యూపీఎస్‌సీకి స్పందన కరువు
- హాజరు 38 శాతం మాత్రమే
- ఎస్వీయూ రీజియన్‌లో 7796 దరఖాస్తులు
- కేవలం 3 వేల మంది హాజరు
యూనివర్సిటీ క్యాంపస్: తిరుపతిలో ఆది వారం నిర్వహించిన యూపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షలకు స్పందన తగ్గింది. ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్ష రాయాల్సిందే. ప్రతి యేడాదీ క్రమం తప్పకుండా దీనిని యుపీఎస్‌సీ నిర్వహిస్తోంది. యేడాదిలో క్రమం తప్పక నిర్వహిస్తున్నప్పటికీ హాజరవుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది.
ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రాష్ట్రంలో కేవలం మూడు కేంద్రాల్లో నిర్వహిం చారు. ఉమ్మడి రాష్ర్టంలో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించేవారు. తెలంగాణ విడిపోయాక కొత్తగా విజయవాడలోను పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఎస్వీయూ రీజియన్ పరిధిలోని చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులకు తిరుపతిలో పరీక్ష కేంద్రా లు ఏర్పాటు చేశారు.
ఈ ప్రవేశ పరీక్షకు కేవలం 7796 మంది దరఖాస్తు చేయగా ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో పేపర్-1కు 3వేల మంది, పేపర్-2కు 2294 మంది హాత్రమే హాజరయ్యారు. దీనిని బట్టి చూస్తే సివిల్స్ పట్ల యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదని అర్థం అవుతుంది. ఎక్కువ శ్రమతో, కష్టంతో, దీర్ఘకాలం సిద్ధం కావాల్సిన ఈ ప్రవేశ పరీక్షకన్నా తక్కువ కాలంలో ఉద్యోగాలు వచ్చే వాటిపైనే యువత ఆసక్తి చూపుతోందనడానికి ఇది నిదర్శనం.
ఈ యేడాది నుంచి ప్రవేశ పరీక్ష విధానంలో మార్పులు చేశారు. పేపర్-2లో ఇంగ్లిషు కాంప్రహెన్సివ్‌ను మెయిన్స్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రవేశ పరీక్ష రాసిన వారు ఆ విభాగపు ప్రశ్నలను అటెంప్ట్ చేయలేదు. పరీక్ష కేంద్రాల వద్ద కూడా ఈ మేరకు నోటీసు బోర్డులు పెట్టడం విశేషం.
పరీక్ష కేంద్రాల వద్ద సందడి
ఆదివారం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు నగరంలోని 13 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ కేంద్రా ల వద్ద పరీక్షలు రాసేవారు, వారి సహాయకుల సందడి ఎక్కువగా కనిపించింది. కొందరు పిల్లలను కూడా పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ పరీక్షకు ఆరు జిల్లాల నుంచి అభ్యర్థులు వచ్చారు. వీరికి సరైన వసతి లేక చాలా ఇబ్బం దులు పడ్డారు.