హిందూపురం అంబేడ్కర్ సర్కిల్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ
హిందూపురం: మూడు రాజధానులతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమంటూ హిందూపురం విద్యార్థులు నినదించారు. ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ అనంతపురం జిల్లా హిందూపురంలో విద్యార్థులు గురువారం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఏపీ ఆగ్రో చైర్మన్ నవీన్ నిశ్చల్ పిలుపు మేరకు దాదాపు 3వేల మందికి పైగా విద్యార్థులు బ్యానర్లు, ప్లకార్డులు చేతబూని స్థానిక మార్కెట్‌నుంచి మెయిన్‌బజారు, గాంధీ సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్, సద్భావన సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు కదం తొక్కారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు మనోజ్ మిట్టు, నాగభూషణం మాట్లాడుతూ.. రాయలసీమకు అన్యాయం చేయడానికి కొందరు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రాభివృద్ధితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అనంతరం మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. కార్యక్రమంలో వైస్సార్‌సీపీ సీనియర్ నాయకులు నరసింహరెడ్డి, దాదు, గిరి, సల్మాన్, గౌతమ్, అజయ్, వసీం, వరుణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment