బెంగళూరులోని ఐఐఎస్సీ భవనం
న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ (ఐవోఈ)’ హోదా కల్పించింది. ఇందులో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా తీర్చిదిద్దేందుకు వీటికి స్వయం ప్రతిపత్తి కల్పించడంతోపాటు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) బెంగళూరుతోపాటు ప్రైవేటు సంస్థలైన మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన జియో ఇన్‌స్టిట్యూట్‌ను కేంద్రం ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తించింది.
ఐవోఈ హోదా పొందిన ఈ మూడు ప్రభుత్వ సంస్థలకు వచ్చే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల నిధులను కేంద్రం అందజేయనుంది. ప్రైవేటు సంస్థలకు మాత్రం ప్రభుత్వ నిధులు అందవు. మొత్తంగా 20 సంస్థలకు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థలు కలిపి) ఐవోఈ హోదా ఇవ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి నేతృత్వంలోని ఎంపవర్డ్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఈఈసీ).. తొలి దశలో 6 సంస్థలకు ఐవోఈ ప్రకటించింది.
టాప్ 100లో ఒక్క వర్సిటీ లేదు
‘ఐవోఈ దేశానికి ఎంతో ముఖ్యం. దేశంలో మొత్తం 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 వర్సిటీల్లో ఒక్కటి కూడా చోటు దక్కించుకోలేదు. కనీసం టాప్ 200లో నిలవలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉపకరిస్తుంది’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఐఓఈ హోదా కోసం తెలంగాణకు చెందిన ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు 114 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 11 సెంట్రల్ యూనివర్సిటీలు, 27 టాప్ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, రాష్ట్రాలకు చెందిన 27 వర్సిటీలు, పది ప్రైవేటు వర్సిటీలు, నాలుగు గ్రీన్‌ఫీల్డ్ సంస్థలు ఉన్నాయి.
ఇంకా స్థాపించని సంస్థకు ఐఈవోనా?
రిలయన్స్ సంస్థకు చెందిన జియో ఇన్‌స్టిట్యూట్‌ను ఇంకా స్థాపించనేలేదనీ, ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను కాదని జియో ఇన్‌స్టిట్యూట్‌కు ఐఈవో హోదా ఎలా ఇచ్చా రని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు జియో ఇన్‌స్టిట్యూట్ అనే విద్యా సంస్థ ఒకటి రాబోతోందని ప్రపంచానికి తెలిసిందే సోమవారమని అంటున్నారు. ‘జియో ఇన్‌స్టిట్యూట్‌కు క్యాంపస్ లేదు. వెబ్‌సైట్ లేదు. కానీ ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్ లేదా ప్రైవేట్ రంగంలోని అశోక వర్సిటీ, ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ వంటి ప్రఖ్యాత సంస్థలనెన్నింటినో కాదని ఐఈవో హోదా జియోకు ఎలా దక్కింది?’ అని పలువురు విద్యావేత్తలు సహా అనేక మంది ట్వీటర్‌లో హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను ప్రశ్నించారు. అయితే జియోకు ఐఈవో హోదా ఇవ్వడాన్ని యూజీసీ సమర్థించుకుంది. గ్రీన్‌ఫీల్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ కేటగిరీలో జియోకు ఆ హోదా ఇచ్చామనీ, ఈ కేటగిరీ కింద మొత్తం 11 సంస్థలు దరఖాస్తు చేసుకోగా జియోను అవకాశం వరించిందని యూజీసీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment