
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని, వికేంద్రీకరణ, మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ పార్టీ విధానమన్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ మేరకు సచివాలయంలోని తన చాంబర్‌లో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలతో బొత్స సమావేశమై పురపాలక పాఠశాలల స్థితిగతులను సమీక్షించారు. ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, రఘువర్మ, కల్పలత, షేక్ సాబ్జీ, శ్రీనివాసులురెడ్డి, ఐ.వెంకటేశ్వరరావులతోపాటు పురపాలక శాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ముఖ్యంగా మున్సిపల్ ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్, పదోన్నతులు, బదిలీలు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డ్రాయింగ్ అండ్ డిసర్బసింగ్ ఆఫీసర్లుగా బాధ్యతలు, ఖాళీ పోస్టుల భర్తీ, అప్‌గ్రెడేషన్ అయిన స్కూళ్లకు పోస్టుల మంజూరు వంటి అంశాలను బొత్స దృష్టికి తెచ్చారు. కొన్ని జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలను ఇంటర్మీడియెట్ స్థాయికి పెంచినట్లే.. మున్సిపల్ స్కూళ్లను కూడా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రిని కోరారు. దీనిపై బొత్స సానుకూలంగా స్పందించారు. ఆయా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment