
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ హయాంలో రాజధాని అమరావతి పరిధిలో అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి జరిగిన అక్రమాలను వెలికి తీయడంలో ఉపకరించే కీలక దర్యాప్తును హైకోర్టు నిలిపివేయడంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తుళ్లూరు మండలంలో ఎస్సీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను గత ప్రభుత్వం రాజధాని కోసం తీసుకుంటే పరిహారం రాదంటూ నమ్మించి భూములు బదలాయించిన వ్యవహారంపై దర్యాప్తు జరుపుతుండగా హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.
స్టే సమర్థనీయం కాదు: రోహత్గీ, నజ్కీ
ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, మెహఫూజ్ నజ్కీ వాదనలు వినిపించారు. ముందుగా ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘ప్రతివాదులపై ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధం ) చట్టం–1977లోని సెక్షన్ 7 కింద ఫిబ్రవరి 27న సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై ప్రతివాదులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు గతంలో ఈ కోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా విస్మరించింది. ఎఫ్‌ఐఆర్ నమోదైన రెండు వారాల్లోనే దర్యాప్తుపై స్టే ఇచ్చింది. ఇక్కడ నిందితులు బ్రహ్మానందరెడ్డి తదితరులపై ఉన్న ఆరోపణలు చిన్నవి కావు. వేలాది ఎకరాల భూములకు సంబంధించినవి. ఇందులో కొందరు అధికారులు కూడా భాగస్వాములుగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ హైకోర్టు స్టే విధించింది. అసైన్డ్ భూములను రాజధాని కోసం ప్రభుత్వం తీసుకుంటే నష్టపరిహారం రాదని, తమకు బదిలీ చేస్తే కొంత డబ్బు చెల్లిస్తామని నిరుపేదలను వంచించారు. ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుడికి ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇవ్వలేదు. ఈ వ్యవహారంలో ప్రతివాది, అప్పటి తుళ్లూరు ఎమ్మార్వో అన్నే సుధీర్‌బాబుతో సహా మరికొందరు అధికారులు నిందితులతో కుమ్మక్కయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిగితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడం సమర్థనీయం కాదు’ అని నివేదించారు.
ఎఫ్‌ఐఆర్ తర్జుమాలో తప్పులున్నాయి..
‘తెలుగులో ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను ఇంగ్లిష్‌లో అనువదించినప్పుడు తప్పులు చోటు చేసుకున్నాయి. అవి సరిచేయకుండా, మా అభిప్రాయం చెప్పకుండా దీనిపై ముందుకు వెళ్లరాదు..’ అని ప్రతివాది తరçఫున సీనియర్ న్యాయవాది లూత్రా కోరడంతో ధర్మాసనం స్పందిస్తూ ప్రతివాదికి నోటీసులు జారీచేసింది. ఈనెల 21వ తేదీలోపు పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
త్వరగా పరిష్కరించాలని హైకోర్టుకు సూచిస్తాం..
ఈ వ్యవహారానికి, రాజధానికి సంబంధం లేదని ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా పేర్కొనటంతో వెంటనే న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు దీనిపై జోక్యం చేసుకుంటూ ‘తుళ్లూరు అమరావతి పరిధిలోనిదే కదా..’ అని ప్రశ్నించారు. ‘దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో మేం సంతృప్తిగా లేం. ఆరోపణలు కేవలం ఒక్క బ్రహ్మానందరెడ్డితో ముడిపడి లేవు. ఇందులో భారీ కుంభకోణం కూడా ఉండవచ్చు కదా. అందులో ఏముందో తెలియదు.. దర్యాప్తు కొనసాగేందుకు అనుమతించాలి కదా.. అందువల్ల ఈ కేసును త్వరగా పరిష్కరించాలని మేం హైకోర్టుకు సూచిస్తాం..’ అని జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు.