ఉత్తమ విద్యాసంస్థగా ఏయూ  | AU as the best Educational Institution | Sakshi
Sakshi News home page

ఉత్తమ విద్యాసంస్థగా ఏయూ 

Published Wed, Apr 4 2018 3:46 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

AU as the best Educational Institution - Sakshi

సాక్షి సెంట్రల్‌ డెస్క్, విజయవాడ :   దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల శాఖ మంగళవారం ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 9 విభాగాల్లో(ఓవరాల్, ఇంజనీరింగ్, వర్సిటీ, మేనేజ్‌మెంట్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, మెడికల్, లా, ఆర్కిటెక్చర్‌) ఈ ర్యాంకులను వెల్లడించింది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ఇండియా ర్యాంకింగ్స్‌ 2018 పేరుతో వీటిని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 3,954 విద్యా సంస్థలను పరిశీలించిన అనంతరం ర్యాంకులను ప్రకటించింది. ఈ ఏడాది ఓవరాల్‌ కేటగిరీలో రాష్ట్రానికి చెందిన నాలుగు విద్యాసంస్థలకు టాప్‌ – 100లో చోటు లభించింది. దేశంలోని టాప్‌ ఉన్నత విద్యాసంస్థల్లో (ఓవరాల్‌గా) విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం 36వ ర్యాంక్‌ సాధించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 74 వ స్థానంలో నిలిచింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) 83వ స్థానంలో నిలువగా శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె 89వ స్థానంలో నిలిచింది. వివిధ విభాగాలకు సంబంధించి టాప్‌ 100లో చోటు సాధించిన రాష్ట్రానికి చెందిన విద్యాసంస్థల వివరాలు ఇలా ఉన్నాయి 

తెలంగాణలో.. 
తెలంగాణకు సంబంధించి గతేడాది ఓవరాల్‌ కేటగిరీలో ఐదు విద్యా సంస్థలు టాప్‌–100లో ఉంటే.. ఈసారి నాలుగు విద్యా సంస్థలే ఆ అర్హత సాధించాయి. దేశంలో టాప్‌ ఉన్నత విద్యా సంస్థల్లో(ఓవరాల్‌గా) హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) 11వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 14వ స్థానంతో సరిపెట్టుకున్న సెంట్రల్‌ వర్సిటీ ఈసారి తన స్థానాన్ని మెరుగు పరుచుకుంది. ఇక హైదరాబాద్‌ ఐఐటీ, వరంగల్‌ ఎన్‌ఐటీలు తమ ప్రమాణాలను మెరుగుపరచుకుని గతేడాది కంటే మెరుగైన స్థానాలను దక్కించుకున్నాయి. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకు గతేడాది కంటే ఈసారి మరింతగా పడిపోయింది. గతేడాది 38వ ర్యాంకు తెచ్చుకున్న ఉస్మానియా ఈసారి 45వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. 

ఐదు అంశాల ప్రాతిపదికగా ర్యాంకులు.. 
ప్రధానంగా ఐదు అంశాల ప్రాతిపదికగా కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో టీచింగ్, లెర్నింగ్‌ రిసోర్సెస్, రీసెర్చ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్‌ అవుట్‌ కమ్స్, ఔట్‌రీచ్‌ అండ్‌ ఇన్‌క్లూజివిటీ, పర్సెప్షన్‌ ఆధారంగా 100 పాయింట్లకు లెక్కించి వచ్చిన పాయింట్ల ద్వారా ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా విద్యా సంస్థల్లో పీహెచ్‌డీ విద్యార్థులు, శాశ్వత అధ్యాపకులు, అధ్యాపక–విద్యార్థి నిష్పత్తి, సీనియర్‌ అధ్యాపకులు, బడ్జెట్‌.. దాని వినియోగం, పబ్లికేషన్స్, ప్రాజెక్టులు, ప్రొఫెషనల్‌ ప్రాక్టీసెస్, పరీక్షల ఫలితాలు, ప్లేస్‌మెంట్స్, హయ్యర్‌ స్టడీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టాప్‌ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల శాతం, మహిళా విద్యార్థులు, పోటీతత్వం, పరిశోధనలు, వాటి ఫలితాలు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. 

అత్యుత్తమ విద్యాసంస్థ ఐఐఎస్‌సీ 
దేశంంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) నిలిచింది.  గతేడాది మాదిరిగానే ఇప్పుడు కూడా ఓవరాల్‌తోపాటు విశ్వవిద్యాలయాల విభాగంలోనూ ఐఐఎస్‌సీ తొలిస్థానం సాధించింది. అత్యుత్తమ ఇంజినీరింగ్‌ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్, అత్యుత్తమ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థగా ఐఐఎం–అహ్మదాబాద్, అత్యుత్తమ వైద్య విద్యాసంస్థగా ఢిల్లీలోని ఎయిమ్స్‌ నిలిచాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 301 విశ్వవిద్యాలయాలు, 906 ఇంజినీరింగ్, 487 మేనేజ్‌మెంట్, 286 ఫార్మసీ, 101 వైద్య, 71 లా, 59 అర్కిటెక్చర్‌ విద్యాసంస్థలతోపాటు 1087 సాధారణ డిగ్రీ కళాశాలలను అనేక అంశాలవారీగా పరిశీలించిన అనంతరం ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ఈ ర్యాంకులు ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలూ ర్యాంకుల కేటాయింపు కోసం ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు దరఖాస్తులు పంపించాల్సిందేననీ, లేకుంటే వాటికి నిధులను నిలిపేస్తామని కేంద్ర మానవవనరులశాఖ మంత్రి జవదేకర్‌ చెప్పారు. 

యూనివర్సిటీల విభాగంలో  
- ఆంధ్ర విశ్వవిద్యాలయం (విశాఖపట్నం –  22 
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) –  49 
కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) – 56 
శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (తిరుపతి)– 62 
గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (గీతం)– విశాఖ– 85 
శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ (అనంతపురం)– 92  
ఇంజినీరింగ్‌ విభాగంలో... 
కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ యూనివర్సిటీ (వడ్డేశ్వరం)– 49 
ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ (విశాఖపట్నం) – 65 
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) – 71 
సాగి రామక్రిష్ణంరాజు ఇంజినీరింగ్‌ కాలేజ్‌  (భీమవరం) – 85 
యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌  (కాకినాడ) – 97 
కళాశాల విభాగంలో.. 
సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజ్‌ (కర్నూలు) – 35 
ఆంధ్రా లయోలా కాలేజ్‌ (విజయవాడ)– 56 
మేనేజ్‌మెంట్‌ విభాగంలో.. 
ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ (సత్యవేడు)– 34 
కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) – 46 
ఫార్మసీ విభాగంలో.. 
ఏయూ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మస్యూటికల్‌ సైన్సెస్‌ (ఆంధ్రాయూనివర్సిటీ) – 28 
రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (అనంతపురం) – 39 
లా విభాగంలో..: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా (విశాఖపట్నం) – 10 

ఎస్‌ఆర్‌కేఆర్‌కు జాతీయస్థాయి ర్యాంకింగ్‌
భీమవరం: జాతీయస్థాయి విద్యాసంస్థల ర్యాంకింగ్‌లో పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు 85వ ర్యాంకు వచ్చిందని ప్రిన్సిపాల్‌ జి.పార్థసారథి వర్మ తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడిం చారు. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ న్యూఢిల్లీలో ఈ ర్యాంకులకు ప్రకటించారని చెప్పారు. దేశవ్యాప్తంగా 4,500 యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలతో సహా పలు సంస్థలకు జాతీయ ర్యాంక్‌లు వచ్చాయని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement