ఉపాధి కల్పించేలా సంప్రదాయ కోర్సులు! | Telangana Higher Education Exercise To Improve Degree Courses | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పించేలా సంప్రదాయ కోర్సులు!

Published Tue, Feb 22 2022 2:08 AM | Last Updated on Tue, Feb 22 2022 11:34 AM

Telangana Higher Education Exercise To Improve Degree Courses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంప్రదాయ కోర్సుల ప్రామాణికతను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టింది. సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరుతున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో చాలామంది పేదరికం నేపథ్యము న్నవారే. ఈ కోర్సుల తర్వాత ఉపాధి పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ నైపుణ్యంతో పోటీపడే స్కిల్స్‌ లేవని, మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టుగా విద్యావిధానం మెరుగుపడలేదని ఉన్నత విద్యామండలి గుర్తించింది. 

బీసీలే ఎక్కువ 
ఈ సంవత్సరం బీఏలో 36,888 మంది చేరితే వారిలో 18,240 మంది బీసీలే. వీరిలో 80 శాతం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ కోర్సులను ఎంచుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. 10 శాతం పీహెచ్‌డీ స్థాయి, మరో 10 శాతం పోటీ పరీక్షలకు వెళ్లాలనుకునేవారు ఉన్నట్టు అధికారుల సర్వేలో తేలింది. కొంతమేరైనా డిగ్రీ తర్వాత ఉపాధి కల్పించే కోర్సుల్లో బీకాంను చెప్పుకుంటారు. కానీ ఈ కోర్సులో ఎస్సీలు 15,518కి పరిమితమైతే, ఎస్టీలు 6,620 మంది ఉన్నారు. ఓసీలు 25,072 మంది ఉన్నారు.  

సరికొత్త ప్రయోగాలు 
ఉద్యోగం అవసరం ఉన్న పేద వర్గాలు ఇష్టపడే సంప్రదాయ కోర్సులను తీర్చిదిద్దేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే యూకేకు చెందిన రెండు యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందం చేసుకుంది. అక్కడ బోధన ప్రణాళికను మేళవింపు చేస్తూ రాష్ట్రంలోని సంప్రదాయ కోర్సుల్లో మార్పులు తేవాలని భావిస్తోంది. ముఖ్యంగా బ్రిటన్‌ విద్యావ్యవస్థను ఆకళింపు చేసుకోవాలని యోచిస్తోంది. అయితే, ఆ స్థాయి ప్రమాణాలు అర్థం చేసుకోవడానికి వీలుగా పాఠ్య ప్రణాళిక ఉండాలని అధికారులు భావిస్తున్నారు. తాజాగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్, బీకాం ఆనర్స్‌ కోర్సుల్లో ఈ తరహా విద్యాబోధన అందిస్తున్నారు. క్షేత్రస్థాయి అధ్యయనం అవసరమని భావించినప్పటికీ, ఈ ప్రక్రియ ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. 

సంప్రదాయ కోర్సులకు ఊతం 
పేద, గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా చేరే సంప్రదాయ డిగ్రీ కోర్సు లను ఉపాధికి ఊతమిచ్చే స్థాయిలో తీర్చిదిద్దాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇతర దేశాలతో అవగాహన ఒప్పందం చేసుకున్నాం.  దీనిపై కసరత్తు మొదలు పెట్టాయి.   


–ప్రొ. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ 

మూస విధానం పోవాలి
సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూప స్వభావం మారాలి. ప్రధానంగా మూస బోధన విధానం మారాలి.  మన విద్యార్థులకు కష్టపడే తత్వం ఉంది. అర్థం చేసుకునే మేధస్సు ఉంది. కాకపోతే విద్యావిధానంలో మార్పులు అవసరం.  


–ప్రొ. డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement