పార్టీని బలోపేతం చేస్తాం
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చెప్పారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ విభిన్న వ్యూహాలతో ముందుకు వెళ్తామన్నారు. గతంలో ఒక రాష్ట్రంగా ఉన్న దృష్ట్యా ఒకే విధానాన్ని అమలు చేశామని, ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా చూస్తున్నామని, రెండు భిన్న వ్యూహాలతో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామ్‌మాధవ్ ఆదివారం ‘సాక్షి టీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని పరిమిత అవకాశాలను విస్తృతంగా మార్చుకోవడమే రాజకీయ సామర్థ్యమని చెప్పారు. తెలంగాణలో బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడులో సంస్థాగతంగా బలోపేతం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజామద్దతు లభిస్తుందన్నారు.