పరీక్ష కేంద్రంలోనే పెన్నుల సరఫరా
హన్మకొండ(వరంగల్ జిల్లా): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)లో కీలక మార్పులు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 3న నిర్వహించే ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు పెన్నులు సరఫరా చేయాలని సెంటర్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది. కొందరు అభ్యర్థులు సాంతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో కాపీయింగ్‌కు తావు లేకుండా ఈసారి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేలా నిబంధనలు కఠినతరం చేశారు. అభ్యర్థులు వెంట తీసుకొచ్చే పెన్నులు, పెన్సిళ్లను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. క్రేయూన్స్, కలర్ పెన్నులకు మాత్రం అనుమతిస్తారు. వారు లోనికి వెళ్లేముందు స్కానర్లతో క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించారు. పరీక్ష గదిలోకి షూస్‌ను సైతం అనుమతించడం లేదు. షూస్ వేసుకొస్తే బయటనే విడిచి వెళ్లాలి.
చెప్పుల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. ఎలక్ట్రానిక్ వస్తువులు, రిస్ట్‌వాచ్‌లను సైతం అనుమతించరు. పరీక్ష గదిలోనే గోడ గడియారాలను అందుబాటులో ఉంచుతారు. ఇన్విజిలేటర్లకు సైతం సెల్‌ఫోన్‌ల అనుమతి లేదు. రాష్ట్రవ్యాప్తంగా 59,371 మంది అభ్యర్థులు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కేంద్రాలలో ఆఫ్‌లైన్ పద్ధతిన జరిగే జేఈఈ పరీక్షకు మొత్తం 59,371 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మొదటి పేపర్ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, బీ-ఆర్క్ విభాగానికి సంబంధించిన రెండో పేపర్ పరీక్ష మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పెన్నులు, వాచీలు తెచ్చుకోవద్దు. జేఈఈ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు ఈసారి నిబంధనలను మార్చారు. పరీక్ష కేంద్రంలోకి పెన్నులు, పెన్సిళ్లు, వాచీలను అనుమతించడం లేదు. విద్యార్థులకు అవసరమైన పెన్నులు పరీక్ష గదిలో అందిస్తాం. ప్రతి గదిలో గోడ గడియారం ఏర్పాటు చేస్తాం.
- జి.మథ్యాస్‌రెడ్డి (జేఈఈ వరంగల్ సెంటర్ కో ఆర్డినేటర్)
జేఈఈ పరీక్షలో కీలక మార్పులు
Published Thu, Mar 24 2016 10:25 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM
Advertisement