
సాక్షి, అమరావతి: ముగ్గురిదీ ఒకే మాట...! ఒకే తీర్పు..! ప్రాంతాలు వేరైనా ఫలితాలు, అందరి అభిమతం ఒక్కటే. ప్రాంతీయ విభేదాలు రగిల్చి వైషమ్యాలను రెచ్చగొట్టే కుట్రలను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి దక్కిన అపూర్వ ఆదరణే ఇందుకు నిదర్శనం. రాష్ట్రమంతా మాదిరిగానే రాజధాని ప్రాంతాలు మూడింటా ఘన విజయాన్ని అందించి ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనను, అభివృద్ధి నిర్ణయాలను ప్రజలు స్వాగతించారు. గుంటూరు – విజయవాడ కావచ్చు. విశాఖ కావచ్చు.. కర్నూలు కావచ్చు... మూడు రాజధానులుగా ప్రకటించిన పెద్ద కార్పొరేషన్లలో భారీ విజయాన్ని చేకూర్చారు. చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టి రెచ్చగొట్టేలా ప్రచారం నిర్వహించినా ఆయన మాటలను ప్రజలు నమ్మలేదు. పాలన వికేంద్రీకరణకు జై కొట్టారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఓటు..
పాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని సమానంగా విస్తరించాలనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన విస్పష్టమైన తీర్పు దీన్ని తేటతెల్లం చేసింది. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ సాధించిన అద్భుత విజయం వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న స్వార్థ రాజకీయ పక్షాలకు చెంపపెట్టని రుజువైంది. పట్టణ ప్రాంత ప్రజలు వికేంద్రీకరణకు వ్యతిరేకమనే వాదన తప్పని ఈ ఫలితాలు తేల్చేశాయి. విద్యావంతులు అధికంగా ఉండే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మూడు రాజధానుల నిర్ణయాన్ని అంగీకరించడం లేదనే ప్రచారం అంతా భ్రమేనని స్పష్టమైంది. విజయనగరం మొదలు శ్రీకాకుళం, విశాఖ.. అమరావతి, కర్నూలు, తిరుపతి.. ప్రతి చోటా వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టిన ప్రజలు వికేంద్రీకరణకే తాము మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా కృత్రిమ ఉద్యమం
రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులను ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అమరావతి పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి వికేంద్రీకరణ ప్రయత్నాలను అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డారు. రాజధాని నిర్మాణం ముసుగులో చేసిన అరాచకాలను కప్పిపుచ్చుతూ కొందరు స్వార్థపరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఉసిగొల్పి ప్రభుత్వంపై దు్రష్పచారమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 29 గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు, బయట ప్రాంతాల నుంచి తరలించిన వారితో దీక్షలు, ఉద్యమాలు చేయించి హంగామా సృష్టించారు. ఎల్లో మీడియా దీన్ని భూతద్దంలో చూపించి కొందరి అభిప్రాయాన్నే రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. నాలుగు గ్రామాల్లో జరిగే కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా ప్రచారం చేస్తూ మూడు రాజధానులను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని నమ్మించేందుకు సకల ప్రయత్నాలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించి రిఫరెండం కోరాలని చంద్రబాబు, ఆయన్ను వెన్నంటి ఉండే జనసేన, సీపీఐ పార్టీలు అధికార పక్షాన్ని సవాల్ చేయని రోజే లేదు.
బాబు రెచ్చగొట్టినా విజ్ఞతతో ప్రజా తీర్పు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తన స్థాయిని మరచిపోయి అమరావతి పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. గుంటూరు వాసులకు రోషం లేదని, సిగ్గుంటే వైఎస్సార్‌సీపీకి ఓటేయరని తిట్టిపోశారు. గుంటూరు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ గెలిస్తే అక్కడి ప్రజలు అమరావతి వద్దని చెప్పినట్లేనని వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌కు ముందురోజు అమరావతి ఉద్యమం పేరుతో కొందరు మహిళలను విజయవాడకు పంపి అలజడి సృష్టించాలని చూశారు. వారిని పోలీసులు అడ్డుకునేలా చేసి సానుభూతి పొందాలని ప్రయత్నించారు. ఇవన్నీ మున్సిపల్ ఎన్నికల్లో వికటించాయి. ఎక్కడైతే చంద్రబాబు తిట్టారో అక్కడ ప్రజలు టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో టీడీపీ ఘోరంగా ఓటమిపాలైంది. ఈ రెండు కార్పొరేషన్లలో అధికార పార్టీ గెలిస్తే రాజధాని తరలిపోతుందని టీడీపీ నాయకులు రెచ్చగొట్టినా ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి వైఎస్సార్‌సీపీకి పట్టంగట్టారు.
కృష్ణా, గుంటూరులో మట్టికరిచిన టీడీపీ
అమరావతి ప్రభావం ఉంటుందని టీడీపీ చెప్పుకునే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ మట్టికరిచింది. రెండు జిల్లాల్లో ఎన్నికలు జరిగిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎక్కడా ఆ పార్టీ గెలవకపోగా అవమానకరమైన రీతిలో సింగిల్ డిజిట్ వార్డులు, డివిజన్లకే పరిమితమైంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో ప్రజలు టీడీపీని తిరస్కరించారు. న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలులో వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు. ప్రాంతాలకు అతీతంగా అన్ని చోట్లా వైఎస్సార్‌సీపీని గెలిపించడం ద్వారా అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది ఫేక్ ప్రచారమని తేల్చేశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ అమరావతి ప్రాంతం ఉన్న తాడికొండ సహా అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీని ఆదరించడం ద్వారా వికేంద్రీకరణకు ప్రజలు మద్దతు పలికారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ వికేంద్రీకరణకు ప్రజలు జై కొట్టినట్లు స్పష్టమైంది.
Comments
Please login to add a commentAdd a comment