టి.జి.వెంకటేష్
రాష్ట్ర విభజన అయిపోయిన నేపథ్యంలో కర్నూలు నగరాన్ని అంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర మంత్రి టి. జి. వెంకటేష్ శనివారం కర్నూలులో కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలును రాజధానిగా చేయడం వల్లే తమ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని అన్నారు. లేకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపట్టవలసి ఉంటుందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు.
కేవలం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ఆరోపించారు. అజెండాలో రాష్ట్ర విభజన అంశాన్ని చేర్చి ఆమోదం చేస్తే తాము గౌరవంగా తప్పుకునే వారమని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం డ్యాం నుంచి నీటిని తీసుకుని తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. తమ ప్రాంతం మాత్రం ఏడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమలో వజ్రాలు, బంగారు గనులు అపారంగా ఉన్నాయని వెంకటేష్ ఈ సందర్బంగా గుర్తు చేశారు.