మణిపూర్ నుంచి క్షేమంగా విజయవాడకు చేరుకున్న విద్యార్థులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: అల్లర్లు చెలరేగడంతో కర్ఫ్యూ విధించిన మణిపూర్‌లో చిక్కుకుపోయి క్షణక్షణం భయంభయంగా గడిపిన మన విద్యార్థులు 163 మందిని ప్రత్యేక విమానాలు, బస్సుల్లో సురక్షితంగా స్వస్థలాలకు తరలించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించడంతో తల్లిదండ్రులు ఊరట చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో విద్యార్థులను భద్రంగా స్వస్థలాలకు తరలిస్తోంది.
నాలుగు రోజులుగా తిండి, నీరు లేకపోవడంతోపాటు తుపాకులు, బాంబుల మోతలతో నిద్రలేని రాత్రులు గడిపినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రాగానే తక్షణం స్పందించి రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఎంపీలు, అధికారులు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని విద్యార్థులకు భరోసా కల్పించి సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్సులు సైతం ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విద్యార్థులు ప్రత్యేక బస్సుల్లో స్వగ్రామాలకు బయలుదేరుతూ థ్యాంక్యూ సీఎం సర్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమను మణిపూర్ నుంచి హైదరాబాద్ వరకు తీసుకొస్తే చాలనుకుంటే స్వగ్రామాలకు వెళ్లేందుకు కూడా బస్సులను సమకూర్చడం తమ యోగ క్షేమాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధకు నిదర్శనమని గుంటూరు జిల్లాకు చెందిన అవినాష్ అనే విద్యార్థి పేర్కొన్నాడు.
మణిపూర్‌లో విద్యాసంస్థల నుంచి బయలుదేరింది మొదలు స్థానిక పోలీసుల భద్రతతో ఇంఫాల్ ఎయిర్‌పోర్టుకు తరలించడమే కాకుండా రవాణా, భోజన వసతులను కూడా ప్రభుత్వమే భరించడం పట్ల కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. రోజూ తాగడానికి ఒక బాటిల్ మాత్రమే మంచి నీళ్లు ఇస్తున్న విషయాన్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తేవడంతో ధైర్యం చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి ఏర్పాట్లు చేసినందుకు విజయనగరం జిల్లాకు చెందిన ఒక విద్యార్థి ధన్యవాదాలు తెలిపాడు. సురక్షితంగా తమ గ్రామానికి చేర్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన హర్షిత, కృష్ణా జిల్లాకు చెందిన రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎయిర్‌పోర్టులో విద్యార్థులతో ఎంపీ భరత్‌రామ్
ఇంఫాల్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులను ఎయిర్‌పోర్టులో వైఎస్సార్ సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి చేదు అనుభవాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం వారంతా ప్రత్యేక బస్సుల్లో బయలుదేరేలా దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించారు. క్షేమంగా విద్యార్థుల తరలింపుపై ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు ఎంపీ భరత్‌రామ్ తెలిపారు.
కోల్‌కతా నుంచి మూడు ఫైట్లలో 55 మంది
మణిపూర్ నుంచి రాష్ట్రానికి చెందిన 163 మంది విద్యార్థులను సురక్షితంగా తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఇండిగో ఏ 320 ఫ్లైట్‌లో సోమవారం మధ్యాహ్నం 12.45కు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్న విద్యార్థులను అక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల్లో స్వగ్రామాలకు పంపారు. మణిపూర్ నుంచి మరో 55 మంది విద్యార్థులు కోల్‌కతా విమానాశ్రయం చేరుకోగా వారిని మూడు ఫ్లైట్స్ ద్వారా హైదరాబాద్ తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం టిక్కెట్లు బుక్ చేసింది. 27 మంది, 15 మంది, 13 మంది చొప్పున మూడు ఫ్లైట్స్‌లో తరలించేలా ఏర్పాట్లు చేశారు. కోల్‌కతాలో దిగిన విద్యార్థులు విమానాలు ఎక్కేవరకు ఆహార ఏర్పాట్లను స్థానిక అధికారులతో మాట్లాడి సిద్ధం చేశారు.
► ఇంఫాల్‌లో ఇంజనీరింగ్ నాలుగో ఏడాది చదువుతున్న దాసరి యాదిత్యపాల్ ప్రత్యేక విమానంలో సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నట్లు ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడు గ్రామానికి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు ‘సాక్షి’కి వెల్లడించారు. తమ కుమారుడిని క్షేమంగా రప్పించిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
► ప్రత్యేక విమానంలో సురక్షితంగా వచ్చిన వారిలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి మతుకుమల్లి హేమమాల ఉన్నారు. ఆమె సోమవారం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.
ఏజెన్సీ విద్యార్థులు సురక్షితం
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటకు చెందిన కే.హేమంత్‌బాబు (ఎన్‌ఐటీ), పాడేరుకు చెందిన అనిల్‌కుమార్, బి.సేలియంట్ జోయ్‌ఫర్ (ఐఐఐటీ) ప్రత్యేక విమానంలో సోమవారం సురక్షితంగా కోల్‌కతా చేరుకున్నారు. తమ పిల్లలను క్షేమంగా తరలించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మా పిల్లలకు పునర్జన్మ ప్రసాదించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. ఏపీ భవన్ అధికారులతో సంప్రదించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు కృతజ్ఞతలు’ అని కాంట్రాక్ట్ హెల్త్ ఉద్యోగిగా పని చేస్తున్న ఏలీషారావు పేర్కొన్నాడు.
–ఏలీషారావు కాంట్రాక్ట్ హెల్త్ ఉద్యోగి, పాడేరు
► మణిపూర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నా కుమారుడు బి.కల్యాణ్‌కుమార్‌ను సురక్షితంగా రప్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. మంగళవారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంటానని నా కుమారుడు ఫోన్‌లో తెలియజేశాడు.
– ముసలయ్య (కల్యాణ్‌కుమార్ తండ్రి)
► ప్రభుత్వం తమను స్వస్థలాలకు తరలించేందుకు చేసిన ఏర్పాట్లను జీవితాంతం గుర్తుంచుకుంటామని మణిపూర్ ఎన్‌ఐటీలో బీటెక్ చదువుతున్న ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన విద్యార్థి కె.చరణ్‌దత్ ‘సాక్షి’తో పేర్కొన్నాడు.
► మణిపూర్ ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్నా. తినడానికి ఏమీ దొరకక పస్తులున్నాం. తాగే నీళ్లల్లో సైతం విషపదార్థాలు కలిపే ప్రయత్నాలు చేశారు. చాలా భయపడ్డాం. ప్రత్యేక విమానంలో కోల్‌కతా చేరుకున్నాం. మాకు సాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– పవన్‌కళ్యాణ్, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా.
► మా పెద్ద కుమారుడు ఎన్.కార్తీక్ మణిపూర్‌లోని ఎన్‌ఐటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లాడు. అక్కడ జరుగుతున్న ఘర్షణలతో ఎంతో ఆందోళన చెందాం. ప్రభుత్వం సకాలంలో స్పందించింది. మా కుమారుడు రాత్రికి తిరుపతిలోని కొర్లగుంట చేరుకుంటానని ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
–రెడప్ప, మాధవి, తిరుపతి (విద్యార్థి కార్తీక్ తల్లిదండ్రులు)
► మా కుమార్తె భవ్యసాయి మణిపూర్‌లోని ఎన్‌ఐటీలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. సీఎం జగన్ సర్కార్ వెంటనే స్పందించి అండగా నిలిచింది. ప్రస్తుతం మా కుమార్తె హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి చేరుకుంది. సమస్య తలెత్తిన వెంటనే ప్రభుత్వం స్పందించడం ఎంతో సంతోషంగా ఉంది.
–హరికృష్ణ, తిరుపతి (విద్యార్థిని భవ్యసాయి తండ్రి)
Comments
Please login to add a commentAdd a comment