JEE exam
-
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది ఇదే ప్రథమం
జైపూర్: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఇంజినీరింగ్ కోసం సిద్ధమవుతున్న ఓ విద్యార్థి మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ పరీక్షల కేంద్రంగా పేరొందిన కోటాలో గత ఏడాది 29 ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకోవడం గురించి తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఇదే తొలి విద్యార్థి ఆత్మహత్య. యూపీలోని మొరాదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్(18) అనే విద్యార్థి కోట హాస్టల్లో ఉంటూ జేఈఈ మెయిన్స్ కోచింగ్‌లో చేరాడు. మంగళవారం అర్ధరాత్రి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా ప్రదేశంలో సూసైడ్ నోట్ లాంటివి కనిపించలేదు. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియదు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాత్రి 11:00 ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కోటాలో 2023లో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోచింగ్ సెంటర్ల అధిక ఒత్తిడి కారణంగా విద్యార్థులు మానసికంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ ఆత్మహత్యలు తగ్గడం లేదు. ఇదీ చదవండి: ముంబైలో రామ భక్తులపై దాడులు.. నిందితులపై బుల్డోజర్ యాక్షన్ -
వీలైనంత దగ్గరగా జేఈఈ పరీక్ష కేంద్రం
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రా లను ఈసారి శాస్త్రీయంగా ఏర్పాటు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. సాధ్యమైనంత వరకూ అభ్యర్థి నివాసానికి సమీపంలో ఉండే కేంద్రాన్ని కేటాయించేందుకు వీలుగా కసరత్తు చేపట్టింది. దరఖాస్తులో పేర్కొన్న స్థానికతను ఇందుకు కొలమానంగా తీసుకుంటున్నారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా అక్కడికి సమీపంలోని పరీక్ష కేంద్రాన్ని గుర్తిస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. ఒక కేంద్రంలోనే ఎక్కువ మందికి అవకాశం జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఉంటుంది. తొలి విడత పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. తుది గడువు నాటికి ఎన్ని దరఖాస్తు లు అందు తాయి? ఎన్ని పరీక్ష కేంద్రాలుంటాయి? ఎన్ని సెషన్లుగా పరీక్ష పెట్టాలనేదానిపై డిసెంబర్ మొదటి వారంలో ఓ స్పష్టత వస్తుంది. అయితే ఈసారి ఒక్కో పరీక్ష కేంద్రంలో ఎక్కువ మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు అదనపు గదుల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసే వీలుంది. హైదరాబాద్‌లో ఎక్కువ కేంద్రాలు ఉంటాయి. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ముందుగా దరఖాస్తు చేసే వారికి పరీక్ష కేంద్రం కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్టీఏ భావిస్తోంది. సాధారణంగా హైదరాబాద్‌లోని పలు పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో వీరిని రంగారెడ్డి, హైదరాబాద్‌లోని కేంద్రాలకు కేటాయించి, ఇంకా మిగిలితే సమీపంలోని జిల్లా కేంద్రాల్లో సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం మారుమూల జిల్లా కేంద్రంలోని అభ్యర్థులకు కూడా హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించే వాళ్ళు. దీనివల్ల అసౌకర్యంగా ఉంటోందని అన్ని జిల్లాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం జేఈఈ పరీక్ష సమయంలో ఎదురయ్యే ఇబ్బందులపై ఈసారి దృష్టి పెట్టబోతున్నారు. పలు కేంద్రా ల్లో కంప్యూటర్లు ఆగిపోవడం, లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న ఉదంతాలున్నాయి. దీనివల్ల గంటల తరబడి పరీక్ష ఆలస్యమవుతోంది. అప్పటికే ఇతర కేంద్రాల్లో పరీక్ష పూర్తవుతుంది. దీనిపై పరీక్ష కేంద్రం అధికారులు నిర్ణయం తీసుకో లేని పరిస్థితి ఉంటోంది. గత ఏడాది మూడు చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అధికారులు ఎన్టీఏను సంప్రదించి, నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ టెన్షన్ కారణంగా విద్యార్థులు సరిగా పరీక్ష రాయలేదనే విమర్శలున్నాయి. దీన్ని దూరం చేసేందుకు ఈసారి జిల్లా స్థాయిలో యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైతే పరీక్ష వాయిదా వేసే అధికారం జిల్లా అధికారులకే ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. -
గిరిజన విద్యార్థి.. కష్టాలను అధిగమించి,ఐఐటీలో సీటు సాధించింది
జె.ఇ.ఇ. ఎంట్రన్స్‌లో ర్యాంకు కొట్టడం సామాన్యం కాదు.అందుకై కొందరు రాజస్తాన్ వెళ్తారు. కొందరు హైదరాబాద్, విజయవాడ చేరుకుంటారు.తల్లిదండ్రులు గైడ్ చేస్తారు. కాని నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు పుట్టిన కోయ విద్యార్థిని కొర్సా లక్ష్మి గురుకుల పాఠశాలలో చదువుకునే మంచి ర్యాంకు సాధించింది.పాట్నా ఐఐటీలో సీటు సాధించింది. కోయలలో ఒక అమ్మాయి సాధించిన స్ఫూర్తినిచ్చే విజయం ఇది. కొర్సా లక్ష్మి పరిచయం. కొంతమంది ఇళ్లల్లో, నిజానికి చాలామంది ఇళ్లల్లో పిల్లలు జె.ఇ.ఇ. ఎంట్రన్స్ రాయడానికి తల్లిదండ్రులు చాలా శ్రద్ధ పెడతారు. బాగా చదివించే కోచింగ్ సెంటర్ కోసం అవసరమైతే రాజస్థాన్‌లోని కోటాకు వెళతారు లేదా హైదరాబాద్, విజయవాడలలో ప్రఖ్యాత కోచింగ్ సెంటర్లలో వేస్తారు. ఇక పిల్లలు ఇంట్లో ఉండి చదువుకుంటుంటే టీవీలు బంద్ చేస్తారు. మాటా పలుకూ లేకుండా పిల్లలు ఇరవై నాలుగ్గంటలూ చదువుకునేలా చేస్తారు. మెటీరియల్ తెచ్చిస్తారు. చాలా హైరానా పడతారు. అదేం తప్పు కాదు. కాని ఇలాంటివన్నీ లేకుండా కూడా కొంతమంది విజయం సాధిస్తుంటారు. కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుకున్న కోయ విద్యార్థిని కుర్సా లక్ష్మి అలాంటి విజేతే. పట్టుదలతో చదువుకుని ర్యాంకు సాధించిన విజేత. ఐసులమ్మే తండ్రి కూతురు కొత్తగూడెం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన తండా కాటాయగూడెం. 300 గడపలున్న గ్రామం ఇది. అందరూ కోయలే. వ్యవసాయ కూలీలే. ఏ కొద్దిమందికో కాసింత భూమి ఉంటుంది. కొర్సా లక్ష్మి తండ్రి కన్నయ్యకు ఎకరం భూమి ఉంది. కాని వాన పడితేనే పండుతుంది. కన్నయ్య వ్యవసాయ కూలీగా వెళతాడు. తల్లి శాంతమ్మ కూడా. వ్యవసాయ పనులు లేనప్పుడు తన టీవీఎస్ ఎక్సెల్ మీద ఐస్ బాక్స్ పెట్టుకుని ఐసులమ్ముతాడు. ముగ్గురు పిల్లలు. కాని పెద్ద కొడుకు చదువు ఇష్టం లేక 7వ తరగతిలో ఇంట్లో నుంచి పారిపోయాడు. రెండో కొడుకు మామూలు చదువే. చివరి అమ్మాయి లక్ష్మి బాగా చదువుకోవాలని నిశ్చయించుకుంది. పిన్ని స్ఫూర్తి కన్న తల్లిదండ్రులు చదువు లేని వారు కావడంతో లక్ష్మికి చదువులో ఏ సాయమూ చేయలేకపోయేవారు. ఆరవ తరగతి నుంచి కొత్తగూడెం గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న లక్ష్మికి పిన్ని సుమలత స్ఫూర్తిగా నిలిచింది. డిగ్రీ చదువుకున్న సుమలత హాస్టల్లో ఉన్న లక్ష్మిని తరచూ కలుస్తూ చదువు విలువ చెబుతూ వచ్చింది. డబ్బుకు విలువ ఇవ్వని వారు కూడా చదువుకు విలువ ఇస్తారని తెలిపింది. సెలవుల్లో ఇంటికి తీసుకువచ్చి లక్ష్మి మంచి చెడ్డలు చూసేది. ఆమె మాటలు లక్ష్మి మనసులో నాటుకుపోయాయి. ‘ఏ రోజూ కూడా రాత్రి ఒంటి గంట లోపు లక్ష్మి పుస్తకం మూయగా చూడలేదు’ అని లక్ష్మి బాబాయ్ రవి తెలిపాడు. గురుకుల పాఠశాలలో కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో దాదాపు వేయి మంది అమ్మాయిలు 6 నుంచి ఇంటర్ వరకూ చదువుతున్నారు. ప్రిన్సిపాల్ దేవదాసు, ఉపాధ్యాయులు వీరి చదువు మీద బాగా శ్రద్ధ పెడుతున్నారు. చురుకైన విద్యార్థినులను ఎంపిక చేసి జె.ఇ.ఇలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్లో ఎం.పి.సి తీసుకున్న లక్ష్మి 992 మార్కులు సాధించింది. దాంతో ఇంకా ఉత్సాహంతో జె.ఇ.ఇకి ప్రిపేర్ అయ్యింది. జె.ఇ.ఇ అడ్వాన్స్‌డ్‌లో 1371వ ర్యాంకు సాధించింది. పాట్నా ఐ.ఐ.టిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో మొన్నటి ఆగస్టు మొదటివారంలో సీటు పొందింది. గురుకుల పాఠశాల నుంచి ఈ ఘనత సాధించిన అమ్మాయి లక్ష్మీ. ఐ.ఏ.ఎస్ చేయాలని... బాగా చదువుకుని ఐ.ఏ.ఎస్ చేయాలనేది తన లక్ష్యమని కొర్సా లక్ష్మి చెప్పింది. జె.ఇ.ఇలో మంచి ర్యాంకు సాధించి ఐ.ఐ.టిలో సీటు పొందడంతో ఐ.టి.డి.ఏ అధికారులు లక్ష్మిని ప్రశంసించారు. ట్యాబ్ ఇచ్చి ఆర్థిక సహాయం చేశారు. లక్ష్మి ఇంత బాగా చదవడంతో ఇంకా కొంతమంది ఆమె చదువును ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. ఆ ప్రోత్సాహం వల్ల లక్ష్మి ఐ.ఏ.ఎస్ చదివి పేద వర్గాల కోసం పని చేయాలని నిశ్చయించుకుంది. -
జూలై 26న నీట్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు నీట్ పరీక్షకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 26న పరీక్ష నిర్వహిస్తామని మంగళవారం ప్రకటించింది. వాస్తవంగా ఈ నెల మూడో తేదీన జరగాల్సిన నీట్ పరీక్ష, కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు తేదీని ప్రకటించడంతో విద్యార్థులకు ఓ స్పష్టత వచ్చింది. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం, జూలై నాటికి ఏ మేరకు వైరస్ కట్టడిలోకి వస్తుందో అంతుబట్టకపోవడంతో అనుకున్న మేరకు ప్రవేశపరీక్ష జరుగుతుంందా లేదా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఇక ఇటు పరీక్ష నిర్వహించే జిల్లాలు గతంలో మాదిరిగానే కేవలం ఐదే ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులు, పక్క రాష్ట్రాలకు చెందిన కొందరు ఈ కేంద్రాల్లోనే పరీక్ష రాస్తారు. ఒక అంచనా ప్రకారం ప్రతి ఏటా రాష్ట్రంలో దాదాపు 70 వేల మంది నీట్ పరీక్ష రాస్తున్నారు. అందరూ ఈ ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే పరీక్ష రాయాల్సి రావడం చర్చనీయాంశమైంది. కరోనా కారణంగా వీరందరినీ గుంపులుగా ఒకేచోట కూర్చోబెట్టి పరీక్ష నిర్వహించడం కష్టమైన వ్యవహారం. పైగా వైరస్ వ్యాప్తి జరిగే ప్రమాదముందని వైద్యాధికారులు అంటున్నారు. అంతేగాక అన్ని జిల్లాల వారు ఈ ఐదు జిల్లాలకు రావడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఉమ్మడి జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయాలని, లేకుంటే ప్రస్తుతం ప్రకటించిన జిల్లాల్లోనైనా ఎక్కువ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్రానికి విన్నవిస్తామని ఒక అధికారి తెలిపారు. మరోవైపు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించే అంశంపైనా సమాలోచనలు చేస్తున్నారు. దీనిపై కూడా వారి అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో 4,900 ఎంబీబీఎస్ సీట్లు... 2020–21 సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు నీట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించాలంటే నీట్ ర్యాంకు తప్పనిసరి. అయితే ఎయిమ్స్, జిప్మర్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లను కూడా మొదటిసారి నీట్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 532 ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీల్లోని 76,928 సీట్లు, 914 ఆయుష్ కాలేజీల్లో 52,720 సీట్లు, 313 బీడీఎస్ కాలేజీల్లో 26,949 సీట్లు, 15 ఎయిమ్స్ కాలేజీల్లోని 1,207 ఎంబీబీఎస్ సీట్లు, రెండు జిప్మర్ ఎంబీబీఎస్ కాలేజీల్లో ఉన్న 200 సీట్లు.. అన్నింటికీ నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ జరుగుతుంది. చదవండి: తెలంగాణలో 29 దాకా లాక్డౌన్ ఇక అన్ని రాష్ట్రాల్లో ఉన్న కన్వీనర్ కోటాలోని 15 శాతం సీట్లను ఆలిండియా ర్యాంకులతో భర్తీ చేస్తారు. 85 శాతం సీట్లను రాష్ట్ర ర్యాంకుల ఆధారంగా కేటాయిస్తారు. ఆ మేరకు నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటిస్తారు. డీమ్డ్, సెంట్రల్ వర్సిటీల్లోని సీట్లను నూటికి నూరు శాతం నీట్ ర్యాంకుల ఆధారంగా వారే భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎన్ఆర్ఐ, బీ కేటగిరీ సీట్లను కూడా నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 4,900 వరకు ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటన్నింటినీ నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేయనున్నారు. -
జేఈఈలో ఇంటర్ వెయిటేజీ రద్దు
►ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్‌ఐటీలు తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్ష ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు ఉన్న వెయిటేజీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఖరారులో విద్యార్థుల ఇంటర్ మార్కులకు 40 %వెయిటేజీ, జేఈఈ మెయిన్ స్కోర్‌కు 60% వెయిటేజీ ఇస్తున్నారు. ఆ ర్యాంకుల ఆధారంగానే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించారు. అయితే ఇంటర్ వెయిటేజీతో ప్రయోజనం లేదని గతేడాది ఐఐటీల కౌన్సిల్ అభిప్రాయపడడంతో.. జేఈఈ పరీక్షలో సంస్కరణలపై ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ ఇంటర్ వెయిటేజీని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ మేరకు ఇంటర్ మార్కులకు ఉన్న 40% వెయిటేజీని రద్దు చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జేఈఈకి హాజరయ్యేందుకు ఇంటర్లో 75% మార్కులు, ఆపైన (ఎస్సీ, ఎస్టీలైతే 65%) ఉంటే సరిపోతుందని.. లేదా టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలని పేర్కొంది. జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగానే ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశాలు చేపడతామని పేర్కొంది. గతంలోనే ఐఐటీల నిబంధనల్లో మార్పులు: ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఉండటంతోపాటు టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలన్న నిబంధన గతంలో ఉంది. టాప్-20 పర్సంటైల్‌లో ఉన్నా, ఇంటర్లో 75% మార్కులు వచ్చినా సరిపోతుందన్న నిబంధనను ఈ విద్యా సంవత్సరం నుంచి (2016-17) అమల్లోకి తెచ్చారు. తాజాగా ఎన్ఐటీల్లో ప్రవేశాలకు కూడా ఇదే నిబంధనను అమల్లోకి తెచ్చారు. దీంతో ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీ, ఐఐటీలు, కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఒకే రకమైన నిబంధనలు అమలు కానున్నాయి. 2017లో ఉమ్మడి పరీక్ష లేనట్లే!: ప్రస్తుతం అమల్లోకి తెచ్చిన ఇంటర్ వెయిటేజీ రద్దు, 75% మార్కులు వస్తే చాలన్న మార్పులు మినహా 2017-18 విద్యా సంవత్సరంలో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్‌ఐటీల ప్రవేశాల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మార్పుల ఉత్తర్వులను జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించే సీబీఎస్ఈ చైర్మన్‌కు, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించే ఐఐటీ సంయుక్త కమిటీకి పంపించారు. దీంతో ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టాలన్న నిబంధన 2017 నుంచి కూడా అమల్లోకి వచ్చే అవకాశం లేదు. -
కేటీపీపీ రెండోదశ జాతికి అంకితం
- 600 మెగావాట్ల ప్లాంట్‌లో సీఓడీ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం - జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడి గణపురం(వరంగల్ జిల్లా): కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లోని రెండవదశ 600 మెగావాట్ల ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ సీఓడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) ప్రకటించి జాతికి అంకితం చేసినట్లు జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రకటించారు. వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కేటీపీపీలో గురువారం జరిగిన ఒప్పంద పత్రంపై జెన్కో, ట్రాన్స్‌కో డిస్కం, గ్రిడ్ల ఉన్నత స్థాయి అధికారులు సంతకాలు చేశారు. గురువారం నుంచి రెండవదశ 600మెగావాట్ల ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వ్యాపారత్మకంగా వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లను, కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులను, కార్మికులను, ఉద్యోగులను జెన్కో సీఎండీ అభినందించారు. జనవరి 5న కేటీపీపీ రెండవ దశ 600 మెగావాట్ల ప్లాంట్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. వాస్తవానికి అప్పటికే ప్లాంట్‌లో సీఓడీ ప్రకటించాలి. కొన్ని సాంకేతిక సమస్యల మూలంగా 80రోజుల సమయం పట్టింది. ప్లాంట్‌లో 600మెగావాట్ల లక్ష్యం మేరకు 72గంటల పాటు ఆటంకం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేసిన అనంతరం కాంట్రాక్ట్ కంపెనీ బీహెచ్సీఎల్ జెన్కోకు అప్పగించింది. జెన్కో అధికారులు తదనంతర కార్యక్రమాలు పూర్తిచేసి విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమంలో జెన్కో డెరైక్టర్ రాధాకృష్ణ, సీఈ శివకుమార్, చంద్రమౌళి, మంగేష్, సత్యనారాయణ, పీఆర్ఓ రఘుపతి తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ పరీక్షలో కీలక మార్పులు
పరీక్ష కేంద్రంలోనే పెన్నుల సరఫరా హన్మకొండ(వరంగల్ జిల్లా): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)లో కీలక మార్పులు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 3న నిర్వహించే ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు పెన్నులు సరఫరా చేయాలని సెంటర్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. కొందరు అభ్యర్థులు సాంతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో కాపీయింగ్‌కు తావు లేకుండా ఈసారి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేలా నిబంధనలు కఠినతరం చేశారు. అభ్యర్థులు వెంట తీసుకొచ్చే పెన్నులు, పెన్సిళ్లను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. క్రేయూన్స్, కలర్ పెన్నులకు మాత్రం అనుమతిస్తారు. వారు లోనికి వెళ్లేముందు స్కానర్లతో క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించారు. పరీక్ష గదిలోకి షూస్‌ను సైతం అనుమతించడం లేదు. షూస్ వేసుకొస్తే బయటనే విడిచి వెళ్లాలి. చెప్పుల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. ఎలక్ట్రానిక్ వస్తువులు, రిస్ట్‌వాచ్‌లను సైతం అనుమతించరు. పరీక్ష గదిలోనే గోడ గడియారాలను అందుబాటులో ఉంచుతారు. ఇన్విజిలేటర్లకు సైతం సెల్ఫోన్ల అనుమతి లేదు. రాష్ట్రవ్యాప్తంగా 59,371 మంది అభ్యర్థులు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కేంద్రాలలో ఆఫ్‌లైన్ పద్ధతిన జరిగే జేఈఈ పరీక్షకు మొత్తం 59,371 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మొదటి పేపర్ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, బీ-ఆర్క్ విభాగానికి సంబంధించిన రెండో పేపర్ పరీక్ష మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పెన్నులు, వాచీలు తెచ్చుకోవద్దు. జేఈఈ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు ఈసారి నిబంధనలను మార్చారు. పరీక్ష కేంద్రంలోకి పెన్నులు, పెన్సిళ్లు, వాచీలను అనుమతించడం లేదు. విద్యార్థులకు అవసరమైన పెన్నులు పరీక్ష గదిలో అందిస్తాం. ప్రతి గదిలో గోడ గడియారం ఏర్పాటు చేస్తాం. - జి.మథ్యాస్‌రెడ్డి (జేఈఈ వరంగల్ సెంటర్ కో ఆర్డినేటర్) -
జేఈఈకి సర్వం సిద్ధం
నేడు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నగరంలో 17 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 12,820 మంది విద్యార్థులు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు సాక్షి, హన్మకొండ : దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆదివారం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. వరంగల్ నగరంలో 17 కేంద్రాలను ఏర్పాటు చేయగా... 12,820 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 9,935 మంది... బీ ఆర్క్, బీ ప్లానింగ్ విభాగంలో 2,885 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు... బీ ఆర్క్, బీ ప్లానింగ్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రత్యేక బస్సులు జేఈఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఇన్చార్జ్ ఆర్ఎం అంచూరి శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్‌కు 50, కరీంనగర్ రూట్లో 25 బస్సులు వేసినట్లు పేర్కొన్నారు. వరంగల్ నగరంలో పరీక్షలు జరిగే సెంటర్లకు సంబంధించిన రూట్లలో ఉద యం 7 గంటల నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు చొప్పున నడపనున్నట్లు వివరించారు. అదేవిధంగా... సెయింట్ పీటర్స్, గ్రీన్వుడ్, జేఎస్ఎం పాఠశాలల నిర్వాహకులు సైతం ఉచితంగా 25 బస్సులు ఏర్పాటు చేశారు. వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లతోపాటు అదాలత్ సెంటర్లలో ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నారు. తప్పిన తిప్పలు రెండేళ్లుగా జేఈఈ పరీక్షలకు సంబంధించి మెట్రో నగరాల్లో ఆన్లైన్ కేంద్రాలు, వరంగల్, గుంటూరు, తిరుపతి వంటి ద్వితీయశ్రేణి నగరాల్లో ఆఫ్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ కేంద్రాల్లో పరీక్షలు రాయడం పట్ల రాష్ట్ర విద్యార్థులు విముఖత చూపడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆఫ్‌లైన్ సెంటర్లనే ఎంపిక చేసుకున్నారు. దీంతో ద్వితీయశ్రేణి నగరాలపై తీవ్రమైన ఒత్తిడి పడింది. 2012లో 50 వేల మంది విద్యార్థులు వరంగల్‌ను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోగా... 2013లో ఈ సంఖ్య 55 వేలకు చేరుకుంది. నగరం నలుమూలలా 85 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒకేసారి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సకాలంలో పరీక్ష కేంద్రాలను గుర్తించి అక్కడికి చేరుకోవడం గగనంగా మారింది. అంతేకాదు... విద్యార్థులు, వారి వెంట వచ్చే సహాయకులకు వసతి, భోజనం వంటి అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానికంగా ఉన్న హోటళ్లలో గదులన్నీ ముందే బుక్ అయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ హాళ్లలో విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. రెండేళ్లుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సారి హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో వరంగల్, తిరుపతి, గుంటూరు, ఖమ్మం వంటి నగరాలపై ఒత్తిడి తగ్గింది. విద్యార్థులకు సూచనలు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకుచేరుకోవాలి. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా... అనుమతించరు. జవాబు పత్రాన్ని నలుపు, నీలిరంగు బాల్‌పాయింట్ పెన్నులతోనే నింపాలి. బీ ఆర్క్ విద్యార్థులు పెన్సిల్, జామెట్రీబాక్స్, క్రేయాన్స్లను పరీక్ష హాల్లోకి తీసుకెళ్లవచ్చు. ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. రూట్ల వారీగా ఆర్టీసీ బస్సులు.. రూట్ నంబర్-1 : కాజీపేట-వరంగల్ రూట్లో బాలసముద్రంలోని ఎస్ఆర్ డిగ్రీ, పీజీ కాలేజీ... అంబేద్కర్ సెంటర్లోని గురుకుల్ స్కూల్... నక్కలగుట్టలోని కాకతీయ మహిళా కాలేజీ... ములుగురోడ్డులోని శ్రీ గాయత్రి కాలేజీ... సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ... పీజీ కాలేజీ... హన్మకొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని కాకతీయ ప్రభుత్వ కాలేజీ... కిషన్‌పురలోని చైతన్య డిగ్రీ కాలేజీ... కాజీపేటలోని నిట్ పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను చేరవేయనున్నట్లు శ్రీధర్ తెలిపారు. రూట్ నంబర్-2 : వరంగల్-కాజీపేట, వయా ఎన్జీవోస్ కాలనీ రూట్లో సెయింట్ పీటర్స్ పబ్లిక్‌స్కూల్‌కు విద్యార్థులను చేరవేస్తామన్నారు. రూట్ నంబర్-3 : కాజీపేట-వరంగల్ వయా హంటర్రోడ్టు రూట్లో ఎస్వీ రామన్ కాలేజీ, అల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సెన్సైస్, న్యూసైన్స్ పీజీ కాలేజీ, వరంగల్ పబ్లిక్ స్కూల్, జేఎస్ఎం హైస్కూల్, న్యూ సైన్స్ డిగ్రీ కాలేజీలకు ఆర్టీసీ బస్సులు నడపనున్నామని చెప్పారు. రూట్ నంబర్ 24 : ఎర్రగట్టు కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ సమీంపలోని గ్రీన్వుడ్ హైస్కూల్ సెంటర్‌కు విద్యార్థులను చేరవేయనున్నట్లు శ్రీధర్ వెల్లడించారు. - న్యూస్‌లైన్, హన్మకొండ సిటీ