యూపీఎస్‌సీ పరీక్షకు ప్రత్యేక బస్సులు
తిరుపతి(మంగళం): తిరుపతిలో ఆదివారం జరగనున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ట్రాన్స్‌పోర్టు జిల్లా కమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. ఈ మేరకు తిరుపతిలో 23 ప్రత్యేక ప్రైైవేటు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యూపీఎస్‌సీ పరీక్ష రాసేందుకు 7,796 మంది అభ్యర్థులు తిరుపతికి వస్తున్నారని, నగర పరిధిలో 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారని అన్నారు.
అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా ఉండేలా రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఆర్టీఏ) ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ వద్ద 23 ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి బస్సుపైన పరీక్ష కేంద్రాల బోర్డులను అంటించి ఉంటామని, పది నిమిషాలకు ఒక బస్సు పరీక్ష కేంద్రాల వద్దకు తిరుగుతాయన్నారు.
అభ్యర్థులను పరీక్ష కేంద్రాల వద్ద తీసుకెళ్లేందుకు పది రూపాయలు మాత్రమే చార్జీ తీసుకోవాలని బస్సుల యజ మానులకు బసిరెడ్డి సూచించారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశాల మేరకు తమవంతు సహకారం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు శివశంకర్, నాగరాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
బస్సు రూట్ల వివరాలు
రూట్-1లో 12 బస్సులు: ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్, బాలాజీకాలనీ, ఎస్పీ బాలికల ఉన్నత పాఠశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, శ్రీపద్మావతి జూనియర్ కళాశాల, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ, పీజీ కళాశాల
రూట్-2లో 3 బస్సులు: ఆర్టీసీ బస్టాండ్, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల, తిరుచానూరు
రూట్-3లో 6 బస్సులు: ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్, మున్సిపల్ కార్యాలయం శ్రీగోవిందరాస్వామి హైస్కూల్, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల
రూట్-4లో 2 బస్సులు: ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్, కేంద్రీయ విద్యాలయం ఇస్కాన్ టెంపుల్ వద్ద