
సాక్షి, చెన్నై: కావేరీ నదీ జలాల కేటాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తమిళనాడుకు అన్యాయం జరిగిందని నటుడు కమల్ హాసన్ అన్నారు. రాష్ట్ర వాటాలో 15 టీఎంసీలు కోత పెట్టడం వల్ల తమిళ రైతులకు నష్టం జరుగుందన్నారు. అయితే కోర్టు తీర్పుపై తాను రాజకీయాలు చేయబోనని, ఎవరు చేసినా సహించబోనని అంటూనే తమిళనాడు వాటాను కచ్చితంగా విడుదల చేయాలని కమల్ డిమాండ్ చేశారు.
దశాబద్ధాల వివాదానికి పరిష్కారం చూపుతూ కావేరీ జలాల పంపిణీపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కావేరీ జలాల్లో తమిళనాడుకు 177.25 టీఎంసీలు, కర్ణాటకకు 284.75 టీఎంసీలు కేటాయిస్తూ సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. దీని ప్రకారం ప్రకారం తమిళనాడు వాటాలో దాదాపు 15 టీఎంసీలు కోతపడింది. ఆ నీటిని ఏకమొత్తంగా కర్ణాటకకు కేటాయించారు. కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7 టీఎంసీల వాటాలో ఎలాంటి మార్పు లేదు.