నేరడి బ్యారేజ్ (భామిని):ట్రిబ్యునల్ తీర్పు తరువాతే ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన వంశధార ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం కావచ్చునని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్ సీహెచ్ శివరాంప్రసాద్, వంశధార సూపరింటెండెంట్ ఇంజినీర్ బి.రాంబాబులన్నారు. భామిని సమీపంలో నేరడి బ్యారేజ్‌ను ఇంజినీర్ల బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు నమూనాను పూణేలో త్రిసభ్య కమిటీ ఇటీవల పరిశీలించిందన్నారు. ఒడిశా ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో వరద ప్రాంతంలో రక్షణ చర్యలు, రక్షిత గోడల నిర్మాణానికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ట్రిబ్యునల్‌కు అందజేయూల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. రక్షణ గోడల నిర్మాణ ప్రతిపాదనలు మూడు వారాల్లో అందించాల్సి ఉందన్నారు. వీటిని ట్రిబ్యునల్ పరిశీలించిన తరువాత తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్తగా విధుల్లో చేరినందున వంశధార ప్రాజెక్టు నిర్మాణ స్థలంపై అవగాహన చేసుకుంటున్నట్టు వివరించారు. కాగా డిసెంబర్ ఐదో తేదీన ట్రిబ్యునల్ బృందం ప్రాజెక్టు మోడల్ సర్వే పరిశీలించిన నేపథ్యంలో చీఫ్ ఇంజినీర్ బృందం ఈ ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
‘సెప్టెంబర్ నాటికి ఆఫ్‌షోర్ పనులు పూర్తి’
చాపర (మెళియాపుట్టి) : వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఆఫ్‌షోర్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వంశధార సీఈ సీహెచ్ శివరాం ప్రసాద్ చెప్పారు. చాపర సమీపంలోని మహేంద్రతనయ నది వద్ద ఆఫ్‌షోర్ కెనాల్ ప్రాంతాన్ని వంశధార ఛీప్ ఇంజినీర్ సీహెచ్ శివప్రసాద్ పరిశీలించారు. కొత్తగా బాధ్యత లు చేపట్టిన ఆయన రిజర్వాయర్‌కు సంబంధించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మా ట్లాడుతూ జీవో నంబర్ 13 ద్వారా కొత్త రేట్లతో పను లు జరిగే అవకాశం ఉందన్నారు. ఆఫ్‌షోర్‌కు కేటాయించిన రూ.123 కోట్లుకు గాను 25 కోట్ల రూపాయలతో పనులు జరిగాయన్నారు. ఆఫ్‌షోర్ కెనాల్ ద్వా రా వ్యవసాయ పనులకు ఇబ్బంది కలుగుతుందని, పరిష్కారమార్గం చూపాలని గ్రామానికి చెందిన రైతు ఎం.పోలినాయుడు సీఈ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
‘వంశధార’ పనులు వేగవంతానికి చర్యలు
హిరమండలం: వంశధార రిజర్వాయర్ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చీఫ్ ఇంజినీర్ సీహెచ్.శివరాం ప్రసాద్ చెప్పారు. గురువారం వంశధార రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. గార్లపాడు సమీపంలో గట్టు నిర్మాణ ప్రాంతాన్ని, రిజర్వాయర్ చిత్రపటాలను తనిఖీ చేశారు. ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంపై గుత్తేదారు ప్రతినిధులను ప్రశ్నించారు. ఏబీ డైవర్షన్ రహదారితో పాటు జలాశయం పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. సీఈ వెంట ఎస్‌ఈ రాంబాబు, ఈఈ సీతారాంనాయుడు ఉన్నారు.
ట్రిబ్యునల్ తీర్పు తరువాతే ‘వంశధార’ పనులు
Published Fri, Dec 12 2014 2:26 AM | Last Updated on Sat, Jun 2 2018 3:14 PM
Advertisement
Advertisement