సాక్షి, హైదరాబాద్: గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు మరింత ఆలస్యమవుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు కొత్తగా గిరిజన యూనివర్సిటీని కేంద్రం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జాకారం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 837, 53/1లో 285 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ దాన్ని వర్సిటీకి కేటాయించింది. ఇందులో 120 ఎక రాల్లో అధికారులు హద్దురాళ్లు సైతం ఏర్పాటు చేశారు. జాకారం సమీపంలో ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ) భవనాన్ని వర్సిటీ కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చని గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.
ఈ మేరకు ఆరు నెలల క్రితం భవనాన్ని కేంద్ర బృందం పరిశీలించి వసతులపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. వాస్తవానికి 2018–19 విద్యా సంవత్సరంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర మానవ వనరుల శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కార్యకలాపాలు సాగించే అవకాశం ఉంటుంది. కానీ, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖలో ఉలుకూపలుకూలేదు.
ఒకవేళ అనుమతులు చకచకా వచ్చినా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఈపాటికే రావాల్సి ఉంది. ప్రకటనలు వచ్చిన తర్వాతే ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్ తదితర కార్యక్రమాలు పూర్తి చేయొచ్చు. ఇందుకు కనిష్టంగా నెలన్నర సమయం పడుతుంది. కానీ, కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో ఈ ఏడాది వర్సిటీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఈ వర్సిటీని 2019–20 విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తామని రెండ్రోజుల క్రితం గిరిజన అభివృద్ధి మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రకటించారు. దీంతో గిరిజన యూనివర్సిటీ కోసం మరో ఏడాది వేచి చూడాల్సిందే.
గిరిజన వర్సిటీ మరింత ఆలస్యం!
Published Fri, May 4 2018 1:15 AM | Last Updated on Sat, Jul 28 2018 6:24 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment