న్యాయ రాజధానితోనే అభివృద్ధి | Leaders of various associations and organizations on Kurnool legal capital | Sakshi
Sakshi News home page

న్యాయ రాజధానితోనే అభివృద్ధి

Published Tue, Nov 16 2021 4:52 AM | Last Updated on Tue, Nov 16 2021 4:52 AM

Leaders of various associations and organizations on Kurnool legal capital - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎంపీ సంజీవకుమార్, ఎమ్మెల్యే సుధాకర్‌ తదితరులు

కర్నూలు (అర్బన్‌): న్యాయ రాజధానిని సాధించుకుంటేనే కర్నూలు జిల్లా అభివృద్ధి చెందుతుందని, వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, సంస్థల నాయకులు స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా చారిత్రక త్యాగాలు చేస్తూ వచ్చిన కర్నూలు జిల్లా వాసులు ఇకపై త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు. సోమవారం ఉదయం స్థానిక మెగాసిరి ఫంక్షన్‌ హాల్‌లో అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘అధికార వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఏర్పాటు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.

పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే టీడీపీ నేతలు అడ్డుతగలడం దారుణమని, అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో తక్కువ ధరకు సేకరించిన భూములను ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ అక్కడి అమాయక రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ముసుగులో చేపట్టిన పాదయాత్రలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని, ఎన్నో త్యాగాలు చేసిన కర్నూలు వాసుల చిరకాల స్వప్నమైన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కలిసి రాని రాజకీయ నేతలంతా కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. 

రాయలసీమ పౌరుషం చూపిస్తాం
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ..1953 నుంచి చారిత్రక త్యాగాలు చేసిన కర్నూలు వాసులు ఇక త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తామని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ఆశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులు ప్రకటిస్తే టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. ఇక్కడి టీడీపీ నేతల్లో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ఇక నుంచి చేపట్టే ఉద్యమాల్లో కలిసి రావాలన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే  డాక్టర్‌ జె సుధాకర్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు డైరెక్షన్‌లో సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో నిజమైన రైతులు లేరని, ఆ యాత్రలో రియల్‌ ఎస్టేట్‌వ్యాపారులు, చంద్రబాబు బినామీలు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని అన్నారు. స్వార్థంతో పేద, మధ్య తరగతి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన భూములతో రూ.కోట్లు సంపాదించేందుకు టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతూ నిజమైన రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.

న్యాయ రాజధాని సాధనకు తొలి అడుగు
కర్నూలు ఎంపీ డాక్టర్‌ ఎస్‌.సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధాని సాధన కోసం తొలి అడుగు పడిందని, ఇక పాదయాత్రలు, నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు చేపట్టాల్సి ఉందని అన్నారు. జిల్లాలో 95 కిలోమీటర్ల మేర తుంగభద్ర ప్రవహిస్తున్నా తాగేందుకు కూడా నీరు లేని పరిస్థితి ఇక్కడ ఉందన్నారు. న్యాయ రాజధాని ఇక్కడ ఏర్పాటైతే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. సాధన సమితి అధ్యక్షుడు బి.క్రిష్టఫర్‌ మాట్లాడుతూ.. అమరావతి రైతుల పేరుతో చంద్రబాబు చేయిస్తున్న పాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామన్నారు. మేయర్‌ బీవై రామయ్య మాట్లాడుతూ.. కరువు కాటకాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సీమ రైతులను ఆదుకోలేని టీడీపీ నేతలు అమరావతి రైతుల నకిలీ ఉద్యమాలకు చందాలు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

న్యాయ రాజధానికి సీపీఐ కట్టుబడి ఉంది
సీపీఐ నేత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసే అంశానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో కొనసాగుతున్న పాదయాత్రలు వట్టి బూటకమని, చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో వారంతా కేవలం పాత్రధారులేనని అన్నారు. ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు సీహెచ్‌ వెంగళరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కర్నూలు నుంచి హైకోర్టు వరకు పాదయాత్రలు చేపడదామన్నారు.

ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకుపోయేందుకు ఉద్యోగులంతా వారం రోజులపాటు మాస్‌ క్యాజువల్‌ లీవ్‌ పెట్టేందుకైనా వెనుకాడమన్నారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఐ.విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయ్యేంత వరకు ఉద్యమాలను ఉధృతం చేసే ప్రక్రియలో ఎంతటి త్యాగాలు చేసేందుకైనా సిద్ధమన్నారు. సదస్సులో డిప్యూటీ మేయర్‌ రేణుక, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి, జాతీయ కిసాన్‌ సంఘ్‌ ఉపాధ్యక్షుడు వి.సిద్ధారెడ్డి, విద్యాసంస్థల అధినేతలు జి.పుల్లయ్య, కేవీ సుబ్బారెడ్డి, ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ కన్వీనర్‌ శ్రీరాములు, కో–కన్వీనర్‌ ఆర్‌.చంద్రప్ప, సీనియర్‌ న్యాయవాదులు వై.జయరాజు, నాగలక్ష్మీదేవి, విశ్రాంత తహసీల్దార్‌ రోషన్‌ ఆలీ తదితరులు మాట్లాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement