
మరో ఉద్యమం రాదా?
‘కేవలం రాజధాని (అమరావతి) చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర ఏం కావాలి? రాయలసీమ ఏం కావాలి? ప్రకాశం జిల్లా ఏం కావాలి? తెలంగాణ ఉద్యమం వచ్చినట్లుగా ఇంకో ఉద్యమం రాదా?’
– 2018లో గుంటూరు జిల్లాలో పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు
ఎందుకీ గర్జన..?
‘విశాఖలో ఎందుకీ గర్జన? మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయటానికా? వలసలు ఆపలేకపోయినందుకా? రుషికొండను ధ్వంసం చేసి మీకోసం భవనం నిర్మిస్తున్నందుకా? వైఫల్యాలు దాచేసి కులాల మధ్య చిచ్చు రేపినందుకా? విద్యుత్ చార్జీలు భారీగా పెంచినందుకా?’
– తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్లు
సాక్షి, అమరావతి: కేవలం అమరావతి పరిసరాల్లోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏం కావాలని గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రశ్నలు కురిపించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖ గర్జన సభపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో పవన్ జనసేన బహిరంగ సభలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లు వైరల్ అవుతున్నాయి. పవన్ మాట ఎందుకు మారుస్తున్నారంటూ పలువురు రీ ట్వీట్ చేశారు. మీపై ఏమి ప్రభావం చూపాయో చెప్పాలంటూ నిలదీస్తున్నారు.
15 నుంచి పవన్ విశాఖ పర్యటన
పవన్ కళ్యాణ్ ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది. 15, 16, 17వ తేదీల్లో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. 16న విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.