సాక్షి, అమరావతి: రాజధాని నిర్ణయం, అమరావతిలో భూముల కొనుగోళ్ల వ్యవహారం వెనుక భారీ కుట్ర ఉందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ పునరుద్ఘాటించారు. ఈ కుట్ర వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యుల పాత్రపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టుకు నివేదించారు. అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ ఇటీవల నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితులు కిలారు రాజేశ్, ఆయన భార్య శ్రీహాస తది తరులు హైకోర్టులో వేర్వేరుగా క్రిమినల్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపి తీర్పు వాయిదా వేశారు. అయితే అమరావతి భూ కొనుగోళ్ల కుంభకోణం కేసులో కొందరు ఉద్యోగులు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారని, ఆ వివరాలను కోర్టు ముందుంచుతామని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్‌పీ వాసంశెట్టి గోపాలకృష్ణ అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ రాయ్ కేసును తిరిగి ఓపెన్ చేయడంతో మంగళవారం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
ఆ జీవోలు ఆ శాఖ ఉద్యోగులు తయారు చేయలేదు
అమరావతిలో భూముల కొనుగోళ్ల కుంభకోణానికి సం బంధించి పలు కీలక విషయాలను ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఆర్‌డీఏ చట్టం తీసుకురావడం, సీఆర్‌డీఏ ఏర్పాటు చేయడం, దాని పరిధి నిర్ణయించడం, అభివృద్ధి పనుల కొనసాగింపు బాధ్యతలు సీఆర్‌డీఏకి అప్పగించడం తదితరాలపై అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఆరు జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లు ఏవీ కూడా పురపాలకశాఖలో తయారు కాలేదని తెలిపారు. ఈ జీవోలను ఆ శాఖ ఉద్యోగులు తయారు చేయలేదని పలువురు ఉద్యోగులు సంబంధిత మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాలు ఇచ్చారని వివరించారు.
దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం ఉంది
రాజధానిని ప్రకటించడానికి ముందే రాజధాని ఎక్కడ ఉందో తమకు కావాల్సిన వ్యక్తులు, కంపెనీలకు సమాచారం ఇచ్చారని, తద్వారా రాజధాని చుట్టుపక్కల వారంతా కూడా నామమాత్రపు ధరలకే భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. ఇంత తీవ్రమైన వ్యవహారంలో దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం ఉం దని ఏజీ చెప్పారు. రాజధానికి సంబంధించిన జీవోల తాలూకు నోట్‌ఫైళ్లను సీఎం హోదాలో చంద్రబాబు ఆమోదించి, వాటిపై సంతకం చేశారని వివరించారు. ఏ నిర్ణయాలపై జీవోలను జారీ చేశారో, ఆ నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో కుట్ర కోణంలో చంద్రబాబు, అప్పటి ఆయన మంత్రివర్గ సభ్యుల పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉందని వివరించారు. పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయాలని కోర్టును కోరారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్ల భూ కొనుగోళ్లన్నీ కూడా చట్ట నిబంధనలకు లోబడే జరిగాయన్నారు. పిటిషనర్ల తరఫున పలువురు ఇతర న్యాయవాదులు కూడా వాదనలు విన్పించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
ఈ అంశాలన్నీ కుట్రను నిర్ధారిస్తున్నాయి
రాష్ట్రంపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే కీలక నిర్ణయాలను గురించిన వివరాలను నోట్ ఫైళ్లలో చేర్చలేదని తెలిపారు. రికార్డుల్లో చేర్చకుండా ఈ విధంగా కీలక నిర్ణయాలను ఎందుకు తీసుకున్నారో దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. 30.12.2014 న ఒకేరోజు ఆ ఆరు జీవోల జారీకి తమపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని సంబంధిత ఉద్యోగులు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. ఇవన్నీ కూడా రాజధాని నిర్ణయం, భూముల కొనుగోళ్ల వెనుక భారీ కుట్ర ఉందన్న విషయాన్ని నిర్ధారిస్తున్నాయని చెప్పారు. అలాగే అప్పటి సీఎం చంద్రబాబునాయుడుకు, తెలుగుదేశం పార్టీకి సన్నిహితులైన కొందరు వ్యక్తులు, కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా అమరావతి రాజధాని నిర్ణయం జరిగిందన్న దానిని కూడా ఆ ఉద్యోగుల వాంగ్మూలాలు నిర్ధారిస్తున్నాయని కోర్టుకు నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment