జూలై 26న నీట్‌ | NEET 2020 To Be Held In July 26th | Sakshi
Sakshi News home page

జూలై 26న నీట్‌

Published Wed, May 6 2020 2:59 AM | Last Updated on Wed, May 6 2020 2:59 AM

NEET 2020 To Be Held In July 26th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు నీట్‌ పరీక్షకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూలై 26న పరీక్ష నిర్వహిస్తామని మంగళవారం ప్రకటించింది. వాస్తవంగా ఈ నెల మూడో తేదీన జరగాల్సిన నీట్‌ పరీక్ష, కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు తేదీని ప్రకటించడంతో విద్యార్థులకు ఓ స్పష్టత వచ్చింది. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం, జూలై నాటికి ఏ మేరకు వైరస్‌ కట్టడిలోకి వస్తుందో అంతుబట్టకపోవడంతో అనుకున్న మేరకు ప్రవేశపరీక్ష జరుగుతుంందా లేదా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఇక ఇటు పరీక్ష నిర్వహించే జిల్లాలు గతంలో మాదిరిగానే కేవలం ఐదే ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులు, పక్క రాష్ట్రాలకు చెందిన కొందరు ఈ కేంద్రాల్లోనే పరీక్ష రాస్తారు. ఒక అంచనా ప్రకారం ప్రతి ఏటా రాష్ట్రంలో దాదాపు 70 వేల మంది నీట్‌ పరీక్ష రాస్తున్నారు. అందరూ ఈ ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే పరీక్ష రాయాల్సి రావడం చర్చనీయాంశమైంది.

కరోనా కారణంగా వీరందరినీ గుంపులుగా ఒకేచోట కూర్చోబెట్టి పరీక్ష నిర్వహించడం కష్టమైన వ్యవహారం. పైగా వైరస్‌ వ్యాప్తి జరిగే ప్రమాదముందని వైద్యాధికారులు అంటున్నారు. అంతేగాక అన్ని జిల్లాల వారు ఈ ఐదు జిల్లాలకు రావడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఉమ్మడి జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయాలని, లేకుంటే ప్రస్తుతం ప్రకటించిన జిల్లాల్లోనైనా ఎక్కువ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్రానికి విన్నవిస్తామని ఒక అధికారి తెలిపారు. మరోవైపు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించే అంశంపైనా సమాలోచనలు చేస్తున్నారు. దీనిపై కూడా వారి అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

రాష్ట్రంలో 4,900 ఎంబీబీఎస్‌ సీట్లు...
2020–21 సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ కోర్సులకు నీట్‌ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సీట్లు సాధించాలంటే నీట్‌ ర్యాంకు తప్పనిసరి. అయితే ఎయిమ్స్, జిప్‌మర్‌ మెడికల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్‌ సీట్లను కూడా మొదటిసారి నీట్‌ ద్వారానే భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 532 ఎంబీబీఎస్‌ మెడికల్‌ కాలేజీల్లోని 76,928 సీట్లు, 914 ఆయుష్‌ కాలేజీల్లో 52,720 సీట్లు, 313 బీడీఎస్‌ కాలేజీల్లో 26,949 సీట్లు, 15 ఎయిమ్స్‌ కాలేజీల్లోని 1,207 ఎంబీబీఎస్‌ సీట్లు, రెండు జిప్‌మర్‌ ఎంబీబీఎస్‌ కాలేజీల్లో ఉన్న 200 సీట్లు.. అన్నింటికీ నీట్‌ ర్యాంకుల ద్వారానే భర్తీ జరుగుతుంది. చదవండి: తెలంగాణలో 29 దాకా లాక్‌డౌన్‌ 

ఇక అన్ని రాష్ట్రాల్లో ఉన్న కన్వీనర్‌ కోటాలోని 15 శాతం సీట్లను ఆలిండియా ర్యాంకులతో భర్తీ చేస్తారు. 85 శాతం సీట్లను రాష్ట్ర ర్యాంకుల ఆధారంగా కేటాయిస్తారు. ఆ మేరకు నీట్‌ రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటిస్తారు. డీమ్డ్, సెంట్రల్‌ వర్సిటీల్లోని సీట్లను నూటికి నూరు శాతం నీట్‌ ర్యాంకుల ఆధారంగా వారే భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని ఎన్‌ఆర్‌ఐ, బీ కేటగిరీ సీట్లను కూడా నీట్‌ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో 4,900 వరకు ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. వాటన్నింటినీ నీట్‌ ర్యాంకుల ద్వారానే భర్తీ చేయనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement