judgment tribunal
-
సుప్రీం గడప తొక్కాల్సిందే!
• ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేయనున్న తెలంగాణ • ఇప్పటికే విచారణలో స్పెషల్ లీవ్ పిటిషన్ • తీర్పుపై విద్యాసాగర్‌రావుతో మాట్లాడిన సీఎం సాక్షి, హైదరాబాద్: బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ర్ట ప్రయోజనాలకు గొడ్డలిపెట్టులా ఉండడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తీర్పు అమల్లోకి రాకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరాలని భావిస్తోంది. కృష్ణా జల వివాదాలపై ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తుది గెజిట్‌లో ప్రచురించరాదని, ఈ కేసులో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇదివరకే స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్... తన తీర్పును ఆ చట్టంలోని 5(2) అధికరణ కింద వెలువరిస్తుంది. దీనిపై ఆయా రాష్ట్రాలు మూడు నెలల్లోగా వివరణలు, స్పష్టతలు కోరవచ్చు. వీటిపై విచారణ జరిపి తదుపరి నివేదికను 5(3) అధికరణ కింద ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అనంతరం కేంద్రం 6(1) అధికరణ ప్రకారం గెజిట్ ప్రచురిస్తుంది. ఈ గెజిట్ సుప్రీంకోర్టులోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పుతో సమానం అవుతుంది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ 5(2) కింద ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదని కేంద్రాన్ని ఆదేశించింది. ఇదే విషయమై కర్ణాటక సైతం సుప్రీంను ఆశ్రయించగా మరో రాష్ట్రం మహారాష్ట్ర మాత్రం బ్రిజేశ్ తీర్పు, తుది తీర్పును గెజిట్‌లో ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ వేసింది. ఈ కేసులో కొత్తగా ఏర్పడిన తమను చేర్చాలని కోరుతూ తెలంగాణ వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌కు సుప్రీం అంగీకరించి స్పెషల్ లీవ్ పిటిషన్‌కు అనుమతినిచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణ ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్‌లో ఉంది. ఈ విచారణ పూర్తయ్యేంత వరకు బ్రిజేశ్ తీర్పును గెజిట్ చేయడానికి వీల్లేదు. అయితే ప్రస్తుతం బ్రిజేశ్ ట్రిబ్యునల్.. నీటి కేటాయింపులను రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయడంతో అదే అదనుగా కర్ణాటక, మహారాష్ట్రలు తమకు కేటాయించిన మేరకు గెజిట్ ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లడమే సరైందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. తీర్పుపై నేడు సమీక్ష: ట్రిబ్యునల్ తీర్పు, దాని ఫలితాలపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్షించే అవకాశం ఉంది. తీర్పు వెలువడిన వెంటనే ఆయన ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావులతో మాట్లాడారు. సుప్రీంను ఆశ్రయించే అంశంపై గురువారం నిర్ణయం తీసుకోనున్నారు. -
ట్రిబ్యునల్ తీర్పు తరువాతే ‘వంశధార’ పనులు
నేరడి బ్యారేజ్ (భామిని):ట్రిబ్యునల్ తీర్పు తరువాతే ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన వంశధార ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం కావచ్చునని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్ సీహెచ్ శివరాంప్రసాద్, వంశధార సూపరింటెండెంట్ ఇంజినీర్ బి.రాంబాబులన్నారు. భామిని సమీపంలో నేరడి బ్యారేజ్‌ను ఇంజినీర్ల బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు నమూనాను పూణేలో త్రిసభ్య కమిటీ ఇటీవల పరిశీలించిందన్నారు. ఒడిశా ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో వరద ప్రాంతంలో రక్షణ చర్యలు, రక్షిత గోడల నిర్మాణానికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ట్రిబ్యునల్‌కు అందజేయూల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. రక్షణ గోడల నిర్మాణ ప్రతిపాదనలు మూడు వారాల్లో అందించాల్సి ఉందన్నారు. వీటిని ట్రిబ్యునల్ పరిశీలించిన తరువాత తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్తగా విధుల్లో చేరినందున వంశధార ప్రాజెక్టు నిర్మాణ స్థలంపై అవగాహన చేసుకుంటున్నట్టు వివరించారు. కాగా డిసెంబర్ ఐదో తేదీన ట్రిబ్యునల్ బృందం ప్రాజెక్టు మోడల్ సర్వే పరిశీలించిన నేపథ్యంలో చీఫ్ ఇంజినీర్ బృందం ఈ ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘సెప్టెంబర్ నాటికి ఆఫ్‌షోర్ పనులు పూర్తి’ చాపర (మెళియాపుట్టి) : వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఆఫ్‌షోర్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వంశధార సీఈ సీహెచ్ శివరాం ప్రసాద్ చెప్పారు. చాపర సమీపంలోని మహేంద్రతనయ నది వద్ద ఆఫ్‌షోర్ కెనాల్ ప్రాంతాన్ని వంశధార ఛీప్ ఇంజినీర్ సీహెచ్ శివప్రసాద్ పరిశీలించారు. కొత్తగా బాధ్యత లు చేపట్టిన ఆయన రిజర్వాయర్‌కు సంబంధించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మా ట్లాడుతూ జీవో నంబర్ 13 ద్వారా కొత్త రేట్లతో పను లు జరిగే అవకాశం ఉందన్నారు. ఆఫ్‌షోర్‌కు కేటాయించిన రూ.123 కోట్లుకు గాను 25 కోట్ల రూపాయలతో పనులు జరిగాయన్నారు. ఆఫ్‌షోర్ కెనాల్ ద్వా రా వ్యవసాయ పనులకు ఇబ్బంది కలుగుతుందని, పరిష్కారమార్గం చూపాలని గ్రామానికి చెందిన రైతు ఎం.పోలినాయుడు సీఈ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ‘వంశధార’ పనులు వేగవంతానికి చర్యలు హిరమండలం: వంశధార రిజర్వాయర్ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చీఫ్ ఇంజినీర్ సీహెచ్.శివరాం ప్రసాద్ చెప్పారు. గురువారం వంశధార రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. గార్లపాడు సమీపంలో గట్టు నిర్మాణ ప్రాంతాన్ని, రిజర్వాయర్ చిత్రపటాలను తనిఖీ చేశారు. ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంపై గుత్తేదారు ప్రతినిధులను ప్రశ్నించారు. ఏబీ డైవర్షన్ రహదారితో పాటు జలాశయం పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. సీఈ వెంట ఎస్ఈ రాంబాబు, ఈఈ సీతారాంనాయుడు ఉన్నారు. -
కావేరి రగడ
సాక్షి, చెన్నై: తమిళనాడు - కర్ణాటకల మధ్య వివాదాలకు కొదవ లేదు. ఇందులో ప్రధానమైనది కావేరి జల వివాదం. నదీ జలాల హక్కుల మేరకు తమిళనాడుకు కేటాయించాల్సిన వాటాను కర్ణాటక తుంగలో తొక్కుతోంది. మూడేళ్లుగా నీటి కోసం ఓవైపు కోర్టులో, మరో వైపు రోడ్డెక్కి గళం విప్పాల్సి వస్తున్నది. రెండేళ్ల క్రితం నెలకొన్న పరిస్థితి గత ఏడాది కూడా పునరావృతం అయ్యే అవకాశాలు కన్పించినా, చివరి క్షణంలో రుతు పవనాల కరుణతో జలాశయాలు పొంగి పొర్లాయి. చివరకు తమిళనాడు వైపుగా కావేరిలోకి నీళ్లు విడుదల చేయక తప్పలేదు. అయితే, ఈ ఏడాది రావాల్సిన వాటా ఇంత వరకు కానరాని దృష్ట్యా, మళ్లీ నీటి కోసం సమరం చేయాల్సిన పరిస్థితి రాష్ర్ట ప్రభుత్వానికి ఏర్పడి ఉంది. అదే సమయంలో ట్రిబ్యునల్ తీర్పు మేరకు కావేరి అభివృద్ధి బోర్డు, కావేరి జల పర్యవేక్షణా కమిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్న విషయం తెలిసిందే. అయితే, యూపీఏ సర్కారు దాట వేత ధోరణిలతో కాలయాపన చేసింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారం మారడంతో, మళ్లీ అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణా కమిటీ నినాదం తెరపైకి వచ్చింది. ఇది కాస్త రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ భగ్గుమనే పరిస్థితులను కల్పిస్తోంది.అప్రమత్తం: పీఎంగా మోడీ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఢిల్లీ వెళ్లి కావేరి వివాదాన్ని మోడీ దృష్టికి తెచ్చి, బోర్డు, కమిటీ ఏర్పాటుకు విన్నవించారు. అందుకు తగ్గ పనులకు కేంద్రం శ్రీకారం చుట్టినట్టుగా సంకేతాలు వెలువడంతో కర్ణాటక సర్కారు మేల్కొంది. అఖిల పక్షాన్ని వెంట బెట్టుకెళ్లి ప్రధాని మోడీని కలిసింది. బోర్డు, కమిటీకి వ్యతిరేకంగా విజ్ఞప్తులు చేశారు. అదే సమయంలో ఇంత వరకు బోర్డు, కమిటీ ఏర్పాటుకు ఎలాంటి పనులను తాము చేపట్టలేదంటూ కేంద్రం వివరణ ఇచ్చినట్టుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మేల్కొన్నారు. లేఖాస్త్రాలు : బోర్డు, కమిటీ ఏర్పాటులో జాప్యం నెలకొనడం, కర్ణాటక తీవ్రంగా వ్యతిరేకిస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను, డెల్టా అన్నదాతల కన్నీటి గోడును వివరిస్తూ, కావేరి జలాల మీద తమకు ఉన్న హక్కులు, తమకు అనుకూలంగా ట్రిబ్యునల్, సుప్రీం కోర్టులు ఇచ్చిన తీర్పులను ఆ లేఖలో వివరించారు. త్వరితగతిన బోర్డు, కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో, తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి సైతం ఇదే విషయంగా ప్రధాని మోడీకి లేఖాస్త్రం సంధించారు. త్వరితగతిన బోర్డు, కమిటీ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఈ జల వివాదం మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య శాంతి భద్రతలకు విఘాతం కల్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆచితూచి.. : బోర్డు, కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, డీఎంకే పట్టుబడుతుంటే, బీజేపీ నేతలు అచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించాలన్న ప్రకటనలిస్తున్నారు. కావేరి జలవివాదాన్ని త్వరితగతిన సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని ప్రధాని నరేంద్రమోడీని ఆ పార్టీ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పొన్ రాధాకృష్ణన్, సీనియర్ నేత ఇలగణేషన్లు వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు. -
‘కావేరి’ కష్టాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి:కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న కావేరీ వాటా జలాల వివాదం మరోసారి కష్టాలు తెచ్చిపెట్టనుంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలను అధిగమించేందుకు అదనంగా 65 టీఎంసీల నీటిని కావేరి నుంచి తెప్పించడానికి ప్రభుత్వం పాకులాడుతోంది. కావేరీ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రాష్ట్రానికి వాటా జలాలు అందడం లేదు. దీంతో రబీసాగుకు సరిపడా నీరు అందడం లేదు. కర్ణాటకలో గత ఏడాది వర్షాలు కురిసినపుడు కావేరీ పొంగి ప్రవహించడంతో వరదనీరు మాత్రమే మెట్టూరు జలాశయానికి చేరి పూర్తిగా నిండింది. రాష్ట్రం 33 శాతం వర్షపాత లోటు నేపథ్యంలో వేలాది ఎకరాలు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నాయి. సాగుకు అందజేయడం వల్ల మెట్టూరు డ్యాంలో మంగళవారం నాటికి 61.370 అడుగుల నీరు తగ్గింది. నిమిషానికి 9 వేలఘనపుటడుగుల నీటిని సాగుకు వదులుతుండగా, 1060 ఘనపుటడుగుల నీరు చేరుతోంది. ఆనవాయితీ ప్రకారం ఈనెల 28 వ తేదీ వరకు సాగునీటిని విడుదల చేయాలి. ఇదే దామాషా ప్రకారం నీటిని విడుదల చేస్తే 28వ తేదీకి 15 టీఎంసీల నీరుమాత్రమే మిగులుతుంది. మెట్టూరు డ్యాంపై ఆధారపడి ఉన్న 12 డెల్టా జిల్లాలకుఈ నీటిని జూలై వరకు తాగునీటి అవసరాలకు వినియోగించాలి. 15 టీఎంసీల నీరు తమ అవసరాలకు సరిపోదు కాబట్టి కావేరి నుంచి అదనంగా 65 టీఎంసీలు ఏడాది పొడవునా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈనెల 15వ తేదీన కావేరీ వివాదంపై విచారణ జరుగుతున్నందున అదే సమయంలో ఆదేశించాలని ప్రభుత్వం కోరుతోంది. అసలే కొరకరాని కొయ్యగా మారిన కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వ దాహార్తిని తీరుస్తుందానేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కొత్త చైర్మన్ వివాదాలమయమైన కావేరీ సమస్యపై అవగాహన పెంచుకున్న ట్రిబ్యునల్ చైర్మన్ ఎన్బీ సింగ్ 2012లో రాజీనామా చేశారు. ఏడాదిన్నరగా చైర్మన్ లేకుండానే కాలం గడిచిపోతోంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న పీఎస్ చౌహాన్ జూలైలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ట్రిబ్యునల్ చైర్మన్‌గా చౌహాన్‌ను నియమించేందుకు సిద్ధమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సదాశివం ప్రధాని ఆమోదానికి పంపారు. కొత్త చైర్మన్‌పై తమిళనాడు ప్రభుత్వం నీటి ఆశలు పెట్టుకుంది.