సాక్షి, తాడేపల్లి: తన కుటుంబ సభ్యులపై ఈనాడు తప్పుడు వార్తలు రాస్తోందని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రామోజీ భార్య, కోడలపై కూడా ఇలాగే తప్పుడు వార్తలు రాస్తే ఊరుకుంటారా? అంటూ ధ్వజమెత్తారు.
‘‘మా కుటుంబ సభ్యులు ఏనాడూ రాజకీయాల్లో పాల్గొనరు. నాకు పది శాతం వాటాలు ఎవరు ఇచ్చారో ఈనాడు రామోజీ నిరూపించాలి. పత్రికా స్వేచ్చ అంటే ఇష్టం వచ్చినట్లు రాయటం కాదు. రాసిన తప్పుడు వార్తలపై వివరణ అడగటానికి వెళ్తే ఆఫీసుకు తాళం వేసుకుని పారిపోయారు. మీరు రాసినది నిజమే అయితే పారిపోవాల్సిన అవసరం ఏంటి?. దమ్ముంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలి. అంతేగానీ అనవసరంగా కుటుంబ సభ్యులను టార్గెట్ చేయొద్దు’’ అని కాటసాని పేర్కొన్నారు.
‘‘మీ ఇష్టం వచ్చినట్లు రాస్తే మేము నిరసన కూడా తెలపకూడదా?. మేము తప్పులు చేస్తే ఎత్తిచూపండి. కానీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తామంటే అది కరెక్టు కాదు. 1991లో నాకు తప్పులేని విషయంలో నేను బలిపశువుని అయ్యాను. రైతులకు ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటా. నేను తప్పులు చేశానని నిరూపిస్తే నా అస్తులన్నీ రాసిస్తా. రామోజీ తప్పుడు పనులు చేసినందునే సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది. తప్పుడు పనులు రామోజీ చేస్తూ మాపై ఆరోపణలు చేయటం ఏంటి?. ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మాపై తప్పుడు వార్తలు రాయటం పత్రికా స్వేచ్ఛ కాదు’’ అంటూ కాటసాని దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబుకు ఈనాడు కరపత్రం. నాకు వెయ్యి కోట్ల ఆస్తి ఉన్నట్టు రామోజీ రాశాడు. ఆ పేపర్లు చూపిస్తే ఆ ఆస్తులన్నీ రామోజీకే రాసిస్తా. ఈనాడులో ఇష్టం వచ్చినట్లు రాసినందునే మా వాళ్లు వెళ్లారు. దాడి చేయాలని మావాళ్లు వెళ్లలేదు. కేవలం నిరసన తెలపటానికే వెళ్లారు. కనీసం ఆఫీసులోకి కూడా మా వాళ్లు వెళ్ల లేదు’’ అని కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి?
Comments
Please login to add a commentAdd a comment