మాట్లాడుతున్న చీరాల మార్కెట్ యార్డు చైర్మన్ గ్రెగోరీ
తాడికొండ: చంద్రబాబు ఆడుతున్న రాక్షస క్రీడలో దళితులు, బలహీన వర్గాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని చీరాల మార్కెట్ యార్డు చైర్మన్ మార్పు గ్రెగోరీ అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు కోర్టుకు వెళ్లలేరనే ధీమాతోనే చంద్రబాబు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్ మీడియం విద్యపై అమెరికాలో ఉన్న ఎన్నారైలతో కోర్టుల్లో తప్పుడు కేసులు వేయించి అడ్డుకుంటున్నారని విమర్శించారు. మాతృభాషపై బాబుకు నిజంగా మమకారం ఉంటే కార్పొరేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం రద్దు చేయించి.. తన మనవడు దేవాన్ష్ను సైతం తెలుగు మీడియం పాఠశాలలో చదివించాలని సవాల్ చేశారు.
పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు
అమరావతి దీక్షల్లో ‘ఆడీ కార్ల రైతుల’తో హంగామా చేయిస్తున్న బాబు.. పేదలు, దళిత వర్గాలు రాజధానిలో నిరసనలు తెలియజేస్తుంటే దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. దళిత నేతలు నత్తా యోనారాజు, పెరికే వరప్రసాద్, పిడతల అభిషేక్, శీలం శ్యామ్, బేతపూడి సాంబయ్య, కోపూరి నాని బాబు, నూతక్కి జోషి, పైడి రాజేష్, డేవిడ్ కుమార్, సుభాషిణి, బూదాల సలోమి, సౌమ్య, పులి దాసు, గంజి రాజేంద్ర, కొలకలూరి లోకేష్, ఈపూరి ఆదాం పాల్గొన్నారు. కాగా, బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దళిత సంఘాలు, నాయకులు వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చి తమ మద్దతు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment