అందరి చూపూ ఆ పోస్టులపైనే | heavy competition to the SVU faculty | Sakshi
Sakshi News home page

అందరి చూపూ ఆ పోస్టులపైనే

Published Tue, Nov 5 2013 4:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM

heavy competition to the SVU faculty

యూనివర్సిటీక్యాంపస్, న్యూస్‌లైన్:  ఎస్వీయూలో అందరి చూపూ అధ్యాపక పోస్టులపైనే ఉంది. ఎస్వీయూలో 268 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఇందులో 110 అసిస్టెంట్ ప్రొఫెసర్, 95 అసోసియేట్ ప్రొఫెసర్, 63 ప్రొఫెసర్ పోస్టులున్నాయి. అధికారులు రోస్టర్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి, జనవరి నెలాఖరుకు పోస్టులు భర్తీ చేయాలన్న దిశగా పనిచేస్తున్నారు.
 ఆశల పల్లకిలో అభ్యర్థులు
 ఎస్వీయూలో 2007 తర్వాత అధ్యాపక పోస్టుల ను భర్తీ చేయలేదు. 625 అధ్యాపకుల పోస్టుల్లో 300 ఖాళీగా ఉన్నాయి. 2015 చివరికల్లా మరో 200 మంది రిటైర్డ్ కానున్నారు. 125 మంది అధ్యాపకులు మాత్రమే మిగులుతున్నారు. ఈ నేపథ్యంలో 268 పోస్టుల భర్తీకి అనుమతి రావడంతో నిరుద్యోగులు వాటిపై ఆశలు పెంచుకున్నారు. ఎలాగైనా పోస్టు దక్కించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
 కేసుల అడ్డంకి తొలగేనా?
 ఎస్వీయూలో 2007లో జరిగిన అధ్యాపక పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయంటూ పలువురు కోర్టుకెళ్లారు. ఇందులో రెండు కేసులు బలంగా ఉన్నాయి. ఒకటి రోస్టర్‌కు సంబంధిం చింది కాగా, మరొకటి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు బోధనానుభవం లేని వారికి కట్టబెట్టారని ఆరోపిస్తూ వేసిన కేసు. ఈ కేసులు వేసిన వారిని రాజీ చేయించి ఎత్తి వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కేసులు వేసిన వారు కూడా నిర్ధిష్ట హామీ లభిస్తే వెనక్కి తీసుకొనే ఆలోచనలో ఉన్నారు. ఇదే జరిగితే నోటిఫికేషన్‌కు అడ్డంకి తొలగినట్లే.
 మొదలైన బేరసారాలు
 ఎస్వీయూ వీసీగా రాజేంద్ర, రిజిస్ట్రార్‌గా సత్యవేలురెడ్డి విధుల్లో చేరిన రోజు నుంచే అధ్యాపక పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. వీరికి జిల్లాకు చెందిన ముఖ్యనేత అండదండలు ఉండడంతో ప్రయత్నాలు ఫలించాయి. 268 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించడంతో ఆశావహులు రంగంలోకి దూకారు. ఇదే సమయంలో మధ్యవర్తులు తెరపైకి వచ్చారు. ఆశావహులను గుర్తించి అందిన కాడికి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు రూ.20 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు రూ.25 లక్షలు పలుకుతోందని సమాచారం. ఇందులో సగం డబ్బులిస్తే అభ్యర్థి కోరుకున్న విభాగంలో, కోరుకున్న కేటగిరిలో పోస్టు వచ్చేలా చేస్తామని మధ్యవర్తులు హామీలు గుప్పిస్తున్నారు. కొంద రు అభ్యర్థులు ఉన్నతాధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. పలుకుబడిని ఉపయోగించి ఎలాగైనా పోస్టు దక్కించుకోవాలని చూస్తున్నా రు. అయితే ఇప్పటికే దాదాపు అన్ని పోస్టులకు అభ్యర్థులు ఖరారయ్యారని, నోటిఫికేషన్ రావడమే ఆలస్యమనే ప్రచారం సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement