
న్యూఢిల్లీ: నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఈడీ, బీఎస్సీ ఈడీ కోర్సుల నిర్వహణ కోసం జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఎన్‌ఐటీఈ)ను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర మానవ వనరుల శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సూచించింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు కోసం సమగ్ర ముసాయిదా రూపొందించాల్సిందిగా మంత్రిత్వ శాఖ గత ఏడాది నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
అన్ని అంశాలను అధ్యయనం చేసిన ఈ కమిటీ.. ప్రీప్రైమరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ స్కూళ్ల టీచర్లకు అవసరమైన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏఈడీ, బీఎస్సీఈడీ కోర్సుల నిర్వహణ కోసం ప్రత్యేక సంస్థ అవసరమని పేర్కొంది. ‘కొత్తగా ఏర్పాటయ్యే ఎన్‌ఐటీ ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయటం కాకుండా.. ప్రస్తుత ఉపాధ్యాయులు, విద్యావేత్తల వృత్తిపరమైన అవసరాలను తీర్చుతుంది. విధాన పరమైన మార్గదర్శకాలను రూపొందిస్తుంది.’అని కమిటీ తన ముసాయిదాలో పేర్కొంది.