కావేరి రగడ
సాక్షి, చెన్నై: తమిళనాడు - కర్ణాటకల మధ్య వివాదాలకు కొదవ లేదు. ఇందులో ప్రధానమైనది కావేరి జల వివాదం. నదీ జలాల హక్కుల మేరకు తమిళనాడుకు కేటాయించాల్సిన వాటాను కర్ణాటక తుంగలో తొక్కుతోంది. మూడేళ్లుగా నీటి కోసం ఓవైపు కోర్టులో, మరో వైపు రోడ్డెక్కి గళం విప్పాల్సి వస్తున్నది. రెండేళ్ల క్రితం నెలకొన్న పరిస్థితి గత ఏడాది కూడా పునరావృతం అయ్యే అవకాశాలు కన్పించినా, చివరి క్షణంలో రుతు పవనాల కరుణతో జలాశయాలు పొంగి పొర్లాయి. చివరకు తమిళనాడు వైపుగా కావేరిలోకి నీళ్లు విడుదల చేయక తప్పలేదు. అయితే, ఈ ఏడాది రావాల్సిన వాటా ఇంత వరకు కానరాని దృష్ట్యా, మళ్లీ నీటి కోసం సమరం చేయాల్సిన పరిస్థితి రాష్ర్ట ప్రభుత్వానికి ఏర్పడి ఉంది. అదే సమయంలో ట్రిబ్యునల్ తీర్పు మేరకు కావేరి అభివృద్ధి బోర్డు, కావేరి జల పర్యవేక్షణా కమిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్న విషయం తెలిసిందే.
అయితే, యూపీఏ సర్కారు దాట వేత ధోరణిలతో కాలయాపన చేసింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారం మారడంతో, మళ్లీ అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణా కమిటీ నినాదం తెరపైకి వచ్చింది. ఇది కాస్త రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ భగ్గుమనే పరిస్థితులను కల్పిస్తోంది.అప్రమత్తం: పీఎంగా మోడీ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఢిల్లీ వెళ్లి కావేరి వివాదాన్ని మోడీ దృష్టికి తెచ్చి, బోర్డు, కమిటీ ఏర్పాటుకు విన్నవించారు. అందుకు తగ్గ పనులకు కేంద్రం శ్రీకారం చుట్టినట్టుగా సంకేతాలు వెలువడంతో కర్ణాటక సర్కారు మేల్కొంది. అఖిల పక్షాన్ని వెంట బెట్టుకెళ్లి ప్రధాని మోడీని కలిసింది. బోర్డు, కమిటీకి వ్యతిరేకంగా విజ్ఞప్తులు చేశారు. అదే సమయంలో ఇంత వరకు బోర్డు, కమిటీ ఏర్పాటుకు ఎలాంటి పనులను తాము చేపట్టలేదంటూ కేంద్రం వివరణ ఇచ్చినట్టుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మేల్కొన్నారు.
లేఖాస్త్రాలు : బోర్డు, కమిటీ ఏర్పాటులో జాప్యం నెలకొనడం, కర్ణాటక తీవ్రంగా వ్యతిరేకిస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను, డెల్టా అన్నదాతల కన్నీటి గోడును వివరిస్తూ, కావేరి జలాల మీద తమకు ఉన్న హక్కులు, తమకు అనుకూలంగా ట్రిబ్యునల్, సుప్రీం కోర్టులు ఇచ్చిన తీర్పులను ఆ లేఖలో వివరించారు. త్వరితగతిన బోర్డు, కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో, తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి సైతం ఇదే విషయంగా ప్రధాని మోడీకి లేఖాస్త్రం సంధించారు. త్వరితగతిన బోర్డు, కమిటీ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఈ జల వివాదం మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య శాంతి భద్రతలకు విఘాతం కల్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఆచితూచి.. : బోర్డు, కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, డీఎంకే పట్టుబడుతుంటే, బీజేపీ నేతలు అచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించాలన్న ప్రకటనలిస్తున్నారు. కావేరి జలవివాదాన్ని త్వరితగతిన సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని ప్రధాని నరేంద్రమోడీని ఆ పార్టీ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పొన్ రాధాకృష్ణన్, సీనియర్ నేత ఇలగణేషన్‌లు వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు.