మోదీ వ్యాఖ్యలపై దుమారం | Congress protest On PM comments on Sonia | Sakshi
Sakshi News home page

మోదీ వ్యాఖ్యలపై దుమారం

Published Tue, May 10 2016 2:39 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

మోదీ వ్యాఖ్యలపై దుమారం - Sakshi

మోదీ వ్యాఖ్యలపై దుమారం

పార్లమెంటులో కాంగ్రెస్ ఆందోళన.. స్తంభించిన రాజ్యసభ
♦ అగస్టా కేసులో సోనియాపై ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన
♦ సోనియాను దోషిగా ఏ ఇటలీ కోర్టు పేర్కొందో మోదీ చెప్పాలి
 
 న్యూఢిల్లీ: అగస్టా కేసులో ఇటలీ కోర్టు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని దోషిగా పేర్కొందంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల సభలో చేసిన విమర్శలపై ప్రతిపక్ష పార్టీ సోమవారం పార్లమెంటులో ఆందోళనకు దిగింది. దీంతో ఉభయసభల్లోనూ తీవ్ర గందరగోళం చెలరేగగా.. రాజ్యసభలో ఎటువంటి కార్యక్రమాలూ సాగకుండానే వాయిదా పడింది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీఆజాద్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. ‘‘అగస్టాపై  పార్లమెంటులో చర్చ సందర్భంగా.. యూపీఏ నాయకత్వం డబ్బులు తీసుకున్నదని సభ్యులెవరూ చెప్పలేదు.

కానీ మోదీ కేరళ, తమిళనాడు ఎన్నికల సభల్లో మాట్లాడుతూ.. ఇటలీ కోర్టు ఒకటి సోనియాగాంధీని దోషిగా చెప్పిందన్నారు. ఈ విషయాన్ని చెప్పేందుకు మోదీ ఏ సభలోనూ చర్చలో ఎందుకు జోక్యం చేసుకోలేదు’’ అని ప్రశ్నించారు.  ఇలాంటి ప్రకటనల ద్వారా సీబీఐ ప్రభావితం కాదా అని వ్యాఖ్యానించారు. డిప్యూటీ ఛైర్మన్ కురియన్ స్పందిస్తూ.. ప్రధాని చేసినట్లు చెప్తున్న వ్యాఖ్యలు సభ వెలుపల చేసినవని.. దానికి కాంగ్రెస్ సభ వెలుపలే సమాధానం ఇవ్వవచ్చంటూ ఆనంద్‌శర్మ ఇచ్చిన నోటీసును కొట్టివేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ‘నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలి.. ’ అంటూ నినాదాలు చేశారు. 

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి నక్వీ స్పందిస్తూ..  ప్రపంచం మాట్లాడుతున్న విషయాన్ని, ఒక ఇటలీ కోర్టు చెప్పిన విషయాన్నే మోదీ చెప్పార న్నారు. గందరగోళం మధ్యే   వినియోగ , ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టినా...  పరిస్థితిలో మార్పు లేకపోవటంతో సభాపతి మంగళవారానికి వాయిదా వేశారు. అలాగే అగస్టాపై స్వామి సభకు సమర్పించిన ఏ పత్రాన్నీ ఆమోదించలేదని కురియన్ స్పష్టంచేశారు. ప్రధాని మోదీ, రక్షణమంత్రి పారికర్‌లపై కాంగ్రెస్ ఎంపీ శాంతారామ్‌నాయక్  రాజ్యసభ చైర్మన్‌కు హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. అగస్టాలో నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. ప్రధాని తన వ్యాఖ్యలతో ఏ తప్పూ చేయలేదని.. దర్యాప్తు పూర్తయ్యే వరకూ వేచివుండాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విలేకరులతో మాట్లాడుతూ సూచించారు.

 లోక్‌సభలో సైతం.. సమావేశం ఆరంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తటంతో వేడి రాజుకుంది.  ఇటలీలో ఏ కోర్టును మోదీ ఉటంకిస్తున్నారో ప్రధానమంత్రి సభలోకి వచ్చి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలకు దిగారు. సీబీఐ, ఈడీలను ప్రధాని వ్యాఖ్యలు ప్రభావితం చేయగలవని కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జునఖర్గే పేర్కొన్నారు ప్రధానిపై హక్కుల తీర్మానం ప్రవేశపెట్టే పరిస్థితి రావచ్చునని వ్యాఖ్యానించారు.
 
 పెన్షన్ చట్టంలో మార్పులకు కేంద్రం కసరత్తు

 148 ఏళ్ల క్రితం చేసిన పెన్షన్ చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. పెన్షనర్ల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చట్టంలో మార్పులు చేయనున్నారు. తద్వారా దేశంలోని 58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిపొందే అవకాశం ఉంది. కాగా, చిన్నారులకు ‘బాల సంసద్’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement