
డిగ్రీ కోర్సులకు లక్షకు పైగా దరఖాస్తులు
ఢిల్లీ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న వివిధ డిగ్రీ కోర్సులకు లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
ఢిల్లీ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న వివిధ డిగ్రీ కోర్సులకు లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం సాయంత్రానికి 1,14,152 దరఖాస్తులు వచ్చాయని, అందులో సుమారు 40 వేల మంది ఫీజులు కూడా కట్టేశారని ఢిల్లీ యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫీజు కట్టినవారిలో 20 వేల మంది అబ్బాయిలు, 20 వేల మంది అమ్మాయిలతో పాటు ఒక హిజ్రా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకాగా, మొదటిరోజే 39వేల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఓఎంఆర్ ఫారాలు కూడా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉన్నాయని, ఫీజును ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చని అన్నారు.
రావడానికి లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినా, వివిధ కోర్సులలో కలిపి ఉన్న మొత్తం సీట్లు 60వేలు మాత్రమే. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు జూన్ 19వరకు గడువు ఉంది. మొదటి కటాఫ్‌ను జూన్ 27న ప్రకటిస్తారు. ఇంతకుముందు వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు పద్ధతుల్లో దరఖాస్తులు స్వీకరించగా, ఈసారే పూర్తిగా ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే తీసుకుంటున్నారు.