Kurnool Capital
-
న్యాయ రాజధానితోనే అభివృద్ధి
కర్నూలు (అర్బన్): న్యాయ రాజధానిని సాధించుకుంటేనే కర్నూలు జిల్లా అభివృద్ధి చెందుతుందని, వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, సంస్థల నాయకులు స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా చారిత్రక త్యాగాలు చేస్తూ వచ్చిన కర్నూలు జిల్లా వాసులు ఇకపై త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు. సోమవారం ఉదయం స్థానిక మెగాసిరి ఫంక్షన్ హాల్లో అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘అధికార వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఏర్పాటు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే టీడీపీ నేతలు అడ్డుతగలడం దారుణమని, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో తక్కువ ధరకు సేకరించిన భూములను ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ అక్కడి అమాయక రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ముసుగులో చేపట్టిన పాదయాత్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని, ఎన్నో త్యాగాలు చేసిన కర్నూలు వాసుల చిరకాల స్వప్నమైన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కలిసి రాని రాజకీయ నేతలంతా కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. రాయలసీమ పౌరుషం చూపిస్తాం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ..1953 నుంచి చారిత్రక త్యాగాలు చేసిన కర్నూలు వాసులు ఇక త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తామని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ఆశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు ప్రకటిస్తే టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. ఇక్కడి టీడీపీ నేతల్లో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ఇక నుంచి చేపట్టే ఉద్యమాల్లో కలిసి రావాలన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ మాట్లాడుతూ.. చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో నిజమైన రైతులు లేరని, ఆ యాత్రలో రియల్ ఎస్టేట్వ్యాపారులు, చంద్రబాబు బినామీలు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని అన్నారు. స్వార్థంతో పేద, మధ్య తరగతి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన భూములతో రూ.కోట్లు సంపాదించేందుకు టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతూ నిజమైన రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. న్యాయ రాజధాని సాధనకు తొలి అడుగు కర్నూలు ఎంపీ డాక్టర్ ఎస్.సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధాని సాధన కోసం తొలి అడుగు పడిందని, ఇక పాదయాత్రలు, నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు చేపట్టాల్సి ఉందని అన్నారు. జిల్లాలో 95 కిలోమీటర్ల మేర తుంగభద్ర ప్రవహిస్తున్నా తాగేందుకు కూడా నీరు లేని పరిస్థితి ఇక్కడ ఉందన్నారు. న్యాయ రాజధాని ఇక్కడ ఏర్పాటైతే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. సాధన సమితి అధ్యక్షుడు బి.క్రిష్టఫర్ మాట్లాడుతూ.. అమరావతి రైతుల పేరుతో చంద్రబాబు చేయిస్తున్న పాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామన్నారు. మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. కరువు కాటకాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సీమ రైతులను ఆదుకోలేని టీడీపీ నేతలు అమరావతి రైతుల నకిలీ ఉద్యమాలకు చందాలు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. న్యాయ రాజధానికి సీపీఐ కట్టుబడి ఉంది సీపీఐ నేత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసే అంశానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో కొనసాగుతున్న పాదయాత్రలు వట్టి బూటకమని, చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో వారంతా కేవలం పాత్రధారులేనని అన్నారు. ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు సీహెచ్ వెంగళరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కర్నూలు నుంచి హైకోర్టు వరకు పాదయాత్రలు చేపడదామన్నారు. ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకుపోయేందుకు ఉద్యోగులంతా వారం రోజులపాటు మాస్ క్యాజువల్ లీవ్ పెట్టేందుకైనా వెనుకాడమన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఐ.విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయ్యేంత వరకు ఉద్యమాలను ఉధృతం చేసే ప్రక్రియలో ఎంతటి త్యాగాలు చేసేందుకైనా సిద్ధమన్నారు. సదస్సులో డిప్యూటీ మేయర్ రేణుక, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జాతీయ కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడు వి.సిద్ధారెడ్డి, విద్యాసంస్థల అధినేతలు జి.పుల్లయ్య, కేవీ సుబ్బారెడ్డి, ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ కన్వీనర్ శ్రీరాములు, కో–కన్వీనర్ ఆర్.చంద్రప్ప, సీనియర్ న్యాయవాదులు వై.జయరాజు, నాగలక్ష్మీదేవి, విశ్రాంత తహసీల్దార్ రోషన్ ఆలీ తదితరులు మాట్లాడారు. -
వేడుక.. ప్రత్యేకత
సమైక్యాంధ్రకు కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను అందంగా ముస్తాబు చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో జిల్లా స్వాతంత్య్ర సమరయోధులు ఉయ్యలవాడ నరసింహారెడ్డి, గులాం రసూల్‌ఖాన్, ముత్తుకూరి గౌడప్ప, గాడిచర్ల సర్వోత్తమరావు, సర్దార్ నాగప్ప, అమరావతమ్మ తదితరుల చిత్రపటాల ఏర్పాటు ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల సంక్షేమ విద్యార్థులు ప్రదర్శించిన ‘భారతీయం’ నృత్యం ఆహూతులను అలరించింది. వేడుకలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, పౌర సమాచారా శాఖ కమిషనర్ దానకిశోర్ అభినందించారు. భారత స్వాతంత్రోద్యమం, వీరుల గాథను ఆకట్టుకునేలా వివరించిన ప్రముఖ కథా రచయిత ఇనయతుల్లాకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. కర్నూలుకు చెందిన ఈయనకు వేడుకల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించే అరుదైన అవకాశం దక్కడం విశేషం. ఎఫ్ఎం వ్యాఖ్యాత సునంద వ్యాఖ్యానం ఆద్యంతం ఆకట్టుకుంది. - సాక్షి ప్రతినిధి, కర్నూలు -
రాజధానిగా కర్నూలు లేనట్లే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సీమ ముఖద్వారం కర్నూలు రాజధాని అయ్యే కల నెరవేరేలా కనిపించడం లేదు. ఆ మాటెత్తకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు జాగ్రత్తపడినట్లు తెలిసింది. గురువారం కర్నూలుకు వచ్చిన సీఎంను రాజధాని సాధన కమిటీ నాయకులు కలిశారు. ‘ప్రతి జిల్లా వారు రాజధాని కావాలంటున్నారు. అన్ని జిల్లాలకు ఇవ్వలేం కదా?’ అని వారికి ఆయన చెప్పి పంపినట్లు తెలిసింది. సీఎం మాటలను బట్టి చూస్తే కర్నూలు రాజధాని లేనట్లే అని తేలిపోయింది. అదే విధంగా తనను కలిసిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్లకూ ఇదే విషయాన్ని చంద్రబాబు తేల్చిచెప్పినట్లు తెలిసింది. రాజధాని ఊసెత్తవద్దని.. ఏదైనా కావాలంటే నియోజకవర్గంలోని సమస్యలపై మాట్లాడమని చెప్పినట్లు సమాచారం. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎంతో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు గురువారం సమావేశమయ్యారు. కర్నూలును రాజధానిని చేయాలని జేఏసీ నేతలు సీఎం చంద్రబాబును అడుగుతుంటే తమ్ముళ్లంతా తలదించుకునే ఉండిపోయినట్లు సమాచారం. ప్రభుత్వ అతిథగృహంలో టీడీపీ నేతలు, రాజధాని సాధన కమిటీకి ఎదురైన సంఘటనను చూస్తే కర్నూలు రాజధాని గురించి మర్చిపోవచ్చని తమ్ముళ్లు చెప్పుకుంటూ వెళ్లటం కనిపించింది. ఇదిలా ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించాలని సీఎంను కోరారు. అలాగే ఎంపీ బుట్టారేణుక, పాణ్యం ఎమ్మెల్యేల గౌరు చరిత, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కూడా నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలిసి విన్నవించారు. కర్నూలుకు రాజధాని అడిగేహక్కు ఉందని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. రాజధానిని పోగొట్టుకుని, ఇప్పుడు అవకాశం ఉండి ఇవ్వకపోతే అన్యాయం చేసిన వారవుతారని కోరినట్లు తెలిసింది. అదే విధంగా గుండ్రేవుల రిజర్వాయర్, కర్నూలులో ఉర్దూ పాఠశాల అవసరమని ఎస్వీ మోహ న్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా కర్నూలు జిల్లాలో ఐటీ, పారిశ్రామిక కారిడార్, అగ్రికల్చర్ యూనివర్సిటీకు అనుకూలంగా ఉందని, ఆమేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు కూడా స్థానిక సమస్యలపై చర్చకే అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. కోరికల చిట్టాలకు ఓకే చెప్పిన సీఎం.. కర్నూలు రాజధానిని చేయాలనే మాటెత్తకుండా అధినేత చంద్రబాబు తమ్ముళ్లను అదుపుచేసినట్లు తెలిసింది. దీంతో చేసేది లేక తమ్ముళ్లు నియోజకవర్గంలోని కోరికల చిట్టాను అధినేత చంద్రబాబు ముందుంచారు. ఆ చిట్టాలన్నింటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లు టీడీపీ నేతలు వెళ్లడించారు. ఆ వివరాలను స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రకటించనున్నట్లు వారు వివరించారు. మరి కొన్నింటికి మాత్రం ‘చూద్దాం.. చేద్దాం’ అన్న సమాధానమే ఎదురైనట్లు టీడీపీ శ్రేణులు వెళ్లడించాయి. నామినేటెడ్ పదవుల కోసం తమ్ముళ్ల క్యూ.. శ్రీశైలం, మహానంది, యాగంటి తదితర ఆలయాలతోపాటు జిల్లాలోని 12 మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం తమ్ముళ్లంతా అధినేత వద్ద క్యూ కట్టారు. నియోజకవర్గఇన్చార్జ్లు తమ వారికి ఆ పదివి.. ఈ పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే నామినేటెడ్ పదవుల విషయమై తమ్ముళ్లకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. -
రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాల్సిందే: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: రాయలసీమ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి కర్నూలును రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో బెరైడ్డి చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష సోమవారం ప్రారంభమైంది. స్థానిక జిల్లా పరిషత్ గాంధీ విగ్రహం ఎదుట జరిగిన దీక్షలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా మూడేళ్లపాటు కొనసాగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందని, దీంతో రాజధాని కర్నూలును కాదని హైదరాబాద్‌కు తరలిపోయిందన్నారు. ప్రస్తుతం సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విభజించి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇందుకు కారణమైన కాంగ్రెస్‌తోపాటు సహకరించిన టీడీపీ, బీజేపీలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వెనుకబాటుతో ఉన్న రాయలసీమ బాగు పడాలంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఈ ప్రాంత ప్రజాప్రతి నిధులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం ద్వారా ఒత్తిడి తేవాలని సూచించారు. అంతకుముందు గౌరీ గోపాల్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. అక్కడి నుంచి రాజ్‌విహార్, జిల్లా పరిషత్తు గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి మహబూబ్ సాహెబ్, సమితి నాయకులు శ్రీరాములు, రామచంద్రారెడ్డి, త్యాగరాజు, కొండయ్య, సురేంద్రారెడ్డితోపాటు సివి.రామన్, కేవిఆర్, పుల్లయ్య, రవీంద్ర కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘాలు, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం నాయకులు బెరైడ్డిని కలిసి సంఘీభావం ప్రకటించారు. -
'కర్నూలును రాజధానిగా ప్రకటించాల్సిందే'
రాష్ట్ర విభజన అయిపోయిన నేపథ్యంలో కర్నూలు నగరాన్ని అంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర మంత్రి టి. జి. వెంకటేష్ శనివారం కర్నూలులో కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలును రాజధానిగా చేయడం వల్లే తమ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని అన్నారు. లేకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపట్టవలసి ఉంటుందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు. కేవలం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు. అజెండాలో రాష్ట్ర విభజన అంశాన్ని చేర్చి ఆమోదం చేస్తే తాము గౌరవంగా తప్పుకునే వారమని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం డ్యాం నుంచి నీటిని తీసుకుని తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. తమ ప్రాంతం మాత్రం ఏడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమలో వజ్రాలు, బంగారు గనులు అపారంగా ఉన్నాయని వెంకటేష్ ఈ సందర్బంగా గుర్తు చేశారు.