జేఈఈకి సర్వం సిద్ధం | Prepare everything JEE Entrance Exam | Sakshi
Sakshi News home page

జేఈఈకి సర్వం సిద్ధం

Published Sun, Apr 6 2014 3:50 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Prepare everything JEE Entrance Exam

నేడు ఉమ్మడి ప్రవేశ పరీక్ష
 నగరంలో 17 పరీక్ష కేంద్రాలు
 హాజరుకానున్న 12,820 మంది విద్యార్థులు
 ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు

 
 సాక్షి, హన్మకొండ : దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆదివారం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. వరంగల్ నగరంలో 17 కేంద్రాలను ఏర్పాటు చేయగా...  12,820 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 9,935 మంది... బీ ఆర్క్, బీ ప్లానింగ్ విభాగంలో 2,885 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు... బీ ఆర్క్,  బీ ప్లానింగ్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది.

 ప్రత్యేక బస్సులు

 జేఈఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఇన్‌చార్జ్ ఆర్‌ఎం అంచూరి శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్‌కు 50, కరీంనగర్ రూట్‌లో 25 బస్సులు వేసినట్లు పేర్కొన్నారు. వరంగల్ నగరంలో పరీక్షలు జరిగే సెంటర్లకు సంబంధించిన రూట్లలో ఉద యం 7 గంటల నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు చొప్పున నడపనున్నట్లు వివరించారు. అదేవిధంగా... సెయింట్ పీటర్స్, గ్రీన్‌వుడ్, జేఎస్‌ఎం పాఠశాలల నిర్వాహకులు సైతం ఉచితంగా 25 బస్సులు ఏర్పాటు చేశారు. వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లతోపాటు అదాలత్ సెంటర్లలో ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నారు.

 తప్పిన తిప్పలు

 రెండేళ్లుగా జేఈఈ పరీక్షలకు సంబంధించి మెట్రో నగరాల్లో ఆన్‌లైన్ కేంద్రాలు, వరంగల్, గుంటూరు, తిరుపతి వంటి ద్వితీయశ్రేణి నగరాల్లో ఆఫ్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ కేంద్రాల్లో పరీక్షలు రాయడం పట్ల రాష్ట్ర విద్యార్థులు విముఖత చూపడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆఫ్‌లైన్ సెంటర్లనే ఎంపిక చేసుకున్నారు. దీంతో ద్వితీయశ్రేణి నగరాలపై తీవ్రమైన ఒత్తిడి పడింది. 2012లో  50 వేల మంది విద్యార్థులు వరంగల్‌ను పరీక్ష కేంద్రంగా  ఎంపిక చేసుకోగా... 2013లో ఈ సంఖ్య 55 వేలకు చేరుకుంది. నగరం నలుమూలలా 85 పరీక్ష  కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

 వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒకేసారి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సకాలంలో  పరీక్ష కేంద్రాలను గుర్తించి అక్కడికి చేరుకోవడం గగనంగా మారింది. అంతేకాదు... విద్యార్థులు, వారి వెంట వచ్చే సహాయకులకు వసతి, భోజనం వంటి అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.  స్థానికంగా ఉన్న హోటళ్లలో గదులన్నీ ముందే బుక్ అయ్యాయి.

స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ హాళ్లలో విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. రెండేళ్లుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సారి హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో వరంగల్, తిరుపతి, గుంటూరు, ఖమ్మం వంటి నగరాలపై ఒత్తిడి తగ్గింది.
 
 విద్యార్థులకు సూచనలు
 
 అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకుచేరుకోవాలి. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా... అనుమతించరు.
 
 జవాబు పత్రాన్ని నలుపు, నీలిరంగు బాల్‌పాయింట్ పెన్నులతోనే నింపాలి.
 
 బీ ఆర్క్ విద్యార్థులు పెన్సిల్, జామెట్రీబాక్స్, క్రేయాన్స్‌లను పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్లవచ్చు.
 
 ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
 
 
 రూట్‌ల వారీగా ఆర్టీసీ బస్సులు..

 
 రూట్ నంబర్-1 : కాజీపేట-వరంగల్ రూట్‌లో బాలసముద్రంలోని ఎస్‌ఆర్ డిగ్రీ, పీజీ కాలేజీ... అంబేద్కర్ సెంటర్‌లోని గురుకుల్ స్కూల్... నక్కలగుట్టలోని కాకతీయ మహిళా కాలేజీ... ములుగురోడ్డులోని శ్రీ గాయత్రి కాలేజీ... సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ... పీజీ కాలేజీ... హన్మకొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని కాకతీయ ప్రభుత్వ కాలేజీ... కిషన్‌పురలోని చైతన్య డిగ్రీ కాలేజీ... కాజీపేటలోని నిట్ పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను చేరవేయనున్నట్లు శ్రీధర్ తెలిపారు.

 రూట్ నంబర్-2 : వరంగల్-కాజీపేట, వయా ఎన్జీవోస్ కాలనీ రూట్‌లో సెయింట్ పీటర్స్ పబ్లిక్‌స్కూల్‌కు విద్యార్థులను చేరవేస్తామన్నారు.
 
 రూట్ నంబర్-3 : కాజీపేట-వరంగల్ వయా హంటర్‌రోడ్టు రూట్‌లో ఎస్‌వీ రామన్ కాలేజీ, అల్లూరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సెన్సైస్, న్యూసైన్స్ పీజీ కాలేజీ, వరంగల్ పబ్లిక్ స్కూల్, జేఎస్‌ఎం హైస్కూల్, న్యూ సైన్స్ డిగ్రీ కాలేజీలకు ఆర్టీసీ బస్సులు నడపనున్నామని చెప్పారు.
 
 రూట్ నంబర్ 24 : ఎర్రగట్టు కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ సమీంపలోని గ్రీన్‌వుడ్ హైస్కూల్ సెంటర్‌కు విద్యార్థులను చేరవేయనున్నట్లు శ్రీధర్ వెల్లడించారు.          
                              - న్యూస్‌లైన్, హన్మకొండ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement