ఉత్తరాంధ్రలో మిన్నంటిన వికేంద్రీకరణ నినాదం | Huge Support of People for decentralization in Uttarandhra | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రలో మిన్నంటిన వికేంద్రీకరణ నినాదం

Published Fri, Oct 14 2022 4:33 AM | Last Updated on Fri, Oct 14 2022 4:33 AM

Huge Support of People for decentralization in Uttarandhra - Sakshi

తాటిచెట్లపాలెం జంక్షన్‌లో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పడిన మానవహారం

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో ప్రతి ఒక్కరి నోట వికేంద్రీకరణ నినాదం మార్మోగుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ విధానానికి ఉత్తరాంధ్రలోని ప్రతి గ్రామం నుంచి మద్దతు లభిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి జిల్లా వరకు అన్ని వర్గాల వారు ఏకమై నినదిస్తున్నారు.

ఇందులో భాగంగా గురువారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మానవ హారాలు, రిలే నిరాహార దీక్షలు, భారీ ర్యాలీలు, పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని మేధావులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు, వర్తకులు, ఉద్యోగులు ఏకతాటిపై నిలిచి గర్జించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని తపన పడుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

విశాఖ పరిపాలన రాజధాని కావాలి 
► విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా బీచ్‌ రోడ్డులో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సందర్శించారు. విశాఖ పరిపాలన రాజధాని కావాలని ఆకాంక్షించారు.  

► విశాఖ ఉత్తర నియోజకవర్గం తాటిచెట్లపాలెం జంక్షన్‌లో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.  

► గాజువాక నియోజకవర్గంలోని బీసీ రోడ్డు కాకతీయ జంక్షన్‌లో ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అంతకు ముందు టీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ నుంచి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. టీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతిలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు. 66వ వార్డులో కాలనీ వాసులతో సమావేశం నిర్వహించారు.   

► భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పలు సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు తెలియజేశారు.  

► విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గోపాలప    ట్నం కుమారి కల్యాణమండపంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్‌ ఆధ్వర్యంలో బెహరా భాస్కరరావు విశాఖ గర్జన పోస్టర్‌ ఆవిష్కరించారు. గవర కమ్యూనిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 52వ వార్డు శాంతినగర్‌లో డిప్యూటీ మేయర్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో పలు సంఘాలతో సమావేశం నిర్వహించారు. శ్రీహరిపురం వైçష్ణవి ఫంక్షన్‌హాల్లో మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతవాసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు తెలిపారు. 59వ వార్డులో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కాలనీలో అంబేడ్కర్‌ సేవా సంఘం సభ్యులు విశాఖ గర్జనకు సంఘీభావం తెలియజేశారు.   

► పెందుర్తి నియోజకవర్గంలోని వేపగుంట జంక్షన్‌లో నాన్‌ పొలిటికల్‌ పెందుర్తి జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లాలోనూ అదే జోరు
► పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి అడ్డురోడ్డు వరకు జాతీయ రహదారిపై 25 కిలోమీటర్ల మేర బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నక్కపల్లి, ఎస్‌ రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాల నుంచి వందలాది మంది అన్ని వర్గాల వారు ఈ ర్యాలీకి తరలివచ్చారు.   జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ చిక్కాల రామారావు పాల్గొన్నారు. 

► వికేంద్రీకరణకు మద్దతుగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో గంధవరం నుంచి చోడవరం వరకు 10 కి.మీ.. రావికమతం మండలంలో కొత్తకోట నుంచి రావికమతం వరకు  బైక్‌ ర్యాలీ నిర్వహించారు. చోడవరం కొత్తూర్‌ జంక్షన్‌ వద్ద మానవహారం చేపట్టారు.  

► అనకాపల్లిలోని బెల్లం మార్కెట్‌లో వర్తకులు వికేంద్రీకరణకు మద్దతుగా సమావేశం     నిర్వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement