన్నారు. విల్లామేరీ కళాశాలలోనూ బీఎస్సీ, బీకాంలకు దాదాపు 2000 దరఖాస్తులు వచ్చాయంటున్నారు నిర్వాహకులు. కోఠి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీకి అధికంగా 1500 దరఖాస్తులు వచ్చాయని ప్రిన్సిపల్ బి.టి.సీత తెలిపారు. జనరల్ విభాగంలో బీఎస్సీకి 75-80 శాతం మార్కులు, బీకాం కంప్యూటర్స్‌కు 70 శాతం మార్కుల వరకూ సీట్లు కేటాయించామన్నారు. లయోలా అకాడమీ సికింద్రాబాద్ క్యాంపస్‌లో బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ ఫిజికల్ సెన్సైస్ కోర్సుల్లో సీట్లన్నీ నెల రోజుల క్రితమే భర్తీ అయినట్లు నిర్వాహకులు చెప్పారు.