‘కావేరి’ కష్టాలు
Published Wed, Jan 8 2014 3:16 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి:కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న కావేరీ వాటా జలాల వివాదం మరోసారి కష్టాలు తెచ్చిపెట్టనుంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలను అధిగమించేందుకు అదనంగా 65 టీఎంసీల నీటిని కావేరి నుంచి తెప్పించడానికి ప్రభుత్వం పాకులాడుతోంది. కావేరీ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రాష్ట్రానికి వాటా జలాలు అందడం లేదు. దీంతో రబీసాగుకు సరిపడా నీరు అందడం లేదు. కర్ణాటకలో గత ఏడాది వర్షాలు కురిసినపుడు కావేరీ పొంగి ప్రవహించడంతో వరదనీరు మాత్రమే మెట్టూరు జలాశయానికి చేరి పూర్తిగా నిండింది. రాష్ట్రం 33 శాతం వర్షపాత లోటు నేపథ్యంలో వేలాది ఎకరాలు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నాయి. సాగుకు అందజేయడం వల్ల మెట్టూరు డ్యాంలో మంగళవారం నాటికి 61.370 అడుగుల నీరు తగ్గింది.
నిమిషానికి 9 వేలఘనపుటడుగుల నీటిని సాగుకు వదులుతుండగా, 1060 ఘనపుటడుగుల నీరు చేరుతోంది. ఆనవాయితీ ప్రకారం ఈనెల 28 వ తేదీ వరకు సాగునీటిని విడుదల చేయాలి. ఇదే దామాషా ప్రకారం నీటిని విడుదల చేస్తే 28వ తేదీకి 15 టీఎంసీల నీరుమాత్రమే మిగులుతుంది. మెట్టూరు డ్యాంపై ఆధారపడి ఉన్న 12 డెల్టా జిల్లాలకుఈ నీటిని జూలై వరకు తాగునీటి అవసరాలకు వినియోగించాలి. 15 టీఎంసీల నీరు తమ అవసరాలకు సరిపోదు కాబట్టి కావేరి నుంచి అదనంగా 65 టీఎంసీలు ఏడాది పొడవునా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈనెల 15వ తేదీన కావేరీ వివాదంపై విచారణ జరుగుతున్నందున అదే సమయంలో ఆదేశించాలని ప్రభుత్వం కోరుతోంది. అసలే కొరకరాని కొయ్యగా మారిన కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వ దాహార్తిని తీరుస్తుందానేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కొత్త చైర్మన్
వివాదాలమయమైన కావేరీ సమస్యపై అవగాహన పెంచుకున్న ట్రిబ్యునల్ చైర్మన్ ఎన్‌బీ సింగ్ 2012లో రాజీనామా చేశారు. ఏడాదిన్నరగా చైర్మన్ లేకుండానే కాలం గడిచిపోతోంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న పీఎస్ చౌహాన్ జూలైలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ట్రిబ్యునల్ చైర్మన్‌గా చౌహాన్‌ను నియమించేందుకు సిద్ధమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సదాశివం ప్రధాని ఆమోదానికి పంపారు. కొత్త చైర్మన్‌పై తమిళనాడు ప్రభుత్వం నీటి ఆశలు పెట్టుకుంది.
Advertisement
Advertisement