యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ఎస్వీయూ అధికారులు ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. శుక్రవారం జరిగిన సమావేశంలో పోస్టుల భర్తీకి పాలకమండలి అనుమతి లభించింది. ఇక నోటిఫికేషన్ విడుదల కావడమే ఆలస్యం. నోటిఫికేషన్ కూడా వారంలోపే రానుంది.
ఎస్వీయూ పాలకమండలి సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. వీసీ రాజేంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో 268 పోస్టుల భర్తీకి పాలకమండలి అనుమతి ఇచ్చింది. ఇందులో 110 అసిస్టెంట్‌ప్రొఫెసర్లు, 93 అసోసియేట్ ప్రొఫెసర్లు, 65 ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.
ఏడేళ్ల తర్వాత
ఎస్వీయూలో చివరిసారిగా 2007లో 120 అధ్యాపక పోస్టులు భర్తీ చేశారు. అనంతరం పోస్టుల భర్తీ జరగలేదు. ఈ ఏడు సంవత్సరాల కాలంలో పలువురు ఉద్యోగ విరమణ చేశారు. దీంతో చాలా విభాగాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో 2012 జూన్ 30న వీసీగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర తాను బాధ్యతలు తీసుకున్న రోజు నుంచే పోస్టుల భర్తీపై దృష్టిసారించారు.
ముందుగా వివిధ విభాగాల్లో ఖాళీలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. 2013 జూలై 30న ఎస్వీయూలో 268 పోస్టుల భర్తీకి రాష్ర్ట ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో పోస్టుల భర్తీకి అవసరమైన ప్రక్రియను చేపట్టారు. అధికారులు రోస్టర్ సిద్ధం చేయడం, వాటి అనుమతులు తీసుకుంటూ వచ్చారు. ఈ వ్యవహారం వెనుక ముఖ్యనేత సోదరుని అనుగ్రహం, ఆశీస్సులు ఉండడంతో ప్రక్రియలు చకచకా జరిగిపోయాయి.
పాలకమండలి సమావేశం ముందురోజు కూడా ఎస్వీయూ అధికారులు ముఖ్యనేత సోదరుని ఆశీస్సులు తీసుకుని వచ్చినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో శుక్రవారం నిర్వహించిన పాలకమండలి సమావేశం పోస్టుల భర్తీకి పాలకమండలి అనుమతించింది. దీంతో నోటిఫికేషన్ విడుదలకు కావాల్సిన అడ్డంకి తొలగింది. నోటిఫికేషన్‌ను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని అధికారులు సంకల్పంతో వున్నారు.
ఆశలపల్లకిలో అభ్యర్థులు
ఎస్వీయూలో అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఏడేళ్ళ తర్వాత నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఆశావహులు ఆశలపల్లకిలో విహరిస్తున్నారు. ఇప్పటికే అమాత్యుల ద్వారా పోస్టును దక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందుకోసం రాజకీయ, సామాజిక, ఆర్థికపరమైన అస్త్రాలను కూడా సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.
పీలేరుకు పీజీ కళాశాల
ఎస్వీయూనివర్సిటీ పీజీ కళాశాలను పీలేరులో ఏర్పా టు చేయడానికి పాలకమండలి అనుమతించింది. ఐదు విభాగాలతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం 25 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా ప్రభుత్వం కేటాయించింది. పాలకమండలి సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇలా వున్నాయి.
- వర్శిటీకి అవసరమైన పరికరాలు కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చే ‘సెంట్రల్ పర్చేజింగ్ కమిటీ’కి సంబంధించిన విధి విధానాలను సరళీకృతం చేయడానికి పాలకమండలి అనుమతి ఇచ్చింది.
- ఫిజిక్స్ విభాగంలోని ఎంసెట్ రాడార్ కేంద్రం, డీఎస్‌టీ పర్స్ ప్రోగ్రామ్‌లకు పరికరాల కొనుగోలుకు పాలకమండలి అనుమతించింది.
- కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం కాంపిటేటివ్ సెల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన భవన నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది.
- మహిళా హాస్టల్‌లోని హాస్టల్ భవనంపై రెండో అంతస్తు నిర్మాణానికి, కొన్ని విభాగాల్లో అకడమిక్ భవనాల విస్తరణ పనులకు పాలకమండలి అనుమతించింది.
-ఫిజికల్ సైన్స్, లైఫ్‌సెన్సైస్ బ్లాకులలో రీవైరింగ్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది.
- శ్రీనివాస ఆడిటోరియంలో కుర్చీలను బాగు చేయించుకోవడానికి పాలకమండలి అనుమతించింది.
- మలేషియా యూనివర్సిటీతో విద్యా, పరిశోధనల్లో ఉమ్మడి సహకారం కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి పాలకమండలి అనుమతి ఇచ్చింది.
-ఫైనాన్స్,అకౌంట్స్ శాఖలను పునర్‌వ్యవస్థీకరించడానికి అనుమతి తెలిపింది.
ఈపాలకమండలి సమావేశంలో రిజిస్ట్రార్ కె.సత్యవేలురెడ్డి, రెక్టార్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్వీయూలో ఉద్యోగాలు రెడీ
Published Sat, Jan 18 2014 5:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement