తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వరం ఎలా మార్చివేయగలరో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. ఆయన ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో ప్రత్యేక హోదా అంశంపైనే విబేధించామని చెప్పారు. పొత్తులు ఎలా ఉంటాయో చెప్పలేనంటూనే బీజేపీకి ఆయన పంపుతున్న సంకేతాన్ని జనం అర్థం చేసుకోలేరా?. బీజేపీని, ప్రధాని మోదీని 2019 ఎన్నికలకు ముందు ఎన్ని తిట్లు తిట్టింది ప్రజలు మర్చిపోయారని ఆయన భావించవచ్చు. గతంలో.. అంటే సోషల్ మీడియా లేని రోజుల్లో ఆయన ఏమి చెప్పినా, అనతికాలంలోనే మర్చిపోతారులే అని అనుకునేవారు. అది ఆయనకు కొంత కలిసి వచ్చేది. ఎన్నిసార్లు మాట మార్చినా ఆయనకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కాని ఇప్పుడు కాలం మారింది.
చంద్రబాబు నాయుడు ఏదైనా కొత్త స్టేట్ మెంట్ ఇచ్చిన నిమిషాలు.. గంటల్లోనే ఆయన గతంలో అదే సబ్జెక్ట్కు సంబంధించి ఏమి అన్నారో తెలిపే వీడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి. అలాగే ఇప్పుడు చంద్రబాబు బీజేపీని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా కావిస్తున్న విన్యాసాలు.. సన్నాయి నొక్కులు బయటకు రాగానే, గతంలో ఇదే బీజేపీని.. ఇదే ప్రధాని మోదీని ఎంత తీవ్రంగా దూషించింది వివరించే వీడియోలు వచ్చేశాయి. దాంతో చంద్రబాబు అసలు స్వరూపం ఇదా! అనే చర్చ జరుగుతోంది.
✍️ 2017లో చంద్రబాబు ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పి, మోదీ ప్రభుత్వం నుంచి తన మంత్రులను కూడా విత్ డ్రా చేసుకున్నారు. అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్ ప్రత్యేక హోదా అంశంపై తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి ప్రజలలోకి రావడంతో చంద్రబాబు తన వైఖరి మార్చుకుని.. తాను కూడా ప్రత్యేక హోదా అనుకూలమని ప్రకటించి ఎన్టీయే నుంచి వైదొలిగారు. అంతకు ముందు అసలు ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీనే కావాలని చంద్రబాబు వాదించేవారు. ప్రత్యేక హోదా జనంలో సెంటిమెంట్ గా మారిందని భయపడడం, అదే తరుణంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని, మోదీ ప్రభుత్వం తిరిగి రాకపోవచ్చనే అభిప్రాయం ఆయనలో ఏర్పడింది. దాంతో తనవల్లే మోదీ ప్రభుత్వం పడిపోయిందని పేరు తెచ్చుకోవాలని ఆయన NDA వ్యతిరేక పక్షాల నేతలను కలిసి రాజకీయ చర్చలు జరిపి ఒక కూటమి కట్టడానికి కాస్త చొరవ తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటివారితో చర్చలు జరిపారు. తెలంగాణ ఎన్నికల సమయానికి ఏకంగా కాంగ్రెస్‌తో జట్టు కట్టి శాసనసభ ఎన్నికలలో పోటీచేశారు. కానీ.. ఫలితం దక్కలేదు. అది వేరే సంగతి.
అప్పట్లో.. కేంద్రానికి సహకరించే పార్టీలను బహిష్కరించాలన్నంతవరకు స్టేట్ మెంట్లు ఇచ్చేవారు చంద్రబాబు. అటు కేసీఆర్, ఇటు వైఎస్ జగన్‌లు మోదీకి దత్తపుత్రులని వ్యాఖ్యానించేవారు. అంతవరకు తాను మోదీతో జతలో ఉన్నప్పటికీ, దానిని కప్పిపుచ్చి ఈ పార్టీలపై ఆరోపణలు చేస్తుండేవారు. మోదీ, ఏపీకి తీరని నష్టం చేశారని.. దేశాన్ని నాశనం చేశారని.. ఇంత అవినీతిపరుడు లేడని చంద్రబాబు అనేక ఆరోపణలు చేశారు. అంతేకాక తనకు కుటుంబం ఉందని, మోదీకి కుటుంబం లేదని వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇప్పుడేమో.. మోదీ దేశం కోసం పనిచేస్తున్నారని, విదేశీవిధానం గొప్పగా ఉందని, బీజేపీతో విబేధాలు లేవని చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన గూటిలోకి దాదాపు చేర్చుకున్న చంద్రబాబు.. ఎలాగైనా బీజేపీని కూడా తన ట్రాప్‌లోకి లాగాలని చూస్తున్నారు. పవన్ ద్వారా రాయబారం చేసినా ఫలితం లేకపోవడంతో ఆయనే స్వయంగా అమిత్ షాను కలిసి వచ్చారు. అయినా ఆశించిన విధంగా జరగలేదు. దాంతో ఆయన తన ప్రయత్నాలు వదలిపెట్టకుండా.. దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా జేపీ నడ్డాతో రాయబారం జరిపారు. ఈ పరిణామం ప్రభావం ఎలా ఉంటుందన్నది అప్పుడే చెప్పలేం.
కానీ.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు చంద్రబాబు చేసిన పరాభవాన్ని బీజేపీ మర్చిపోతే తప్ప.. టీడీపీతో పొత్తుకు అవకాశం లేదనే చెప్పాలి. నిజంగానే చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంపై బీజేపీతో విడిపోయి ఉంటే, ఇప్పటికీ ఆ అంశాన్ని బీజేపీ పరిష్కరించలేదు. పైగా ప్రత్యేక హోదా ఇవ్వడానికి నో చెప్పింది. అయినా ఇప్పుడు టీడీపీ ఎందుకు స్నేహం కోసం ఆ పార్టీ వెంటబడుతోంది.
✍️ పనిలో పని దేశాన్ని నడపడానికి విధానాలు రూపొందించామని, ఇప్పుడు 2047 పేరుతో విజన్ తయారు చేశామని ఆయన అంటున్నారు. తన గురించి తాను డబ్బా కొట్టుకోవడం కూడా తెలివైన పనే అని అంటారు. ఆ విషయంలో చంద్రబాబు దిట్ట అని చెప్పాలి. ఇప్పుడు అదే ప్రకారం చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయా?లేదా?అన్నది చెప్పలేం. మరో విశేషం ఏమిటంటే చంద్రబాబు బీజేపీ ప్రాపకం కోసం పాటులాడుతుంటే.. చంద్రబాబు చొక్కా పట్టుకుని తిరగాలని సీపీఐ ఆలోచిస్తోంది. చంద్రబాబు బృందం ఆయన భజంత్రి మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి తెలంగాణలో తెలుగుదేశం పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని, ఏపీలో పొత్తుకు ఓకే అనాలని టీడీపీ భావిస్తోందని ప్రచారం చేశాయి. కానీ.. తెలంగాణ బీజేపీ నిర్దద్వందంగా టీడీపీతో తమ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా తెలంగాణలో ఒంటరిగానే పోటీచేస్తామని చెబుతున్నారు. అది ఉత్తుత్తిపోటీగానే మిగిలిపోనుందన్నది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ పొత్తు కుదురుతుందా?లేదా?అన్నది సందిగ్దంగా మారింది.
✍️ కాగా టీడీపీ, జనసేన, సీపీఐ పక్షాలు కలిసి కూటమి కట్టాలని సీపీఐ నాయకులు కోరుకుంటున్నారు. సీపీఐ నేత నారాయణ కాని మరికొందరు నేతలు కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమతో స్నేహం చేసినప్పుడు ఆయనను పోరాట యోధుడుగాను.. బీజేపీని ఎదుర్కునే ధీరుడుగాను ప్రశంసిస్తూ ప్రచారం చేశారు. కాని ఇప్పుడు జనరల్ ఎన్నికలలో కేసీఆర్ వారికి సీట్లు కేటాయించకపోవడంతో.. మోదీకి లొంగిపోయారని విమర్శిస్తున్నారు. కేసీఆర్, జగన్‌లు మోదీకి మద్దతుదారులని సీపీఐ నేత నారాయణ అంటున్నారు.
విశేషం ఏమిటంటే తనపై వచ్చిన ఆదాయపన్ను కేసులో ఇబ్బంది రాకుండా ఉండడానికి బీజేపీతో పొత్తుకు అర్రులు చాస్తూ చంద్రబాబు.. ఢిల్లీలో తంటాలు పడుతుంటే.. ఆయన్ని మాత్రం నారాయణ ఏమి అనకపోవడం విశేషం. అంటే చంద్రబాబుతో బీజేపీ పొత్తు పెట్టుకోదని.. అప్పుడు తాము కలవొచ్చని.. ఏదైనా ఒకటి,రెండు సీట్లు సంపాదించడానికి ఇదో అవకాశమని సీపీఐ నేతలు కొందరు భావిస్తున్నట్లుగా ఉంది. ఇప్పటికే ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ‘అచ్చం తెలుగుదేశం’ భాషలోనే విమర్శలు చేస్తూ పర్యటన సాగిస్తున్నారు. చివరికి సీపీఐ ఇంత దయనీయంగా మారిపోవడం చారిత్రక విషాదం అనుకోవాలా!
:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment