సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐఎస్‌సీ బెంగళూర్‌లకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ (ఐఓఈ) హోదా కల్పించింది. వీటితో పాటు ప్రైవేట్ రంగంలోని మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, జియో ఇనిస్టిట్యూట్‌లకు కూడా ఎమినెన్స్ హోదాను వర్తింపచేసింది. ఐఓఈ హోదా కోసం జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ సహా యూజీసీకి 100కు పైగా దరఖాస్తులు అందాయి. ఆయా సంస్థలకు ఐఓఈ హోదా కల్పించినట్టు కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేశారు.
ఈ హోదా లభించడంతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు పూర్తి స్వయం ప్రతిపత్తి లభించినట్టు అవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సంస్థలకు ఉన్నత విద్యా సంస్థలుగా లభించే నిధులతో పాటు ఐదేళ్లలో రూ 1000 కోట్లు అదనపు నిధులు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు.
ఐఓఈ హోదా దక్కిన సంస్థలు ఇతర ఉన్నత విద్యా సంస్థలతో పోలిస్తే పూర్తి స్వతంత్రంగా వ్యవహరించే వెసులుబాటు ఉంటుంది. దేశీయ, విదేశీ విద్యార్ధులకు ఫీజుల నిర్ణయంతో పాటు కోర్సు వ్యవధి, రూపకల్పన, విదేశీ విద్యాసంస్ధలతో ఒప్పందాల వంటి అంశాల్లో ప్రభుత్వ, యూజీసీ అనుమతులు లేకుండానే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment