Central Human Resources Department
-
కరోనా దెబ్బతో కీలక ప్రవేశ పరీక్షలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో కీలక ప్రవేశ పరీక్షలు జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం జేఈఈ పరీక్ష జూలై 19-23 వరకు, నీట్ పరీక్ష జూలై 26న జరగాల్సి ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఈ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు హెచ్చార్డీ మంత్రి రమేష్ పోక్రియాల్ తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ మధ్య జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్ పరీక్ష నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు. అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను సెప్టెంబర్ 27న నిర్వహిస్తామని తెలిపారు. కాగా, మహమ్మారి కరోనా భయాలతో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్రాల విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు అందడంతో.. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం తమకు ముఖ్యమని కేంద్ర మానవ వనరుల శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేయాలని కొందరు, వాటి నిర్వహణపై క్లారీటీ ఇవ్వాలని మరికొందరు మానవ వనరుల శాఖకు విన్నవించారు. ఈక్రమంలో పరిస్థితిని సమీక్షించి తగిన సిఫార్సులు చేసేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం ఓ కమిటీని నియమించారు. కమిటీ నివేదికను అనుసరించి పరీక్షలు వాయిదాకు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు దాదాపు 9 లక్షల మంది, నీట్‌కు సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేయగా.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేశారు. -
చదివిన స్కూల్లోనే సీబీఎస్ఈ పరీక్షలు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పెండింగ్ పరీక్షల విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. విద్యార్థులు బయటి కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, తాము ప్రస్తుతం చదువుకుంటున్న స్కూల్లోనే ఈ పరీక్షలు రాయొచ్చని సూచించింది. లాక్డౌన్ కంటే ముందు నిర్వహించిన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే మొదలైంది. బోర్డు పరీక్షల ఫలితాలను జూలై మాసాంతం నాటికి వెళ్లడించేలా మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షల నిర్వహణకు లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. -
జూలై 26న నీట్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు నీట్ పరీక్షకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 26న పరీక్ష నిర్వహిస్తామని మంగళవారం ప్రకటించింది. వాస్తవంగా ఈ నెల మూడో తేదీన జరగాల్సిన నీట్ పరీక్ష, కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు తేదీని ప్రకటించడంతో విద్యార్థులకు ఓ స్పష్టత వచ్చింది. అయితే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం, జూలై నాటికి ఏ మేరకు వైరస్ కట్టడిలోకి వస్తుందో అంతుబట్టకపోవడంతో అనుకున్న మేరకు ప్రవేశపరీక్ష జరుగుతుంందా లేదా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఇక ఇటు పరీక్ష నిర్వహించే జిల్లాలు గతంలో మాదిరిగానే కేవలం ఐదే ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులు, పక్క రాష్ట్రాలకు చెందిన కొందరు ఈ కేంద్రాల్లోనే పరీక్ష రాస్తారు. ఒక అంచనా ప్రకారం ప్రతి ఏటా రాష్ట్రంలో దాదాపు 70 వేల మంది నీట్ పరీక్ష రాస్తున్నారు. అందరూ ఈ ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే పరీక్ష రాయాల్సి రావడం చర్చనీయాంశమైంది. కరోనా కారణంగా వీరందరినీ గుంపులుగా ఒకేచోట కూర్చోబెట్టి పరీక్ష నిర్వహించడం కష్టమైన వ్యవహారం. పైగా వైరస్ వ్యాప్తి జరిగే ప్రమాదముందని వైద్యాధికారులు అంటున్నారు. అంతేగాక అన్ని జిల్లాల వారు ఈ ఐదు జిల్లాలకు రావడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఉమ్మడి జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయాలని, లేకుంటే ప్రస్తుతం ప్రకటించిన జిల్లాల్లోనైనా ఎక్కువ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్రానికి విన్నవిస్తామని ఒక అధికారి తెలిపారు. మరోవైపు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించే అంశంపైనా సమాలోచనలు చేస్తున్నారు. దీనిపై కూడా వారి అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో 4,900 ఎంబీబీఎస్ సీట్లు... 2020–21 సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు నీట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించాలంటే నీట్ ర్యాంకు తప్పనిసరి. అయితే ఎయిమ్స్, జిప్మర్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లను కూడా మొదటిసారి నీట్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 532 ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీల్లోని 76,928 సీట్లు, 914 ఆయుష్ కాలేజీల్లో 52,720 సీట్లు, 313 బీడీఎస్ కాలేజీల్లో 26,949 సీట్లు, 15 ఎయిమ్స్ కాలేజీల్లోని 1,207 ఎంబీబీఎస్ సీట్లు, రెండు జిప్మర్ ఎంబీబీఎస్ కాలేజీల్లో ఉన్న 200 సీట్లు.. అన్నింటికీ నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ జరుగుతుంది. చదవండి: తెలంగాణలో 29 దాకా లాక్డౌన్ ఇక అన్ని రాష్ట్రాల్లో ఉన్న కన్వీనర్ కోటాలోని 15 శాతం సీట్లను ఆలిండియా ర్యాంకులతో భర్తీ చేస్తారు. 85 శాతం సీట్లను రాష్ట్ర ర్యాంకుల ఆధారంగా కేటాయిస్తారు. ఆ మేరకు నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటిస్తారు. డీమ్డ్, సెంట్రల్ వర్సిటీల్లోని సీట్లను నూటికి నూరు శాతం నీట్ ర్యాంకుల ఆధారంగా వారే భర్తీ చేస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎన్ఆర్ఐ, బీ కేటగిరీ సీట్లను కూడా నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 4,900 వరకు ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటన్నింటినీ నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేయనున్నారు. -
జేఈఈ, నీట్ పరీక్షలపై ప్రకటన రేపు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదివారం శుభవార్త వినిపించింది. లాక్డౌన్ వల్ల వాయిదా పడిన జేఈఈ–మెయిన్స్, నీట్ పరీక్షల నిర్వహణపై మే 5వ తేదీన కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటన చేస్తారని, అదేరోజు కొందరు విద్యార్థులతో ఆన్లైన్ ద్వారా మాట్లాడుతారని పేర్కొంది. ఈ ఏడాది నీట్ పరీక్ష రాసేందుకు 15 లక్షల మంది, జేఈఈ–మెయిన్స్ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నవారు దాన్ని మార్చుకోవచ్చు. -
ర్యాగింగ్ రాక్షసి
సాక్షి, పార్వతీపురం,(విజయనగరం) : టీనేజ్‌లో రంగుల ప్రపంచం. బాధ్యతలు తెలియని ప్రాయం. చిన్న బాధకు కందిపోయే మనస్సు. అప్పుడే ఆకర్షణలకు లోనవుతున్నారు. కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లు.. కొత్త కొత్త బైకుల్ని చూసి మనసు పారేసుకుంటారు. బ్రాండెడ్ డ్రెస్‌లు కొని ధరించాలని ఉవ్విళ్లూరుతారు. ఇవన్నీ దొరకాలంటే.. చేతినిండా పైసలు కావాలి. టీనేజ్ యువత సులభ సంపాదనకు అలవాటు పడుతోంది. ఇందులో భాగంగా తోటి విద్యార్థులను వేధించడం, సీనియర్లు జూనియర్లతో ఖర్చులు పెట్టించడం, కొత్తగా కళాశాల్లో చేరే అమాయక విద్యార్థుల బలహీనతను కనిపెట్టి వారిని బెదిరించి ఖర్చు పెట్టించడం.. ఇవన్నీ ర్యాగింగ్‌లో భాగమయ్యాయి. కళాశాలల్లో ర్యాగింగ్ వెర్రి తలలు వేస్తోంది. పోలీసులు మహిళా రక్షక్ పేరిట కమిటీలను ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకపోతోంది. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు వృద్ధి చెందేలా.. ర్యాగింగ్ నిరోధించేలా కళాశాలల యాజమాన్యాలు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కథనమిది. కళాశాలలు, వసతిగృహాలు, క్యాంపస్‌ల ఆవరణల్లో వివిధ రూపాల్లో ర్యాగింగ్ సాగుతోంది. గతంలో పలుచోట్ల బాలికల వసతిగృహాల్లోను ఈ దుమారం రేగడం తెలిసిందే. గత ఏడాది విజయనగరం పట్టణంలో విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తే పోలీసులు బుద్ధి చెప్పడం తెలిసిందే. వివిధ కారణాలతో ఇలాంటివి ఒకటి, రెండు మాత్రమే బయటికి వస్తున్నాయి.కళాశాల బయట ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో సీనియర్లే కాకుండా... బయటి వ్యక్తులు కూడా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. అమ్మాయిలు చూసీ చూడనట్టు ఉండటంతో ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారు. ఎవరైనా కామెంట్ చేస్తే గట్టిగా ఎదిరించాలని.. బహిరంగ ప్రాంతాల్లో పోలీసు నిఘా పెట్టాలని మహిళా సంఘాలు సూచిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు ఆడపిల్లలు వెళ్లే సమయాల్లో బస్సులో ప్రయాణించే కొందరు ఆకతాయిలు ఇబ్బంది పెట్టడం, ద్వందార్థాలతో వారిని కించపరచడం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఆడపిల్లలు ఫిర్యాదు చేయాలి. లేదంటే ఏడాది పొడవునా ఆకతాయిలు రెచ్చిపోయి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ర్యాగింగ్ నిరోధానికి కళాశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే వారు దీన్ని ప్రోత్సహించినట్టు భావించి శిక్షించాలని చట్టం చెబుతోంది. దీనికి కళాశాల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ కమిటీలోని అధ్యాపకులు, వార్డెన్ బాధ్యులే. దీనికి తోడు ఇలాంటి కళాశాలలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలను నిలిపివేస్తారు.ర్యాగింగ్‌కు పాల్పడితే బాధితులు ఫిర్యాదు చేయాలి. విద్యార్థులు క్రమ శిక్షణను అలవరచుకోవాలి. యాజమాన్యాలు సైతం ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు ఆదేశాలివి.. దేశ వ్యాప్తంగా ర్యాగింగ్ నిరోధానికి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీని ప్రచారం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. దీని సిఫార్సులను విధిగా అమలు చేయాలి. కళాశాలకు కొత్తగా వచ్చే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సీనియర్లు, జూనియర్ల మధ్య స్నేహభావం పెంపొందించేందుకు సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను ఆయా కళాశాలల్లో విస్తృతంగా నిర్వహించాలి. ప్రతి కళాశాలలో ర్యాగింగ్ నిరోధక పర్యవేక్షణ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి. పోలీసుల టోల్ ఫ్రీ నంబరు విద్యార్థులు ర్యాగింగ్‌కు గురైతే వెంటనే 100 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయొచ్చు. వెంటనే కంట్రోల్ రూమ్ అధికారులు, స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్‌కు నేరుగా తెలపొచ్చు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ మానవ నవరుల శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 18001805522కు కూడా ఫిర్యాదు చేయొచ్చు. సంఘటన జరిగిన వెంటనే బాధితులు లేదా స్నేహితులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించొచ్చు. బాధితుల పేరు, ప్రాంత కంట్రోల్ రూమ్‌లో నమోదవుతాయి. అక్కడి అధికారులు తక్షణమే స్పందించి సంస్థ, విశ్వవిద్యాలయం అధికారులకు సమాచారం ఇస్తారు. సంఘటన తీవ్రమైందని భావిస్తే కంట్రోల్ రూమ్ నుంచి నేరుగా జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీలకు సమాచారం అందిస్తారు. తీసుకోవలసిన జాగ్రత్తలు కళాశాల నోటీసు బోర్డులో ర్యాగింగ్ నిరోధక హెల్ప్‌లైన్ నంబరు ఉండాలి. ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలి. ప్రిన్సిపల్ ఆయా విభాగాల అధిపతులు, కమిటీ సభ్యులు, స్క్వాడ్ సబ్ డివిజన్ జిల్లా పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు ఉండాలి. కానీ జిల్లాలోని చాలా కళాశాలల్లో వీటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రతి కళాశాలలో మనస్తత్వ నిపుణుడిని నియమించాలి. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలి. విధిగా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి. పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలను ప్రచురించాలి. -
కొత్తకొత్తగా చదివిద్దాం
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో బోధనాభ్యాసన ప్రక్రియల్లో సమూల మార్పులకు కేంద్ర మానవవనరుల శాఖ నిర్ణయించింది. పాత మూస ధోరణులను వదిలి అధునాతన ప్రణాళికలు, బోధనా విధానాలు అనుసరించేలా కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు సంబంధించి వర్సిటీలతో పాటు అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో వీటిని పాటించాల్సిందిగా సూచించింది. ఆయా సంస్థల్లో ఇకపై విద్యార్థి కేంద్ర బిందువుగా పాఠ్య ప్రణాళిక, బోధనాభ్యాసన విధానాలను అమలుచేయాల్సి ఉంటుంది. ‘స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్’ పేరిట ఈ మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ (యూజీసీ) విడుదల చేసింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలుచేసేలా ఉన్నత విద్యాసంస్థలన్నీ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విద్యార్థులను నూతన ఆలోచనల దిశగా ముందుకు తీసుకువెళ్లడం.. సామాజిక అంశాలపై సునిశితంగా స్పందించడం.. నైతిక విలువలను పెంపొందించుకోవడం.. బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఇందులోని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. కొత్తవిధానంలో ప్రధానాంశాలు.. ప్రస్తుతం నాలుగు గోడల మధ్య పుస్తకాల ఆధారంగా సాగే బోధనకు బదులు ఈ కొత్త విధానం సామాజికీకరణ, అనుసంధానత, పాలనా భాగస్వామ్యం, అనుభవీకరణ అనేవి ప్రధానాంశాలుగా ఈ నూతన విధానంలో పొందుపరిచారు. - కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులు సౌకర్యవంతంగా తమ చదువు కొనసాగించేందుకు సీనియర్ విద్యార్థులు, అధ్యాపకులతో మార్గనిర్దేశం చేస్తారు. దీనివల్ల విద్యార్థులు ఉత్సాహపూరిత వాతావరణంలో చదువుకునేందుకు వీలుంటుంది. - సంస్థలోని విద్యార్థులు, అధ్యాపకుల మధ్య అనుబంధం ఏర్పడేలా చేయాలి. - సంస్థ విధానాలు, కార్యక్రమాలు, విలువలు, మెంటార్ గ్రూపులపై ముందుగా వారికి అవగాహన కల్పించాలి. - నిపుణులతో ఉపన్యాసాలు ఇప్పించాలి. ఆయా విద్యా సంస్థల పరిధిలోని స్థానిక అంశాలపై అవగాహన కలిగేలా విద్యార్థులతో పర్యటనలు చేయించాలి. - గ్రూపు చర్చలు, సబ్జెక్టు అంశాలపై ప్రసంగాలు, అభ్యసన నైపుణ్యాలు, కళలు, సాహిత్యం, సాంస్కృతిక, మానవతా విలువలు తదతర అంశాలపై కార్యక్రమాలు నిర్వహించి వారిలో అనుభవాలను ప్రోదిచేయాలి. మెంటరింగ్.. కనెక్టింగ్ ఈ కొత్త విధానంలో విద్యార్థులకు ఫ్యాకల్టీ సభ్యులతో అనుసంధానించడం (మెంటార్షిప్) అతిముఖ్యమైనది. ఇది విద్యార్థులు, అధ్యాపకుల మధ్య ఆరోగ్యకరమైన బంధాన్ని నెలకొల్పుతుంది. దీనివల్ల విద్యార్థులు కొత్త అనుభవాలతో మరింత వికాసాన్ని పొందడంతో పాటు అభ్యసనంలో మరింత ఉత్సాహాన్ని పొందగలుగుతారు. మెంటార్షిప్ వల్ల ఒత్తిడికి గురికాకుండా ధైర్యంగా ముందుకు వెళ్లగలిగే స్వభావాన్ని అలవర్చుకుంటారు. కులమతాలకు అతీతంగా ఒక దేశ పౌరుడిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలపై విద్యార్థి ఆలోచించేలా చేయాలి. ఈ మెంటారింగ్‌లో.. అంశాలను ఎంచుకోవడం, ఏం చేయాలో.. ఏం చేయరాదో అన్నవాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం మెంటార్ల ప్రధాన బాధ్యత. వివిధ అంశాలపై ఆరు రోజుల పాటు మెంటార్షిప్ కొనసాగించాలి. ప్రతీ మెంటార్ పరిధిలో 20 మంది చొప్పున గ్రూప్‌ను ఏర్పాటుచేయాలి. విద్యార్థులు తమ జీవితంపట్ల, సమాజంలో తాను పోషించాల్సిన పాత్రపట్ల స్పష్టమైన అవగాహనకు వచ్చేలా చూడాలి. అంతేకాక.. విద్యార్థులు వేరు, విద్యా సంస్థ వేరు అనేలా కాకుండా మొత్తం ఒక కుటుంబం మాదిరిగా ఉండేలా విద్యా సంబంధిత కార్యక్రమాలు, సదస్సులు, ప్రయోగశాలలు, తదితర కార్యక్రమాలు పెంపొందించాలి. అలాగే, వీటి ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలి. సెమిస్టర్ పూర్తయిన అనంతరం ప్రతీవారం ఓ గంట ప్రతీ మెంటార్ గ్రూపు సమావేశమవ్వాలి. క్రీడల్లో భాగస్వాముల్ని చేయాలి విద్యార్థులను కేవలం బోధన, పుస్తక పఠనాలకే పరిమితం చేయకుండా క్రీడల్లో భాగస్వాముల్ని చేయాలి. ప్రతిరోజూ సాయంత్రం లేదా స్థానిక వాతావరణానికి వీలుగా అనువైన సమయాల్లో వీటిని చేపట్టాలి. ఇవి సమిష్టి కృషికి తోడ్పడతాయి. ప్రతీ విద్యార్థి ఏదో ఒక క్రీడాంశంలో పాల్గొనేలా చేయాలి. ఆ తరువాత దానిలో నైపుణం సాధించేలా తీర్చిదిద్దాలి. -
నీట్, జేఈఈలకు ఉచిత శిక్షణ ఇస్తాం
న్యూఢిల్లీ: నీట్, జేఈఈ, నెట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు 2019, మే నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్న 2,697 స్టడీ సెంటర్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శిక్షణ కేంద్రాలుగా మారుస్తుందని వెల్లడించారు. ఈ స్టడీ సెంటర్లు వచ్చే నెల 8 నుంచి ప్రారంభమవుతాయి. ఈ కేంద్రాలు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజును వసూలు చేయబోవు. చదువుకోవాలన్న తపన ఉన్నప్పటికీ ఆర్థిక కారణాలతో వెనుకంజ వేస్తున్న విద్యార్థుల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్టీఏ తొలుత జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు 2019, జనవరిలో మాక్ టెస్టులు నిర్వహిస్తారు. మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ లో విద్యార్థులు మాక్ టెస్టుల కోసం సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్ కావొచ్చని వెల్లడించారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం కేంద్రం ఎన్టీఏను స్థాపించిన సంగతి తెలిసిందే. -
6 విద్యా సంస్థలకు కిరీటం
న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ (ఐవోఈ)’ హోదా కల్పించింది. ఇందులో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా తీర్చిదిద్దేందుకు వీటికి స్వయం ప్రతిపత్తి కల్పించడంతోపాటు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరుతోపాటు ప్రైవేటు సంస్థలైన మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను కేంద్రం ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తించింది. ఐవోఈ హోదా పొందిన ఈ మూడు ప్రభుత్వ సంస్థలకు వచ్చే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల నిధులను కేంద్రం అందజేయనుంది. ప్రైవేటు సంస్థలకు మాత్రం ప్రభుత్వ నిధులు అందవు. మొత్తంగా 20 సంస్థలకు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థలు కలిపి) ఐవోఈ హోదా ఇవ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి నేతృత్వంలోని ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ (ఈఈసీ).. తొలి దశలో 6 సంస్థలకు ఐవోఈ ప్రకటించింది. టాప్ 100లో ఒక్క వర్సిటీ లేదు ‘ఐవోఈ దేశానికి ఎంతో ముఖ్యం. దేశంలో మొత్తం 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 వర్సిటీల్లో ఒక్కటి కూడా చోటు దక్కించుకోలేదు. కనీసం టాప్ 200లో నిలవలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉపకరిస్తుంది’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఐఓఈ హోదా కోసం తెలంగాణకు చెందిన ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు 114 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 11 సెంట్రల్ యూనివర్సిటీలు, 27 టాప్ ఐఐటీలు, ఎన్ఐటీలు, రాష్ట్రాలకు చెందిన 27 వర్సిటీలు, పది ప్రైవేటు వర్సిటీలు, నాలుగు గ్రీన్‌ఫీల్డ్ సంస్థలు ఉన్నాయి. ఇంకా స్థాపించని సంస్థకు ఐఈవోనా? రిలయన్స్ సంస్థకు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను ఇంకా స్థాపించనేలేదనీ, ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను కాదని జియో ఇన్స్టిట్యూట్కు ఐఈవో హోదా ఎలా ఇచ్చా రని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు జియో ఇన్స్టిట్యూట్ అనే విద్యా సంస్థ ఒకటి రాబోతోందని ప్రపంచానికి తెలిసిందే సోమవారమని అంటున్నారు. ‘జియో ఇన్స్టిట్యూట్కు క్యాంపస్ లేదు. వెబ్సైట్ లేదు. కానీ ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్ లేదా ప్రైవేట్ రంగంలోని అశోక వర్సిటీ, ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ వంటి ప్రఖ్యాత సంస్థలనెన్నింటినో కాదని ఐఈవో హోదా జియోకు ఎలా దక్కింది?’ అని పలువురు విద్యావేత్తలు సహా అనేక మంది ట్వీటర్లో హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను ప్రశ్నించారు. అయితే జియోకు ఐఈవో హోదా ఇవ్వడాన్ని యూజీసీ సమర్థించుకుంది. గ్రీన్‌ఫీల్డ్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో జియోకు ఆ హోదా ఇచ్చామనీ, ఈ కేటగిరీ కింద మొత్తం 11 సంస్థలు దరఖాస్తు చేసుకోగా జియోను అవకాశం వరించిందని యూజీసీ పేర్కొంది. -
నాలుగేళ్ల బీఏ ఈడీ కోసం ఎన్ఐటీఈ
న్యూఢిల్లీ: నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఈడీ, బీఎస్సీ ఈడీ కోర్సుల నిర్వహణ కోసం జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఎన్ఐటీఈ)ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర మానవ వనరుల శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సూచించింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు కోసం సమగ్ర ముసాయిదా రూపొందించాల్సిందిగా మంత్రిత్వ శాఖ గత ఏడాది నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను అధ్యయనం చేసిన ఈ కమిటీ.. ప్రీప్రైమరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ స్కూళ్ల టీచర్లకు అవసరమైన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏఈడీ, బీఎస్సీఈడీ కోర్సుల నిర్వహణ కోసం ప్రత్యేక సంస్థ అవసరమని పేర్కొంది. ‘కొత్తగా ఏర్పాటయ్యే ఎన్ఐటీ ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయటం కాకుండా.. ప్రస్తుత ఉపాధ్యాయులు, విద్యావేత్తల వృత్తిపరమైన అవసరాలను తీర్చుతుంది. విధాన పరమైన మార్గదర్శకాలను రూపొందిస్తుంది.’అని కమిటీ తన ముసాయిదాలో పేర్కొంది. -
గిరిజన వర్సిటీ మరింత ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు మరింత ఆలస్యమవుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు కొత్తగా గిరిజన యూనివర్సిటీని కేంద్రం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జాకారం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 837, 53/1లో 285 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ దాన్ని వర్సిటీకి కేటాయించింది. ఇందులో 120 ఎక రాల్లో అధికారులు హద్దురాళ్లు సైతం ఏర్పాటు చేశారు. జాకారం సమీపంలో ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ) భవనాన్ని వర్సిటీ కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చని గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరు నెలల క్రితం భవనాన్ని కేంద్ర బృందం పరిశీలించి వసతులపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. వాస్తవానికి 2018–19 విద్యా సంవత్సరంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర మానవ వనరుల శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కార్యకలాపాలు సాగించే అవకాశం ఉంటుంది. కానీ, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖలో ఉలుకూపలుకూలేదు. ఒకవేళ అనుమతులు చకచకా వచ్చినా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఈపాటికే రావాల్సి ఉంది. ప్రకటనలు వచ్చిన తర్వాతే ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్ తదితర కార్యక్రమాలు పూర్తి చేయొచ్చు. ఇందుకు కనిష్టంగా నెలన్నర సమయం పడుతుంది. కానీ, కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో ఈ ఏడాది వర్సిటీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఈ వర్సిటీని 2019–20 విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తామని రెండ్రోజుల క్రితం గిరిజన అభివృద్ధి మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రకటించారు. దీంతో గిరిజన యూనివర్సిటీ కోసం మరో ఏడాది వేచి చూడాల్సిందే. -
ఉత్తమ విద్యాసంస్థగా ఏయూ
సాక్షి సెంట్రల్ డెస్క్, విజయవాడ : దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల శాఖ మంగళవారం ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 9 విభాగాల్లో(ఓవరాల్, ఇంజనీరింగ్, వర్సిటీ, మేనేజ్మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, మెడికల్, లా, ఆర్కిటెక్చర్) ఈ ర్యాంకులను వెల్లడించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ఇండియా ర్యాంకింగ్స్ 2018 పేరుతో వీటిని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 3,954 విద్యా సంస్థలను పరిశీలించిన అనంతరం ర్యాంకులను ప్రకటించింది. ఈ ఏడాది ఓవరాల్ కేటగిరీలో రాష్ట్రానికి చెందిన నాలుగు విద్యాసంస్థలకు టాప్ – 100లో చోటు లభించింది. దేశంలోని టాప్ ఉన్నత విద్యాసంస్థల్లో (ఓవరాల్‌గా) విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం 36వ ర్యాంక్ సాధించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 74 వ స్థానంలో నిలిచింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) 83వ స్థానంలో నిలువగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె 89వ స్థానంలో నిలిచింది. వివిధ విభాగాలకు సంబంధించి టాప్ 100లో చోటు సాధించిన రాష్ట్రానికి చెందిన విద్యాసంస్థల వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణలో.. తెలంగాణకు సంబంధించి గతేడాది ఓవరాల్ కేటగిరీలో ఐదు విద్యా సంస్థలు టాప్–100లో ఉంటే.. ఈసారి నాలుగు విద్యా సంస్థలే ఆ అర్హత సాధించాయి. దేశంలో టాప్ ఉన్నత విద్యా సంస్థల్లో(ఓవరాల్‌గా) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) 11వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 14వ స్థానంతో సరిపెట్టుకున్న సెంట్రల్ వర్సిటీ ఈసారి తన స్థానాన్ని మెరుగు పరుచుకుంది. ఇక హైదరాబాద్ ఐఐటీ, వరంగల్ ఎన్ఐటీలు తమ ప్రమాణాలను మెరుగుపరచుకుని గతేడాది కంటే మెరుగైన స్థానాలను దక్కించుకున్నాయి. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకు గతేడాది కంటే ఈసారి మరింతగా పడిపోయింది. గతేడాది 38వ ర్యాంకు తెచ్చుకున్న ఉస్మానియా ఈసారి 45వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఐదు అంశాల ప్రాతిపదికగా ర్యాంకులు.. ప్రధానంగా ఐదు అంశాల ప్రాతిపదికగా కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో టీచింగ్, లెర్నింగ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ అవుట్ కమ్స్, ఔట్రీచ్ అండ్ ఇన్‌క్లూజివిటీ, పర్సెప్షన్ ఆధారంగా 100 పాయింట్లకు లెక్కించి వచ్చిన పాయింట్ల ద్వారా ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా విద్యా సంస్థల్లో పీహెచ్డీ విద్యార్థులు, శాశ్వత అధ్యాపకులు, అధ్యాపక–విద్యార్థి నిష్పత్తి, సీనియర్ అధ్యాపకులు, బడ్జెట్.. దాని వినియోగం, పబ్లికేషన్స్, ప్రాజెక్టులు, ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్, పరీక్షల ఫలితాలు, ప్లేస్‌మెంట్స్, హయ్యర్ స్టడీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టాప్ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల శాతం, మహిళా విద్యార్థులు, పోటీతత్వం, పరిశోధనలు, వాటి ఫలితాలు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. అత్యుత్తమ విద్యాసంస్థ ఐఐఎస్సీ దేశంంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. గతేడాది మాదిరిగానే ఇప్పుడు కూడా ఓవరాల్‌తోపాటు విశ్వవిద్యాలయాల విభాగంలోనూ ఐఐఎస్సీ తొలిస్థానం సాధించింది. అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్, అత్యుత్తమ మేనేజ్మెంట్ విద్యాసంస్థగా ఐఐఎం–అహ్మదాబాద్, అత్యుత్తమ వైద్య విద్యాసంస్థగా ఢిల్లీలోని ఎయిమ్స్ నిలిచాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 301 విశ్వవిద్యాలయాలు, 906 ఇంజినీరింగ్, 487 మేనేజ్మెంట్, 286 ఫార్మసీ, 101 వైద్య, 71 లా, 59 అర్కిటెక్చర్ విద్యాసంస్థలతోపాటు 1087 సాధారణ డిగ్రీ కళాశాలలను అనేక అంశాలవారీగా పరిశీలించిన అనంతరం ఎన్ఐఆర్ఎఫ్ ఈ ర్యాంకులు ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలూ ర్యాంకుల కేటాయింపు కోసం ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు దరఖాస్తులు పంపించాల్సిందేననీ, లేకుంటే వాటికి నిధులను నిలిపేస్తామని కేంద్ర మానవవనరులశాఖ మంత్రి జవదేకర్ చెప్పారు. యూనివర్సిటీల విభాగంలో - ఆంధ్ర విశ్వవిద్యాలయం (విశాఖపట్నం – 22 - శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) – 49 - కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) – 56 - శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (తిరుపతి)– 62 - గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం)– విశాఖ– 85 - శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (అనంతపురం)– 92 ఇంజినీరింగ్ విభాగంలో... - కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం)– 49 - ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ (విశాఖపట్నం) – 65 - శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) – 71 - సాగి రామక్రిష్ణంరాజు ఇంజినీరింగ్ కాలేజ్ (భీమవరం) – 85 - యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (కాకినాడ) – 97 కళాశాల విభాగంలో.. - సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజ్ (కర్నూలు) – 35 - ఆంధ్రా లయోలా కాలేజ్ (విజయవాడ)– 56 మేనేజ్మెంట్ విభాగంలో.. - ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (సత్యవేడు)– 34 - కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) – 46 ఫార్మసీ విభాగంలో.. - ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ (ఆంధ్రాయూనివర్సిటీ) – 28 - రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (అనంతపురం) – 39 లా విభాగంలో..: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లా (విశాఖపట్నం) – 10 ఎస్‌ఆర్‌కేఆర్‌కు జాతీయస్థాయి ర్యాంకింగ్ భీమవరం: జాతీయస్థాయి విద్యాసంస్థల ర్యాంకింగ్‌లో పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు 85వ ర్యాంకు వచ్చిందని ప్రిన్సిపాల్ జి.పార్థసారథి వర్మ తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడిం చారు. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ న్యూఢిల్లీలో ఈ ర్యాంకులకు ప్రకటించారని చెప్పారు. దేశవ్యాప్తంగా 4,500 యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలతో సహా పలు సంస్థలకు జాతీయ ర్యాంక్‌లు వచ్చాయని తెలిపారు. -
మోదీ వ్యాఖ్యలపై దుమారం
పార్లమెంటులో కాంగ్రెస్ ఆందోళన.. స్తంభించిన రాజ్యసభ ♦ అగస్టా కేసులో సోనియాపై ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన ♦ సోనియాను దోషిగా ఏ ఇటలీ కోర్టు పేర్కొందో మోదీ చెప్పాలి న్యూఢిల్లీ: అగస్టా కేసులో ఇటలీ కోర్టు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని దోషిగా పేర్కొందంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల సభలో చేసిన విమర్శలపై ప్రతిపక్ష పార్టీ సోమవారం పార్లమెంటులో ఆందోళనకు దిగింది. దీంతో ఉభయసభల్లోనూ తీవ్ర గందరగోళం చెలరేగగా.. రాజ్యసభలో ఎటువంటి కార్యక్రమాలూ సాగకుండానే వాయిదా పడింది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీఆజాద్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. ‘‘అగస్టాపై పార్లమెంటులో చర్చ సందర్భంగా.. యూపీఏ నాయకత్వం డబ్బులు తీసుకున్నదని సభ్యులెవరూ చెప్పలేదు. కానీ మోదీ కేరళ, తమిళనాడు ఎన్నికల సభల్లో మాట్లాడుతూ.. ఇటలీ కోర్టు ఒకటి సోనియాగాంధీని దోషిగా చెప్పిందన్నారు. ఈ విషయాన్ని చెప్పేందుకు మోదీ ఏ సభలోనూ చర్చలో ఎందుకు జోక్యం చేసుకోలేదు’’ అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రకటనల ద్వారా సీబీఐ ప్రభావితం కాదా అని వ్యాఖ్యానించారు. డిప్యూటీ ఛైర్మన్ కురియన్ స్పందిస్తూ.. ప్రధాని చేసినట్లు చెప్తున్న వ్యాఖ్యలు సభ వెలుపల చేసినవని.. దానికి కాంగ్రెస్ సభ వెలుపలే సమాధానం ఇవ్వవచ్చంటూ ఆనంద్‌శర్మ ఇచ్చిన నోటీసును కొట్టివేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ‘నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలి.. ’ అంటూ నినాదాలు చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి నక్వీ స్పందిస్తూ.. ప్రపంచం మాట్లాడుతున్న విషయాన్ని, ఒక ఇటలీ కోర్టు చెప్పిన విషయాన్నే మోదీ చెప్పార న్నారు. గందరగోళం మధ్యే వినియోగ , ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టినా... పరిస్థితిలో మార్పు లేకపోవటంతో సభాపతి మంగళవారానికి వాయిదా వేశారు. అలాగే అగస్టాపై స్వామి సభకు సమర్పించిన ఏ పత్రాన్నీ ఆమోదించలేదని కురియన్ స్పష్టంచేశారు. ప్రధాని మోదీ, రక్షణమంత్రి పారికర్లపై కాంగ్రెస్ ఎంపీ శాంతారామ్‌నాయక్ రాజ్యసభ చైర్మన్‌కు హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. అగస్టాలో నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. ప్రధాని తన వ్యాఖ్యలతో ఏ తప్పూ చేయలేదని.. దర్యాప్తు పూర్తయ్యే వరకూ వేచివుండాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విలేకరులతో మాట్లాడుతూ సూచించారు. లోక్‌సభలో సైతం.. సమావేశం ఆరంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తటంతో వేడి రాజుకుంది. ఇటలీలో ఏ కోర్టును మోదీ ఉటంకిస్తున్నారో ప్రధానమంత్రి సభలోకి వచ్చి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలకు దిగారు. సీబీఐ, ఈడీలను ప్రధాని వ్యాఖ్యలు ప్రభావితం చేయగలవని కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జునఖర్గే పేర్కొన్నారు ప్రధానిపై హక్కుల తీర్మానం ప్రవేశపెట్టే పరిస్థితి రావచ్చునని వ్యాఖ్యానించారు. పెన్షన్ చట్టంలో మార్పులకు కేంద్రం కసరత్తు 148 ఏళ్ల క్రితం చేసిన పెన్షన్ చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. పెన్షనర్ల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చట్టంలో మార్పులు చేయనున్నారు. తద్వారా దేశంలోని 58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిపొందే అవకాశం ఉంది. కాగా, చిన్నారులకు ‘బాల సంసద్’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో తెలిపారు.